Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే ధనిక గ్రామం మన దేశంలోనే.. ఎక్కడ ఉందంటే?

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉన్న మాదాపర్ గ్రామం సుమారు ₹7,000 కోట్ల బ్యాంక్ డిపాజిట్లతో ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామాల్లో ఒకటిగా నిలిచింది.

By:  Tupaki Political Desk   |   17 Feb 2026 9:00 PM IST
ప్రపంచంలోనే ధనిక గ్రామం మన దేశంలోనే.. ఎక్కడ ఉందంటే?
X

ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడ ఉంది? అనే ప్రశ్నకు సమాధానం కాస్తా ఆలోచిస్తూ యూరోపియన్ దేశంలో.. కాదు కాదు.. అమెరికన్ ఉపనగరంలోనా అని ఆన్సర్ తడుతుంది.. కానీ భారత్ లో అంటే మనకు నిజంగానే తట్టదు.. కానీ ఇది నిజం.. ముమ్మాటికీ నిజం.. మన దేశంలోనే ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉన్న మాదాపర్ గ్రామం సుమారు ₹7,000 కోట్ల బ్యాంక్ డిపాజిట్లతో ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. గ్రామం అంటే చిన్న ఇళ్లు, వ్యవసాయం, పరిమిత వనరులు అన్న భావనను ఇది పూర్తిగా మార్చేసింది.

మాదాపర్ ప్రత్యేకత ఏమిటంటే..

ఈ గ్రామంలో 17కు పైగా బ్యాంక్ శాఖలు ఉన్నాయి. గ్రామం జనాభాతో పోలిస్తే ఇది ఆశ్చర్యకర సంఖ్య. సాధారణంగా నగరాల్లో కూడా ఇంత బ్యాంకింగ్ సౌకర్యం కనిపించదు. కానీ ఈ గ్రామంలో ప్రతి కుటుంబం పొదుపు సంస్కృతిని జీవిత విధానంగా మార్చుకుంది.

ఈ గ్రామం అభివృద్ధికి మూలం ‘విదేశీ వలస’

మాదాపర్‌కు చెందిన వేలాది మంది బ్రిటన్, అమెరికా, కెనడా, ఆఫ్రికా వంటి దేశాల్లో స్థిరపడ్డారు. అక్కడ వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూ మంచి సంపాదనను ఆర్జించారు. అయితే సంపాదనంతా విదేశాల్లోనే ఉంచకుండా.. తమ సొంత ఊరి బ్యాంకుల్లోనే జమ చేయడం వారి ప్రత్యేకత. పుట్టిన నేలపై ఉన్న మమకారం, గ్రామంతో ఉన్న అనుబంధం.. ఇవే ఈ ఆర్థిక అద్భుతానికి మూలాధారం.

ఈ డిపాజిట్లు కేవలం గర్వకారణం మాత్రమే కాదు.. గ్రామ ఆర్థిక వ్యవస్థకు బలమైన బేస్. బ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు పెట్టడంతో రుణాల సౌకర్యం సులభం. స్థానిక వ్యాపారాలు, ఇళ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తోంది. గ్రామంలో విద్య, ఆరోగ్యం, రహదారులు వంటి రంగాల్లో కూడా మంచి పురోగతి కనిపిస్తోంది.

ముఖ్యమైన పాఠం చెప్తున్న మదాపర్..

మాదాపర్ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతోంది.. ‘పొదుపు’ ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, ఒక గ్రామాన్ని కూడా ఆర్థికంగా బలంగా చేయగలదు. విదేశాల్లో ఉన్నప్పటికీ తమ మూలాలను మరచిపోకుండా, ఆర్థికంగా బలోపేతం చేయాలనే తపన ప్రతి గ్రామానికి ఆదర్శం.

ఈ గ్రామంలో ప్రజలు ఖర్చు చేసే విధానంలో కూడా క్రమశిక్షణ కనిపిస్తుంది. అవసరమైన చోట ఖర్చు చేస్తారు, మిగతాదంతా భవిష్యత్తు కోసం దాచుకుంటారు. ఈ పొదుపు మంత్రం తరతరాలుగా కొనసాగుతోంది. పెద్దలు చిన్నవారికి పొదుపు విలువను నేర్పుతారు.

భావోద్వేగ బంధం..

గ్రామం అంటే కేవలం భౌగోళిక సరిహద్దు కాదు.. అది ఒక భావోద్వేగ బంధం. మాదాపర్ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. వారి హృదయం మాత్రం సొంత ఊరితోనే కనెక్టుగా ఉంటుంది. అందుకే సంపాదనలో భాగాన్ని తమ గ్రామ బ్యాంకుల్లోనే ఉంచి, ఆర్థికంగా గ్రామాన్ని బలోపేతం చేస్తున్నారు.

ఈ కథ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలకు ఒక గొప్ప స్ఫూర్తి. పట్టణాలకు వలస వెళ్తే గ్రామం ఖాళీ అయిపోతుందనే భావనను మాదాపర్ తప్పు నిరూపించింది. వలస వెళ్ళినా.. మన మూలాలను మరచిపోకపోతే గ్రామం అభివృద్ధి సాధ్యమే అని ఇది చాటిచెప్పింది. మాదాపర్ కేవలం ధనిక గ్రామం మాత్రమే కాదు.. అది ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు సంస్కృతి, పుట్టిన ఊరిపై ప్రేమ కలయిక. ప్రపంచ పటంలో చిన్న బిందువులా కనిపించినా.. ఆర్థికంగా అది ఒక మహత్తర సందేశాన్ని ఇస్తోంది.

ప్రతి గ్రామం ఇలాంటి పొదుపునే అలవాటు చేసుకోవాలి..

ప్రతి గ్రామం ఇలాంటి పొదుపు సంస్కృతిని అలవాటు చేసుకుంటే.. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడడం ఖాయం. మాదాపర్ కథ మనకు చెబుతున్న సత్యం ఇదే.. ధనం సంపాదించడం గొప్ప విషయం కాదు.. దాన్ని సరిగ్గా దాచుకోవడం, పంచుకోవడం, పుట్టిన నేల కోసం వినియోగించడం మరింత గొప్పది.