Begin typing your search above and press return to search.

మరణశిక్ష పడిన దేశాధినేతలు వీరే.. కారణాలు ఇవే..

ప్రజాస్వామ్యం, సైనిక పాలన, తిరుగుబాట్లు, రాజకీయ ప్రత్యర్థిత్వం విభిన్న ప్రదేశాల్లో తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు నాయకుల ప్రాణాల మీదే పడిన సందర్భాలు చరిత్రలో నమోదయ్యాయి.

By:  Tupaki Political Desk   |   18 Nov 2025 1:07 PM IST
మరణశిక్ష పడిన దేశాధినేతలు వీరే.. కారణాలు ఇవే..
X

ప్రపంచ రాజకీయ చరిత్రలో మరణదండన అనేది అత్యంత ప్రభావం చూపే శిక్ష. సాధారణ నేరగాళ్లకే కాకుండా, దేశాలను నడిపిన నాయకులు కూడా ఈ శిక్షను ఎదుర్కొన్న ఘటనలు అనేకం ఉన్నాయి. ప్రజాస్వామ్యం, సైనిక పాలన, తిరుగుబాట్లు, రాజకీయ ప్రత్యర్థిత్వం విభిన్న ప్రదేశాల్లో తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు నాయకుల ప్రాణాల మీదే పడిన సందర్భాలు చరిత్రలో నమోదయ్యాయి. ఆ జాబితాలో బంగ్లాదేశ్ కోర్టు మాజీ ప్రధాని షక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ తీసుకున్న తాజా నిర్ణయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

షేక్ హసీనాకు మరణ దండన..

1975, ఆగస్ట్ 15న భారత్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కానీ పొరుగున ఉన్న దేశంలో భారీ ప్రళయం జరిగింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ చరిత్రను కుదిపేసిన రక్తపాతం జరిగింది. ఆ దేశానికి జాతిపిత అని పిలిచే.. అప్పటి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి హత్యకు గురయ్యాడు. ఆ హత్యాకాండలో ఆయన కుమార్తె షేక్ హసీనా ఊహించని విధంగా బయటపడింది. దాదాపు 50 ఏళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత బంగ్లాదేశ్‌ కోర్టు ఆమెకు మరణదండన విధించడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ పరిణామాల మధ్య.. మరణశిక్షను ఎదుర్కొన్న ఇతర దేశాధినేతలను ఒకసారి పరిశీలిద్దాం.

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు..

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో, ఆ దేశ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రభావం చూపుతున్న పీపుల్స్ పార్టీ (పీపీపీ) స్థాపకుడు. 1979, ఏప్రిల్ 4న, వయసు 51 ఏళ్లకే, రావల్పిండి జైలులో ఉదయం 2 గంటలకు ఆయనను ఉరి తీశారు. పీపీపీ నాయకుడు అహ్మద్ రెజా కసూరీ హత్యకు భుట్టో ఆదేశించినట్లు కోర్టు నిర్ధారించడంతో మరణ శిక్ష అమల్లోకి వచ్చింది. తర్వాత కూడా ఈ కేసు పాకిస్థాన్ రాజకీయాల్లో వివాదంగా నిలిచింది.

తుర్కియే ప్రధాని అద్నాన్ మెండెరస్..

తుర్కియేలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని అద్నాన్ మెండెరస్ కథ కూడా అంతే దారుణంగా ముగిసింది. రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ దశాబ్దాలపాటు పాలించిన తర్వాత.. మెండెరస్ ప్రభుత్వం వచ్చింది. కానీ సైనిక తిరుగుబాటు అతని అధికారాన్ని కూల్చివేసింది. తర్వాత మర్మరా సముద్రంలోని ఒక దీవిలో జరిగిన కోర్టు విచారణలో ఆయనతోపాటు మరో ముగ్గురికి మరణశిక్ష విధించబడింది. ఆ శిక్ష కొద్ది రోజులకే అమలు చేశారు. దీంతో మెండెరస్ కథ ముగిసింది.

సౌత్ కొరియా చున్ డూ హ్వాన్..

దక్షిణ కొరియాలో చున్ డూ హ్వాన్‌ 1979లో సైనిక తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చాడు. ఏడాది తర్వాత జరిగిన ప్రజల్లో అశాంతి చలరేగడంతో ప్రజాస్వామ్య ఉద్యమం దేశ వ్యాప్తంగా వ్యాపించింది. దీనిని అణచివేయడంలో అతని పాత్రపై తీర్పు కోర్టు తీవ్రంగా స్పందించింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అయితే అప్పీల్ తర్వాత సుప్రీంకోర్టు ఈ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. రాజకీయ అణచివేత, సైనిక పాలన చర్చల్లో ఈ కేసు ఇప్పటికీ ఉదాహరణగా ప్రపంచం చెప్పుకుంటుంది.

ఇరాక్ నేత సద్దాం హుసేన్ మరణం కూడా..

2006, డిసెంబరు 30న ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్‌ ను ఆ దేశం ఉరి తీసింది. ఈ మరణం అంతర్జాతీయంగా అత్యంత హైప్రొఫైల్ శిక్షల్లో ఒకటిగా నిలిచింది. 1982లో తనపై జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో 148 మంది షియా ముస్లింల మరణాలకు బాధ్యత వహించినట్లు కోర్టు నిర్ధారించింది. ఉత్తర బాగ్దాద్‌లోని కడీమియా ప్రాంత సైనిక నిఘా కార్యాలయంలో మరణదండన అమలు చేశారు. సద్దాం మరణం మధ్యప్రాచ్య రాజకీయాల్లో శక్తి సమీకరణాలను మార్చేసింది.

మరో పాకిస్థాన్ నేత ముషారఫ్..

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్‌పై కూడా మరణ శిక్ష ఖరారైంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎమర్జెన్సీ విధించారనే ఆరోపణలపై ప్రత్యేక కోర్టు తీర్పును ప్రకటించింది. 2020, జనవరిలో ఆయనకు విధించిన మరణ దండనను హైకోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ, ఇది పాకిస్థాన్ న్యాయ, రాజకీయ చరిత్రలో సంచలన తీర్పుగా నిలిచింది.

ప్రపంచ రాజకీయాల్లో అత్యంత తీవ్రమైన శిక్షకు గురైన నాయకుల జాబితా పెద్దదే అయినప్పటికీ, ఈ ఐదు కేసులు చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం సంపాదించుకున్నాయి. అవి అధికార దుర్వినియోగం, సైనిక తిరుగుబాట్లు, తీవ్ర రాజకీయ సంక్షోభాలు దేశాధినేతల భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో చూపించే ఘట్టాలుగా మిగిలిపోయాయి.

ఈ ఉదంతాలను పరిశీలిస్తే, రాజకీయ అస్థిరత, సైనిక జోక్యాలు, వ్యక్తిగత అధికార పోరాటాలు నాయకత్వాన్ని ఎంత ప్రమాదంలోకి నెట్టుతాయో స్పష్టం అవుతుంది. ప్రజాస్వామ్యం ఉన్నా లేకపోయినా, అధికారం తప్పు దిశలో నడిస్తే దేశాధ్యక్షులకే ప్రాణహాని ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుందని చరిత్ర పదేపదే చాటుతోంది. మరణశిక్షల చుట్టూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు కొనసాగుతున్నప్పటికీ, రాజకీయ హత్యలు, తిరుగుబాట్లు, రాజ్యాంగ విరోధ చర్యల నేపథ్యంలో కొన్ని ప్రభుత్వాలు అత్యంత తీవ్ర శిక్షలను అమలు చేశాయి.