నిశ్శబ్దమే బలం.. ప్రపంచాన్ని మార్చిన ఇంట్రోవర్టులు..!
ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే వాళ్లే శక్తివంతులు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ నిశ్శబ్దంగా ఉండే మనసులు కూడా ప్రపంచాన్ని మార్చగలవని గుర్తు చేసే రోజే వరల్డ్ ఇంట్రోవర్ట్ డే.
By: Priya Chowdhary Nuthalapti | 2 Jan 2026 12:40 PM ISTప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే వాళ్లే శక్తివంతులు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ నిశ్శబ్దంగా ఉండే మనసులు కూడా ప్రపంచాన్ని మార్చగలవని గుర్తు చేసే రోజే వరల్డ్ ఇంట్రోవర్ట్ డే. ప్రతి సంవత్సరం జనవరి 2న ఈ రోజును జరుపుకుంటారు. 2026లో కూడా ఈ రోజు..ప్రశాంతంగా ఆలోచించే వారి విలువను గుర్తు చేస్తోంది.
ఇంట్రోవర్ట్ అంటే ఎవరు..!
ఇంట్రోవర్ట్ అంటే ఒంటరిగా లేదా చిన్న గ్రూప్‌లో ఉండటం ఇష్టపడే వ్యక్తి. ఎక్కువ శబ్దం..హడావుడి కంటే ప్రశాంతతలో ఉండి ఆలోచించడం వారికి నచ్చుతుంది. లోతైన ఆలోచనలు, అర్థవంతమైన మాటలు వారి ప్రత్యేకత. ఈ రోజు మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. నిశ్శబ్దంగా ఉండటం వీక్‌నెస్ కాదు..అది ఒక స్ట్రెంత్.
ఇంట్రోవర్ట్ స్వభావం మనసును బలంగా చేస్తుంది. ఇలాంటి వాళ్లు మాట్లాడే ముందు బాగా ఆలోచిస్తారు. మాటలు తక్కువైనా..వారి పనులు ఎక్కువగా మాట్లాడతాయి. చాలామంది ఇంట్రోవర్ట్‌లను షైగా భావిస్తారు. కానీ షైనెస్ భయం వల్ల వస్తుంది. ఇంట్రోవర్షన్ మాత్రం ప్రశాంతతను ఇష్టపడే అలవాటు మాత్రమే.
ఎంతోమంది గొప్పవారు ఇంట్రోవర్టులే..!
చరిత్రలో చాలా మంది గొప్ప వ్యక్తులు ఇంట్రోవర్ట్‌లే. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ నిశ్శబ్ద జీవితం వల్లే గొప్ప ఆలోచనలు చేశాడు. ఒంటరిగా ఉండటం అతని క్రియేటివిటీకి బలం ఇచ్చింది. అలాగే ఐజాక్ న్యూటన్ కూడా మౌనంగా పని చేస్తూ ప్రపంచానికి ముఖ్యమైన నియమాలు ఇచ్చాడు.
ఆధునిక కాలంలో కూడా ఇంట్రోవర్ట్‌లు కోట్ల మందికి ప్రేరణ. బిల్ గేట్స్ తన ఫోకస్‌తో టెక్నాలజీ రంగాన్ని మార్చాడు. మార్క్ జుకర్‌బర్గ్ తక్కువ మాటలతోనే ఒక పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నిర్మించాడు. అలాగే ఎలీనర్ రూజ్‌వెల్ట్ ప్రశాంత నాయకత్వంతో సమాజంలో మార్పు తీసుకొచ్చింది.
ఈ రోజును ఫెలిసిటాస్ హైనె అనే సైకాలజిస్ట్ ప్రారంభించారు. క్రిస్మస్..న్యూ ఇయర్ పండగల హడావుడి తర్వాత.. ఇంట్రోవర్ట్‌లకు ప్రశాంతత ఇచ్చేందుకు జనవరి 2ను ఎంచుకున్నారు.
మొత్తానికి..వరల్డ్ ఇంట్రోవర్ట్ డే మనకు ఒక పాఠం చెబుతుంది. నిశ్శబ్దం కూడా శక్తివంతమే. లోతుగా ఆలోచించే మనసులు కూడా ప్రపంచాన్ని మార్చగలవు.
