Begin typing your search above and press return to search.

ప్రపంచంలో అత్యంత పోటీతత్వ ఆర్థిక వ్యవస్థలు 2025: భారత స్థానం ఎక్కడ?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతోంది. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు.. ఆర్థిక అస్థిరతల కారణంగా దేశాల పోటీ సామర్థ్యం కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది.

By:  A.N.Kumar   |   22 Aug 2025 1:00 AM IST
ప్రపంచంలో అత్యంత పోటీతత్వ ఆర్థిక వ్యవస్థలు 2025: భారత స్థానం ఎక్కడ?
X

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతోంది. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు.. ఆర్థిక అస్థిరతల కారణంగా దేశాల పోటీ సామర్థ్యం కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. అభివృద్ధి, స్థిరత్వం, అనుకూలత ఆధారంగా దేశాల ర్యాంకులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ వరల్డ్ కాంపిటిటివ్‌నెస్ ర్యాంకింగ్ (WCR) 2025 ప్రకారం ప్రపంచంలో అత్యంత పోటీతత్వ దేశాల జాబితా విడుదల అయింది.

- టాప్-10లో ఎవరు?

2025లో ప్రపంచంలోని టాప్-10 పోటీతత్వ దేశాలలో తూర్పు ఆసియా.. పశ్చిమ యూరప్ దేశాలు ఆధిపత్యం చెలాయించాయి. ఈ రెండు ప్రాంతాలు కలిసి మొత్తం టాప్-10లో 70% స్థానాలను పొందాయి.

స్విట్జర్లాండ్: ఈ దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిచి, ఈ సంవత్సరం కూడా వరుసగా టాప్‌లో నిలిచింది.

సింగపూర్: 2024లో 1వ స్థానంలో ఉన్నప్పటికీ, ఈసారి కొద్దిగా వెనుకబడి రెండో స్థానానికి చేరింది.

హాంగ్ కాంగ్ SAR: ఇది రెండు స్థానాలు పైకి ఎగబాకి టాప్-3లోకి ప్రవేశించింది.

ఇతర దేశాలు కూడా బలమైన పాలన, డిజిటల్-పర్యావరణ మార్పులకు వేగంగా అనుగుణంగా మారడం, సామాజిక ఐక్యతను కాపాడుకోవడంలో తమ ప్రతిభను చాటుకున్నాయి.

- కొత్తగా జాబితాలోకి

2025లో మొదటిసారిగా నమీబియా, కెన్యా, ఒమన్ దేశాలు పోటీతత్వ సూచికలో చోటు దక్కించుకున్నాయి. ఇక కెనడా అత్యంత వేగంగా పైకి వచ్చిన దేశంగా నిలిచి, ఎనిమిది స్థానాలు దూసుకుపోయి 11వ స్థానంలో నిలిచింది.

భారత స్థానం

భారతదేశం మాత్రం గత సంవత్సరాలతో పోలిస్తే వెనకబడింది. 2022లో - 37వ స్థానంలో ఉన్న ఇండియా.. ఆ తర్వాత 2024లో 39వ స్థానానికి.. 2025లో 41వ స్థానానికి పడిపోయింది. అంటే ఈసారి భారతదేశం రెండు స్థానాలు వెనక్కి జారింది. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన ప్రదర్శన, వ్యాపార సామర్థ్యం పరంగా మంచి స్కోర్లు సాధించినప్పటికీ, మౌలిక వసతులు.. పాలన సామర్థ్యంలో ఉన్న బలహీనతల కారణంగా ఈ ర్యాంకు దెబ్బతింది.

ప్రపంచ ఆర్థిక పోటీ పటంలో భారతదేశం ఇంకా మధ్యస్థానంలో ఉన్నప్పటికీ, మౌలిక సదుపాయాలు.. పాలనలో సంస్కరణలు చేపడితే రాబోయే సంవత్సరాల్లో టాప్-30లోకి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.