Begin typing your search above and press return to search.

ప్రైవేట్ ఉద్యోగులకు 'రైట్ టు డిస్కనెక్ట్' అవసరమేనా?

నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత కూడా కాల్స్, ఇమెయిల్స్ , మెసేజ్‌లకు స్పందించాలనే అలిఖిత నియమం ప్రబలంగా ఉంది.

By:  A.N.Kumar   |   8 Oct 2025 3:00 AM IST
ప్రైవేట్ ఉద్యోగులకు రైట్ టు డిస్కనెక్ట్ అవసరమేనా?
X

ప్రైవేట్ రంగ ఉద్యోగులకు 'రైట్ టు డిస్కనెక్ట్' అనే హక్కు అత్యంత అవసరం. డిజిటల్ యుగంలో, పని , వ్యక్తిగత జీవితాల మధ్య గీత చెరిగిపోతున్న తరుణంలో ఈ చట్టపరమైన రక్షణ భారతదేశంలోని లక్షలాది ఉద్యోగుల శ్రేయస్సు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకంగా మారింది.

* 24x7 లభ్యత సంస్కృతి - దాని ప్రభావం

నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత కూడా కాల్స్, ఇమెయిల్స్ , మెసేజ్‌లకు స్పందించాలనే అలిఖిత నియమం ప్రబలంగా ఉంది. ఇది ఉద్యోగులను నిరంతరం 'ఆన్-డ్యూటీ' మోడ్‌లో ఉంచుతోంది. నిరంతర పని కారణంగా, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు , వ్యక్తిగత అభిరుచులకు సమయం కేటాయించలేకపోతున్నారు. ఇది కుటుంబ విభేదాలు , సామాజిక ఒంటరితనానికి దారితీస్తుంది. నిరంతర ఒత్తిడి , నిద్రలేమి కారణంగా ఉద్యోగులు బర్న్‌అవుట్ వంటి తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారత దేశం 'గ్లోబల్ లైఫ్-వర్క్ బ్యాలెన్స్ ఇండెక్స్ – 2025'లో 42వ స్థానంలో ఉండడం ఈ సమతుల్యత లోపాన్ని స్పష్టం చేస్తోంది.

*'రైట్ టు డిస్కనెక్ట్' అంటే ఏమిటి?

'రైట్ టు డిస్కనెక్ట్' అంటే నిర్ణీత పని సమయం ముగిసిన తర్వాత ఉద్యోగులు తమ ఆఫీస్ పనికి సంబంధించిన ఇమెయిల్స్, కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించాల్సిన అవసరం లేదు. దీని కోసం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. ఇది ఉద్యోగులు పని నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకునే హక్కును కల్పిస్తుంది.

*చట్టబద్ధత – ప్రపంచ అనుభవం

ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఈ హక్కును చట్టబద్ధం చేసి, ఉద్యోగులకు ఉపశమనం కల్పించాయి. ఫ్రాన్స్ 2017లోనే 'రైట్ టు డిస్కనెక్ట్' చట్టాన్ని అమలు చేసింది. దీని వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరిగిందని.. ఒత్తిడి తగ్గిందని పరిశోధనలు వెల్లడించాయి. ఇతర దేశాలు జర్మనీ, ఇటలీ, స్పెయిన్, కెనడా , బెల్జియం వంటి దేశాలు కూడా ఈ దిశగా చర్యలు తీసుకున్నాయి లేదా చట్టాలను అమలు చేశాయి.

*భారతదేశంలో తాజా ప్రయత్నాలు

భారతీయ కార్పొరేట్ సంస్కృతిలో మార్పు రావాల్సిన అవసరాన్ని గుర్తించి, కొన్ని రాష్ట్రాల్లో చర్యలు మొదలయ్యాయి. కేరళ బిల్లు పెడుతోంది. కేరళలో ఎమ్మెల్యే జయరాజ్ ప్రతిపాదించిన 'రైట్ టు డిస్కనెక్ట్' బిల్లు, ఆఫీస్ వేళల తర్వాత ఉద్యోగులు పనికి దూరంగా ఉండేందుకు రక్షణ కల్పిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఒక ముందడుగు.

మెరుగైన జీవన ప్రమాణం కోసం

'రైట్ టు డిస్కనెక్ట్' అనేది కేవలం పని చేయకపోవడం గురించి కాదు. ఇది మానవ హక్కుల పరిరక్షణ గురించి. ఉద్యోగులకు విశ్రాంతి తీసుకునే, వ్యక్తిగత జీవితాన్ని గడిపే.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే మౌలిక హక్కు ఉంది. ఈ చట్టం అమలులోకి వస్తే, కేవలం ఉద్యోగుల జీవన ప్రమాణాలు మాత్రమే కాదు, దీర్ఘకాలంలో వారి ఉత్సాహం, ఉత్పాదకత కూడా పెరుగుతాయి.

వ్యక్తిగత - వృత్తిపరమైన జీవితాల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యత సాధించడానికి, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, 'రైట్ టు డిస్కనెక్ట్' చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురావడం అత్యవసరం.