కళ్లతోనే మహిళలను ఎక్స్-రే తీసే మన మగ మహానుభావులు.. ఆ చూపులకు ఆస్కార్ ఇవ్వాల్సిందే
ఢిల్లీలో నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది మహిళలు, బాలికలు బహిరంగ ప్రదేశాల్లో పురుషుల వేధింపుల చూపులను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. 1,588 మందిపై నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో స్టేషన్లు, పార్కుల్లోనూ మహిళలు భయపడుతున్నారని, వారి భద్రతకు పోలీసు చర్యలతో పాటు పురుషుల ఆలోచనా ధోరణిలో మార్పు అవసరమని నివేదిక స్పష్టం చేసింది.
By: A.N.Kumar | 25 Nov 2026 11:19 PM ISTమన దేశంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందంటే.. జేబులో ఫోన్ లేకపోయినా.. కళ్లలోనే హై-రిజల్యూషన్ స్కానర్లు అమర్చుకుని తిరిగే మేధావులు రోడ్ల మీద కోకొల్లలుగా కనిపిస్తున్నారు. ఎదురుగా ఒక మహిళ కనిపిస్తే చాలు.. ఏముందిరా మామా అంటూ.. ఏదో అద్భుతమైన గ్రహాంతర వాసిని చూసినట్లు కళ్లు ఆర్పకుండా.. తల తిప్పకుండా ఎక్స్-రే చూపులతో నిలువెల్లా స్కాన్ చేసేయడం మన మగాళ్ల జన్మహక్కుగా మారిపోయింది. నోటితో ఒక్క మాట అనకపోయినా.. కళ్లతోనే వంద కవితలు.. వెయ్యి కామెంట్లు రాసేసే ఈ కళాకారుల దెబ్బకు మహిళలు రోడ్డుపైకి రావాలంటేనే వణికిపోతున్నారు.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఒక సర్వేలో ఈ కంటి చూపుల కళాపోషణ తాలూకు విశ్వరూపం బయటపడింది. 1,588 మంది మహిళలు.. బాలికల అభిప్రాయాలు సేకరిస్తే.. అందులో ఏకంగా 80 శాతం మంది ఈ కంటి బాణాల బారిన పడుతున్నామని వాపోయారు. అంటే ప్రతి పది మందిలో ఎనిమిది మందికి రోడ్డు మీద నడవడమే ఒక యుద్ధంలా మారిందన్నమాట. ఇక భద్రత విషయానికొస్తే పది మందిలో తొమ్మిది మందికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మెట్రో స్టేషన్ల దగ్గర 87.5 శాతం మంది.. సాయంత్రం అయితే పార్కుల వైపు చూడాలంటే 88.9 శాతం మంది భయంతో వణికిపోతున్నారు. గమ్యస్థానానికి చేరుకోవడానికి ముందే ఈ స్కానింగ్ చూపుల దెబ్బకు సగం ప్రాణం పోతోంది.
ప్రభుత్వాలు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నాయి. మేము వీధికో సీసీ కెమెరా పెట్టాం.. గల్లీకో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇచ్చాం అని గొప్పగా ప్రకటించుకుంటున్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతోంది. దొంగతనం చేస్తే సీసీ కెమెరా పట్టుకుంటుంది.. దాడులు చేస్తే పోలీసులు వస్తారు.. మరి పక్కనే నిలబడి కళ్లతోనే కాటేసే ఈ వికృత చూపులను ఏ టెక్నాలజీతో పట్టుకోవాలి? కంటి చూపుల తీవ్రతను కొలిచే ఐ-స్కానర్ మీటర్లను రోడ్ల మీద పెట్టలేం కదా..
మహిళలు బయటకు అడుగుపెడితే చాలు.. బస్సులో.. మెట్రోలో.. నడిరోడ్డుపై ఎక్కడ చూసినా కొందరు పురుషుల చూపులు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. ఎదుటివారికి ఇబ్బంది కలుగుతోందన్న కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా చూడటానికి కూడా టాక్స్ కట్టాలా? అన్నట్లుగా ప్రవర్తించే ఈ మహానుభావులకు అసలు మగతనం అంటే ఏంటో ఎవరు నేర్పించాలి?
మహిళలకు స్వేచ్ఛ ఇచ్చామని సభల్లో ఉపన్యాసాలు దంచడం కాదు.. వారు ఎలాంటి భయం లేకుండా తలెత్తుకుని రోడ్డుపై నడిచే వాతావరణం కల్పించడం అసలైన నాగరికత. కళ్లతో వేధించడం కొందరికి టైమ్‌పాస్ కావచ్చు.. కానీ దాన్ని భరించే మహిళలకు మాత్రం అది నిత్య నరకం. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మారాల్సింది చట్టాలు కాదు.. ఈ ఎక్స్-రే మనుషుల చూపులు.. ఆలోచనలు..
