వాళ్ళకు వైసీపీ టికెట్లు ఇవ్వాల్సిందేనా ?
వైసీపీలో ఒక చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కనుక 263 సీట్లు పెరిగితే అపుడు సంగతేంటి అని.
By: Satya P | 13 April 2026 9:40 AM ISTవైసీపీలో ఒక చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కనుక 263 సీట్లు పెరిగితే అపుడు సంగతేంటి అని. ఎందుకంటే వైసీపీలో నాయకులకు కొదవ లేదని కాదు, కానీ అలా పెరిగిన సీట్లలో మూడవ వంతు మహిళలకు కేటాయించాల్సి వస్తుంది. అంటే 88 సీట్లు అన్న మాట. అంటే ఎన్ని సీట్లు అదనంగా పెరుగుతాయో అన్ని సీట్లూ మహిళా కోటాకు వెళ్తాయి. ఇది ఒక విధంగా వైసీపీకి సమస్య అని అంటున్నారు ఆ పార్టీ మహిళలకు నాయకత్వం పరంగా ప్రోత్సహించినా ఇంకా అవసరమైన చోట బలమైన లీడర్ షిప్ కొరత ఉంటుంది. అదే సమయంలో ఎక్కడ విమెన్ రిజర్వేషన్ ఉంటుంది అన్నది కూడా ఇప్పటికి అయితే లెక్క తేలదు అని అంటున్నారు.
బలమైన నేతల ప్లేస్ లో :
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన జరగాలి. అది కూడా అధికార పార్టీకి అనుకూలంగా మారవచ్చు అన్న మాట ఉంది. ఎలా అంటే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలలో రెండు వైసీపీకి అనుకూలంగా ఉంటే వాటిలో ఒక దానిని ఇంకో సీటులో కలిపి అక్కడ మరో సీటులో వైసీపీకి ఇబ్బందిగా ఉన్న మండలాన్ని ఇక్కడకు తెస్తే చాలు ఆ సీట్లో వైసీపీకి మైనస్ అవుతుందని అంటున్నారు. అదే విధంగా బలమైన వైసీపీ నేతలు ఉన్న చోట్ల మహిళా రిజర్వేషన్లు కింద వాటిని కేటాయిస్తే అపుడు కూడా కొత్త ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.
సవాల్ తో కూడుకున్నదే :
వైసీపీకి ఈ రకమైన పరిస్థితులు ఎదురైతే రాజకీయంగా సవాల్ గానే ఉంటుంది అని అంటున్నారు. వైసీపీకి మహిళా లీడర్లు లేరని కాదు కానీ కీలకమైన చోట్ల రిజర్వేషన్లు అయ్యే చోట కనుక గట్టిగా అభ్యర్థులు లేకపోతే అప్పటికపుడు తయారు చేసుకోవడం కష్టతరం అవుతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీకి మహిళా లీడర్లు అంటే ఎమ్మెల్సీలుగా ఉన్న వారు మాజీ మేయర్లు, జెడ్పీ చైర్మన్లు మహిళా నేతలు ఉన్నారు. ఇపుడు వీరిని వైసీపీ విపరీతంగా ప్రోత్సహిస్తోంది. రేపు సీట్లు పెరిగి కొత్తగా జరిగే పునర్ వ్యవస్థీకరణ వల్ల ఎక్కడ రిజర్వేషన్లు వచ్చినా ఇబ్బంది లేకుండా తగిన విధంగా సిద్ధం చేస్తే ఎంపిక సులువు అవుతుందని వైసీపీ లెక్క వేసుకుంటోంది అని అంటున్నారు.
వారసురాళ్ళు రెడీ :
ఇక వైసీపీలో ఇపుడు కొత్త సందడి కనిపిస్తోంది. సీనియర్ నేతల వారసురాళ్ళు అయితే మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు. మహిళా రిజర్వేషన్లతో తమకు కచ్చితంగా సీటు దక్కుతుందని వారు ధీమాగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదని పైగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాలు కావడంతో ప్రాధాన్యత ఉంటుందని వారు నమ్ముతున్నారు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆయన అరెస్ట్ తరువాత మీడియా ముందుకు వచ్చి బాగా మాట్లాడి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలాగే మరో మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి కుమార్తె కాకాణి పూజిత కూడా వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ జోరు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చూస్తే గంగాధర నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి నారాయణస్వామి కుమార్తె కృపా లక్ష్మి కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు ఈసారి టికెట్ ఖాయం అని అంటున్నారు. ఇదే తీరున విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష, విశాఖలో మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనూరాధ వంటి వారు రేసులో ముందుకు వస్తున్నారు. మొత్తం మీద వైసీపీలో ఇపుడు పరిస్థితి చూస్తే కనుక మహిళా నాయకురాళ్ళకే గోల్డెన్ చాన్స్ అని అంటున్నారు.
