1996 టు 2026.. మహిళా బిల్లు.. మారని చరిత్ర!
ఇక తాజాగా మహిళా రిజర్వేషన్ చట్టం చేస్తున్నట్లు గురువారం రాత్రి కేంద్రం ప్రకటించింది. గెజిట్ కూడా విడుదల చేసింది.
By: Tupaki Political Desk | 18 April 2026 2:07 PM ISTమహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి పార్లమెంటులో వీగిపోయింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పార్టీలు అన్నీ ఏకీభవిస్తున్నట్లు ప్రకటిస్తున్నా, బిల్లు సభలోకి వచ్చే సరికి రాజకీయ కారణాలతో విభేదిస్తున్నాయి. దీంతో ఏళ్లు గడుస్తున్నా, మహిళా రిజర్వేషన్ చట్టం సాకారం కావడం లేదని అంటున్నారు. నిజానికి మహిళా రిజర్వేషన్ అంశాన్ని మన రాజ్యాంగం రూపొందించిన సమయంలోనే ఆలోచన చేశారు. కానీ ఆచరణ సాధ్యపడలేదు. అలా మొదట్లోనే బ్రేక్ పడిన మహిళా రిజర్వేషన్ అంశం 78 ఏళ్లు కావస్తున్నా ఆచరణలోకి రావడం లేదు.
మళ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లు?
ఇక తాజాగా మహిళా రిజర్వేషన్ చట్టం చేస్తున్నట్లు గురువారం రాత్రి కేంద్రం ప్రకటించింది. గెజిట్ కూడా విడుదల చేసింది. అయితే సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో రిజర్వేషన్ల అమలు ప్రక్రియ నిలిచిపోయినట్లే అంటున్నారు. అయితే కేంద్రం విడుదల చేసిన గెజిట్ ను అమలు చేయాలంటే ఆరు నెలల సమయంలో ఎప్పుడైనా చట్టం చేయొచ్చునని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బిల్లును మళ్లీ ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోందని చెబుతున్నారు. దీంతో 30 ఏళ్ల చరిత్రను తిరగరాసేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా పట్టుదల ప్రదర్శిస్తోందని చెబుతున్నారు.
ఆ లింకుతోనే బ్రేక్
మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లుకు లింకు పెట్టడంతోనే కేంద్ర ప్రతిపాదన పట్టాలెక్కలేదని విశ్లేషిస్తున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ల కోసం ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం కలుగుతుండటమే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగ రచన సమయంలోనే చట్టాన్ని ఆమోదించలేకపోయిన తర్వాత 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉండగా మళ్లీ తెరపైకి తెచ్చారు. అప్పట్లో 13 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో పలు పార్టీల నేతలు సుముఖంగా లేకపోవడంతో సభలో గందరగోళం నెలకొని బిల్లు ఆమోదం పొందలేకపోయింది.
ఓబీసీ ప్రాతినిధ్యం లేకపోవడమే సమస్య
అప్పుడే మహిళా బిల్లు సమీక్షించడానికి సీపీఐ నాయకురాలు గీతా ముఖర్జీ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ బిల్లును అధ్యయనం చేసి ‘చట్టసభల్లో మహిళలకు దాదాపు మూడో వంతు రిజర్వేషన్’ అనే పదం బదులుగా మూడో వంతుకు తగ్గకుండా రిజర్వేషన్ అనే పదం చేర్చాలని సూచించింది. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఇవ్వాలని, ఓబీసీలకూ ప్రాతినిధ్యం ఇవ్వాలని పేర్కొంది. వీటిని చేర్చి కొత్త బిల్లు తీసుకువచ్చినా 1996లో ఏకాభిప్రాయం సాధించలేకపోయారు. బిల్లులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నట్లే ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని సూచనలతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
వాజపేయి నుంచి మోదీ వరకు
ఇక 1998 నుంచి 2004 వరకూ కొనసాగిన వాజపేయి సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు హయాంలో మహిళా బిల్లు ఆమోదం కోసం పలు ప్రయత్నాలు జరిగాయి. 1998 జులై 13న లోక్ సభలో న్యాయశాఖ మంత్రి తంబిదురై మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ, ములాయంసింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఓబీసీ కోటా లేకుండా మహిళా బిల్లును ఆమోదించే ప్రశ్నేలేదని తేల్చిచెప్పారు. అదే ఏడాది డిసెంబరులో బిల్లు తెచ్చే ప్రయత్నాలను లోక్ సభలో మమతా బెనర్జీ గట్టిగా అడ్డుకున్నారు. బీఎస్పీ, ముస్లింలీగ్ తదితర పార్టీలు కూడా బిల్లును సమర్థించలేదు. పాలకపక్షంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా విభేదించినట్లు గుర్తు చేస్తున్నారు.
ఇక వాజ్ పేయి రెండోసారి ప్రధాని అయ్యాక 1999లో మరోసారి బిల్లును తీసుకురాగా, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జీడీ సభ్యులు గట్టిగా వ్యతిరేకించారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వాజపేయి 2000, 2002, 2003 ఏడాదిల్లో కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో వాజపేయి ప్రభుత్వం మహిళా బిల్లును ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ సఫలం కాలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే క్రమంలో వాజపేయి తర్వాత ప్రధానిగా పీఠమెక్కిన మన్మోహన్ సింగ్ కూడా మహిళా రిజర్వేషన్ తీసుకురావాలని ప్రయత్నించారు. 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే ఈ దిశగా అడుగులు వేసినా, ఆర్జేడి తదితర భాగస్వామ్య పక్షాల అభ్యంతరాలతో అమలు సాధ్యం కాలేదు. 2008లో మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరోమారు ప్రయత్నించినా ఫలించలేదు. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందినా లోక్ సభ ఆమోద ముద్ర పడలేదు.
చట్టమైనా అమలు అసాధ్యమా?
ఇక ప్రధాని మోదీ సారథ్యంలో 2023లో కొత్త పార్లమెంటు భవనంలో ప్రత్యేక సమావేశాలు జరిపి మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. నారీ శక్తి వందన్ అభియాన్ పేరిట పలు సవరణలతో తీసుకువచ్చిన ఈ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభ ఆమోద ముద్ర వేశాయి. రాష్ట్రపతి ఆమోదంతో మహిళా బిల్లు తొలిసారిగా చట్టరూపం దాల్చింది. అయితే దీంట్లో ఉన్న సవరణల ప్రకారం 2026లో నిర్వహించే జనగణన అనంతరం నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఈ చట్టం అమలు అవుతుందని నిబంధన చేర్చారు. అయితే దీనికి సవరణలు చేసి తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2026 జనాభా లెక్కలకు బదులుగా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఈ రెండు అంశాలకు లింకు పెట్టడంతోనే విపక్షాలు వ్యతిరేకించాయని అంటున్నారు. దీంతో 30 ఏళ్ల తర్వాత కూడా మహిళా రిజర్వేషన్ అమలుకు దారులు పడలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
