Begin typing your search above and press return to search.

మహిళా బిల్లుకు అందని 'మెజారిటీ' మద్దతు: విపక్షాల ఐక్యత ముందు తలవంచిన సర్కార్!

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందని భావించిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ బిల్లు) లోక్‌సభలో అనూహ్యంగా వీగిపోయింది.

By:  A.N.Kumar   |   17 April 2026 8:06 PM IST
మహిళా బిల్లుకు అందని మెజారిటీ మద్దతు: విపక్షాల ఐక్యత ముందు తలవంచిన సర్కార్!
X

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందని భావించిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ బిల్లు) లోక్‌సభలో అనూహ్యంగా వీగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో పట్టుదలతో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో మోదీ ప్రభుత్వానికి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాల కల నెరవేరుతుందని ఆశించిన మహిళా లోకానికి ఈ పరిణామం తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఓటింగ్ సరళి.. మెజారిటీకి ఆమడ దూరంలో..

శుక్రవారం లోక్‌సభలో ఉత్కంఠభరిత వాతావరణం మధ్య ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. సభకు హాజరైన మొత్తం 528 మంది సభ్యుల్లో అనుకూలంగా 298 మంది.. వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 మంది (2/3 వంతు) సభ్యుల మద్దతు అవసరం. అయితే మ్యాజిక్ ఫిగర్‌కు 54 ఓట్ల దూరంలో బిల్లు నిలిచిపోవడంతో ఇది తిరస్కరించబడినట్లు స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.

విపక్షాల వ్యూహం.. సర్కారుకు భంగపాటు

మహిళా రిజర్వేషన్ల అమలుకు ముందు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) చేపట్టాలనే నిబంధనపై విపక్షాలు మొదటి నుంచీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. "ఇప్పుడే రిజర్వేషన్లు అమలు చేయకుండా భవిష్యత్తులో ఎప్పుడో జరిగే డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేయడం మహిళలను వంచించడమే" అని విపక్ష నేతలు ధ్వజమెత్తారు. ఓటింగ్ సమయంలో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం, ప్రభుత్వం తన మిత్రపక్షాలను కూడా పూర్తిగా ఒప్పించలేకపోవడం ఈ పరాజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మరిన్ని బిల్లుల ఉపసంహరణ

మహిళా బిల్లు పరాజయం పాలైన వెంటనే కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లు-2026, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఒకదాని వెనుక ఒకటిగా కీలక బిల్లులను ఉపసంహరించుకోవడం ఎన్డీఏ ప్రభుత్వ బలహీనతను సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంలో విపక్షాల ఐక్యత పెరగడం, అధికార పక్ష వ్యూహ వైఫల్యం స్పష్టమైంది.రిజర్వేషన్ల అమలుపై ఉన్న సందిగ్ధత మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పుపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపవచ్చు.

ఇక ముందేమిటి?

మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం కావడం కేవలం ఒక చట్టపరమైన వైఫల్యం మాత్రమే కాదు. ఇది దేశ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు అద్దం పడుతోంది. ప్రభుత్వం ఈ అంశంపై మళ్ళీ కొత్త వ్యూహంతో ముందుకు వస్తుందా? లేదా విపక్షాల డిమాండ్ మేరకు డీలిమిటేషన్ నిబంధనను తొలగించి తాజా బిల్లును ప్రవేశపెడుతుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా లోక్‌సభలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీశాయి.