Begin typing your search above and press return to search.

జంతర్ మంతర్ వద్ద ఒంటరి పోరాటం.. గుర్తొచ్చిన 'రియా' సాహసం

నిరసనలకు దేశ రాజధాని హృదయస్థానమైన జంతర్ మంతర్ సరికొత్త పోరాటానికి సాక్ష్యంగా నిలిచింది.

By:  A.N.Kumar   |   3 Oct 2026 12:22 PM IST
జంతర్ మంతర్ వద్ద ఒంటరి పోరాటం.. గుర్తొచ్చిన రియా సాహసం
X

నిరసనలకు దేశ రాజధాని హృదయస్థానమైన జంతర్ మంతర్ సరికొత్త పోరాటానికి సాక్ష్యంగా నిలిచింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ సాగుతున్న ఉద్ధృత నిరసనల్లో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వెనుకాడని ఒక మహిళా నిరసనకారురాలి సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో ఉద్యమ నిప్పురవ్వలా మారుతోంది.

అభయ హస్తంతో అడ్డుగోడలా..

నడిరోడ్డుపై నిరసనకారులను తరలించేందుకు భారీ పోలీస్ బస్సు వేగంగా దూసుకొస్తోంది. వాహనం ముందుకు కదులుతున్నా, పోలీసుల హెచ్చరికలు వినిపిస్తున్నా ఆ యువతి అడుగు వెనక్కి పడలేదు. రెండు చేతులూ చాపేసి కొండంత ధైర్యంతో ఆ భారీ వాహనానికి ఎదురుగా నిలబడింది. వాహనం ముందుకొస్తున్నా చెక్కుచెదరని ఆమె ఆత్మవిశ్వాసం, కంటిపాపలో నిండిన ఆక్రోశం ఆ ప్రాంతాన్ని క్షణకాలం స్తంభింపజేశాయి. అక్కడే ఉన్నవారు ఈ అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో, కొన్ని గంటల్లోనే ఇది ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికలపై వైరల్‌గా మారింది.

'రియా అహిర్' ధైర్యానికి పునర్జన్మ

ఈ దృశ్యం చూసిన ప్రతిఒక్కరికీ కొద్ది నెలల క్రితం నాటి 'రియా అహిర్' ఘటనే గుర్తుకొస్తోంది. నాడు ఫ్యాషన్ మోడల్, సామాజిక కార్యకర్త రియా అహిర్ పోలీస్ వాహనానికి ఎదురొడ్డి నిలబడి చూపిన తెగువ దేశ సరిహద్దులు దాటి మార్మోగింది. అణచివేతపై తిరుగుబాటుకు, సత్యం వైపు నిలబడే శక్తులకు 'రియా అహిర్' పేరు ఒక ప్రతీకగా మారింది. నేడు జంతర్ మంతర్ వద్ద పునరావృతమైన ఈ దృశ్యాన్ని నెటిజన్లు గుండెలకు హత్తుకుంటూ 'రియా మూమెంట్ రిపీట్' అంటూ వేలాదిగా పోస్టులు చేస్తున్నారు. "మన హక్కులను కాపాడుకోవడానికి.. ప్రభుత్వాలను ప్రశ్నించడానికి భయం విడనాడాలి" అంటూ వేలాది మంది నెటిజన్లు ఆ యువతి తెగువను కొనియాడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును గౌరవిస్తూనే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరసనలు తెలపాలనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.

పోరాటాల వేదికపై నూతన అధ్యాయం

తన ప్రాణాలను సైతం లెక్కచేయక, సీజేపీ విద్యార్థుల నిరసనలకు మద్దతుగా ఎదురుగా నిలబడిన ఆ యువతి దృశ్యం కేవలం ఒక వీడియో మాత్రమే కాదు.. అది ఆక్రోశానికి, ఆత్మగౌరవానికి నిదర్శనం. అధికారిక వివరణలు ఎలా ఉన్నప్పటికీ జంతర్ మంతర్ వీధుల్లో ఆ యువతి చూపిన ధైర్యం మాత్రం ప్రజాస్వామ్య పోరాటాల చరిత్రలో మరో మరుపురాని ఘట్టంగా నిలిచిపోతుంది.