వై-ఫై మాదిరిగా వైర్ లెస్ విద్యుత్ వచ్చేస్తోంది... పరిస్థితి ఇలా ఉంటుంది..!
మరీ వెనక్కి వెళ్లనవసరం లేకుండా సెల్ ఫోన్స్ రాకముందు.. ఫోన్లు (ల్యాండ్ లైన్ ఫోన్స్) మాట్లాడాలంటే స్తంభం నుంచి ఇంటికి వైర్ లాగి, దాన్ని ఫోన్ కి కనెక్ట్ చేసేవారు.
By: Raja Ch | 10 Jan 2026 3:00 PM ISTమరీ వెనక్కి వెళ్లనవసరం లేకుండా సెల్ ఫోన్స్ రాకముందు.. ఫోన్లు (ల్యాండ్ లైన్ ఫోన్స్) మాట్లాడాలంటే స్తంభం నుంచి ఇంటికి వైర్ లాగి, దాన్ని ఫోన్ కి కనెక్ట్ చేసేవారు. అది ఎక్కడుంటే అక్కడ నుంచే మాట్లాడాల్సి వచ్చేది. పైగా ఆ వైర్లు ఎప్పుడు కట్ అవుతాయో తెలియని పరిస్థితి! అనంతరం.. తీగలతో సంబంధం తెంపేసి, సెల్ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వైర్ లెస్ ఇంటర్నెట్ ప్రవేశించింది. ఈ సమయంలో.. వైర్ లెస్ విద్యుత్ కూడా వస్తే ఎలా ఉంటుంది.. ప్రస్తుతం ఫిన్లాండ్ ప రిశోధకులు ఆ పనిలోనే ఉన్నారు.. దీనికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
అవును... వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లు అవసరం లేని విద్యుత్ సరఫరాను ఊహించగలమా.. దశాబ్ధాల క్రితం నికోలస్ టెస్లా దీనిపై ఎన్నో కలలుగన్నారన్న విషయం ఎంతమందికి తెలుసు.. అయితే ఆ కలలను నిజం చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు ఫిన్లాండ్ పరిశోధకులు. ప్రధానంగా ఈ వైర్ లెస్ విద్యుత్ ప్రాజెక్టులో ఫిన్లాండ్ లోని ఆల్టో యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తోంది. రెజోనెంట్ కప్లింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించి.. గాలి ద్వారా విద్యుత్ ను పంపించవచ్చని ఈ శాస్త్రవేత్తలు నిరూపించారు! అయితే.. దీనికి విస్తృతమైన వాణిజ్య విస్తరణ అవసరం అని అంటున్నారు.
ఈ సందర్భంగా... వైర్ లెస్ పవర్ ట్రాన్స్ ఫర్ పద్ధతులను ఉపయోగించి ఫిన్లాండ్ బృందాలు గాలి ద్వారా చిన్న పరికరాలకు సక్సెస్ ఫుల్ గా పవర్ అందించాయని చెబుతున్నారు. దీనివల్ల విద్యుత్ నష్టం చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారని అంటున్నారు. అలా అని వైర్ల వ్యవస్థను ఇప్పటికిప్పుడు పూర్తిగా తొలగించలేదు కానీ.. ట్రాన్స్ మీటర్ - రిసీవర్ మధ్య దూరం తక్కువగా ఉన్న సమయంలో ఇది సక్సెస్ ఫుల్ గా పని చేస్తుందని.. దూరం పెరిగే కొద్దీ ప్రసార సామర్థ్యం తగ్గుతుందని.. దీన్ని అధిగమించడంపైనే ఇప్పుడు దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
ఇక ప్రధానంగా... సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ప్రకృతికి ఎంతో నష్టం జరుగుతుందని.. ఎన్నో పక్షి జాతులు అంతరించిపోతున్నాయని.. ఆ ప్రభావం మనిషి ఆరోగ్యంపైనా చూపిస్తుందని అంటున్న వేళ.. గాలిలో విద్యుత్ ను ప్రసారం చేయడం వల్ల ఆ ప్రభావం మనిషి ఆరోగ్యంపై ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు కీలకమైన విషయం కాగా.. దీనిపైనా పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది సక్సెస్ అయితే.. గుండెకు అమర్చే పేస్ మేకర్ వంటి వైద్య పరికరాల విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెబుతున్నారు.
ప్రస్తుతానికి తెరపైకి వస్తోన్న ప్లస్ లు మైనస్ లు..!:
ఈ వై-ఫై తరహా విద్యుత్ అందుబాటులోకి వస్తే.. రకరకాల ఛార్జర్లు లేదా పవర్ బ్యాంకులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండకపోవడంతోపాటు.. ఛార్జింగ్ పోర్ట్ ల గురించి వెతుక్కోవాల్సిన అవసరం, పోటీ పడాల్సిన పరిస్థితి ఉండదు! ఇదే సమయంలో ప్రధానంగా.. సెల్ ఫోన్ లు, ఇయర్ బడ్ ల ఛార్జింగ్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. అదేవిధంగా.. ఆసుపత్రి గదులు, ఫ్యాక్టరీలు, ఫ్యుయల్ సెంటర్స్, తడిగా ఉన్న బహిరంగ ప్రదేశాలలో.. షాకింగ్ కంప్లైట్లు తగ్గించవచ్చు!
ఇక మైనస్ ల విషయానికొస్తే.. ఇందులో ప్రధానంగా ఖర్చు విషయంపై ఇంకా క్లారిటీ లేనందున ఇది సంక్లిష్టమైనది కావచ్చని అంటున్నారు. ఇదే సమయంలో.. ఇప్పటికే భూతాపం పెరుగుతుందని.. దృవాల వద్ద మంచు కరుగుతుందని.. ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగి, పలు దీవులు, దేశాలు సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని అంటున్న వేళ... ఈ వైర్ లెస్ విద్యుత్ వల్ల వాతావరణంలో వేడి ఏ స్థాయిలో పెరుగుతుందనే విషయంపైనా క్లారిటీ రావాల్సి ఉంది!
