పార్లమెంటులో 'సర్-సిందూర' యుద్ధం: ఏం జరుగుతుంది?
మొత్తం 19 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు అటు అధికార ఎన్డీయే కూటమికి, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోని కూటమికి కూడా కీలకమేనని చెప్పాలి.
By: Garuda Media | 29 Nov 2025 8:00 PM ISTపార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 19 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు అటు అధికార ఎన్డీయే కూటమికి, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోని కూటమికి కూడా కీలకమేనని చెప్పాలి. ఇక, ఇరు పక్షాలకు కేంద్రంగా ఉన్న కొన్ని సమస్యలకు కూడా సభ మరింత ఇంపార్టెంట్‌గా మారింది. బీహార్‌లో అద్భుత విజయంతో మంచి ఊపుమీదున్న బీజేపీ.. ఈ సభల ద్వారా.. తాను భవిష్యత్తులో తీసుకురావాలని భావిస్తున్న చట్టాలకు రూపకల్పన చేస్తోంది.
అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ(సర్)ను కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తున్న విషయం తెలిసిందే. ఇదేసమయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి మాత్రం సర్‌ను తీవ్రంగా విభేదిస్తోంది. ఈ నేపథ్యంలో సర్ వివాదం పార్లమెంటును కుదిపేయనుంది. ఇరు పక్షాలు ఇప్పటికే అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి. ఇక, మరో కీలక విషయం ఆపరేషన్ సిందర్ వ్యవహారం. పాకిస్థా న్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఉగ్రస్థావరాలే లక్ష్యంగా జరిపిన ఆపరేషన్ సిందూర్ ప్రజల మన్ననలు పొం దింది.
అయితే.. ఈ దాడులను భారత ప్రభుత్వం అనూహ్యంగా రాత్రికిరాత్రి నిలిపివేసింది. దీనికి భారత్ చెప్పిన వాదన.. పాకిస్థాన్ మనల్ని వేడుకుందని.. అందుకే ఆపేశామని!. అయితే.. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇప్పటికీ తానే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఇరు దేశాలను హెచ్చరించానని అందుకే ఆపేశాయని చెబుతున్నారు. దీనిపై కేంద్రం మౌనంగా ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంటు వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు.. నిలదీసేందుకు రెడీ అయింది.
వీటికి తోడు.. సర్ ప్రక్రియను కాంగ్రెస్ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం లో ఈ విషయంపై పార్లమెంటులో కత్తులు దూసుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. ఇక, బీహార్ ఎన్నికలు, బీజేపీ గెలుపు.. దీనివెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు వంటివి కూడా పార్లమెం టులో చర్చకు రానున్నాయి. ఇదేసమయంలో 10 కీలక బిల్లులను కేంద్రం ప్రవేశ పెట్టిఆమోదం పొందాలని సిద్ధమైంది. మొత్తానికి శీతాకాల సమావేశాలు వేసవిని తలపించనున్నాయని అంటున్నారు పరిశీలకులు.
