ఇరాన్ వారసత్వ పోరు: ముజ్తబా ఖామెనీ చుట్టూ వికీలీక్స్ సంచలన రహస్యాలు!
ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు ముజ్తబా ఖామెనీ గురించి వికీలీక్స్ బహిర్గతం చేసిన పత్రాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.
By: A.N.Kumar | 7 March 2026 1:00 AM ISTఇరాన్ రాజకీయ ముఖచిత్రంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుప్రీం లీడర్ అలీ ఖామెనీ మరణానికి సంబంధించిన వార్తలు.. తదుపరి వారసుడి ఎంపిక అంశం ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు ముజ్తబా ఖామెనీ గురించి వికీలీక్స్ బహిర్గతం చేసిన పత్రాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.
వికీలీక్స్ బయటపెట్టిన రహస్యాలు
అంతర్జాతీయ సమాచార లీక్ సంస్థ వికీలీక్స్ విడుదల చేసిన దౌత్యపరమైన కేబుల్స్ ఇరాన్ అధికార వర్గాల వ్యక్తిగత విషయాలను ప్రపంచం ముందు ఉంచాయి. 2008 నాటి అమెరికా విదేశాంగ శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం 56 ఏళ్ల వయస్సున్న ముజ్తబా ఖామెనీ గతంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రముఖ ఆస్పత్రులను ఆశ్రయించినట్లు ఆ పత్రాలు పేర్కొన్నాయి. లండన్‌లోని వెలింగ్టన్, క్రామ్‌వెల్ ఆస్పత్రుల్లో ఆయన సుదీర్ఘకాలం చికిత్స పొందారని, ముఖ్యంగా నాలుగో పర్యాయం దాదాపు రెండు నెలల పాటు అక్కడే ఉండి వైద్య సేవలు తీసుకున్నారని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తదనంతర కాలంలో ఆయన దంపతులకు సంతానం కలగడం, ఆ బాలుడికి తన తాత పేరు మీదుగా 'అలీ' అని నామకరణం చేయడం వంటి వివరాలను కూడా వికీలీక్స్ ప్రస్తావించింది.
వ్యక్తిగత జీవితం.. రాజకీయ ప్రస్థానం
ముజ్తబా ఖామెనీ 2004లో ఇరాన్ మాజీ పార్లమెంట్ స్పీకర్ ఘాదాద అడెల్ కుమార్తె జహ్రా హద్దాద్ అడెల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి ముందే ఆయనకు రెండు తాత్కాలిక వివాహాలు రిగాయని వికీలీక్స్ పత్రాలు పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల జరిగిన దాడుల్లో ఆయన భార్య, కుమారుడు మరణించారనే వార్తలు రాజకీయంగా తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి.
వారసుడి ఎంపిక - అనిశ్చితి
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ ఎంపిక బాధ్యత 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' అనే మతపెద్దల సంస్థకు ఉంటుంది. ఈ కమిటీ సభ్యుడు అహ్మద్ ఖతామీ వెల్లడించిన దాని ప్రకారం తదుపరి నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రక్రియ వేగవంతం చేసే అవకాశం ఉంది. అయితే ఈ రేసులో ముజ్తబా ఖామెనీ మాత్రమే కాకుండా అలీరెజా అరాఫీ, మొహ్సెన్ అరాకీ, ఆయతుల్లా ఖొమేనీ మనవడు హసన్ ఖొమేనీ వంటి బలమైన పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ప్రపంచ రాజకీయాలపై ప్రభావం
ఇరాన్ సుప్రీం లీడర్ పదవికి ఎంపికయ్యే వ్యక్తి కేవలం ఒక దేశాధినేత మాత్రమే కాదు.. ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క సైనిక , రాజకీయ వ్యూహాలను శాసించే కీలక వ్యక్తి అవుతారు. అందువల్ల, వారసుడి ఎంపిక ప్రక్రియ కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసేదిగా ఉంది. ముజ్తబా ఖామెనీకి ఉన్న రాజకీయ నేపథ్యం.. అతనిపై వస్తున్న విమర్శలు.. వివాదాల దృష్ట్యా, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మొత్తంగా వికీలీక్స్ వెల్లడించిన వ్యక్తిగత విషయాలు ఇరాన్ రాజకీయ నాయకత్వంపై ఉన్న రహస్యాలను బట్టబయలు చేయడమే కాకుండా తదుపరి వారసుడిపై కొనసాగుతున్న చర్చను మరింత వేడి చేశాయి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఈ వారసత్వ పోరు ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.
