Begin typing your search above and press return to search.

భర్త కోసం చైన్ స్నాచింగ్.. కార్యేషు దాసి శ్లోకంలో లేని భార్య..!

కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అని స్త్రీ గురించిన శ్లోకం ఉంది.

By:  Raja Ch   |   15 Jan 2026 10:30 AM IST
భర్త కోసం చైన్ స్నాచింగ్.. కార్యేషు దాసి శ్లోకంలో లేని  భార్య..!
X

కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అని స్త్రీ గురించిన శ్లోకం ఉంది. అంటే.. పనిలో దాసిగా, సలహాలు ఇవ్వడంలో మంత్రిగా, భోజనం పెట్టడంలో తల్లిగా, అందంలో లక్ష్మిగా, పడక గదిలో రంభగా, క్షమించడంలో భూమాతగా స్త్రీ ఉండాలని! అయితే తాజాగా తెరపైకి వచ్చిన విషయంలో.. భర్త కోసం దొంగతనాలు చేసే పనికి పూనుకున్న భార్య వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... చెన్నైలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేసి, ప్రేమ వివాహం చేసుకుని, ఓ కుమర్తెకు తల్లి అయిన ఓ మహిళ.. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దొంగగా మారిన ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ సమయంలో ఆమె దొంగతనాలు చేయడానికి గల కారణం మరింత షాకింగ్ గా మారింది. ఇందులో భాగంగా.. ఇటీవల ఉద్యోగం మాని, అప్పుల పాలైన భర్త ఆవేదన భరించలేక ఆమె ఈ పనికి పూనుకున్నట్లు చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... వరంగల్‌ కు చెందిన అనితారెడ్డి అనే మహిళ బీటెక్‌ చదివి, చెన్నైలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేసి మానేసింది. ఈ క్రమంలో.. మేడ్చల్‌ కు చెందిన రాజేష్‌ తో రెండేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకుంది! వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది! అయితే, మొదట్లో ఓ ఫైనాన్స్‌ సంస్థలో పనిచేసిన రాజేష్‌.. ఆ తరువాత పని మానేశాడు. ఈ క్రమంలో సుమారు రూ.నాలుగైదు లక్షలు అప్పు చేశాడు. మరోవైపు.. అనితారెడ్డి ఇంట్లోనే ఉండేది.

అయితే.. చేసిన అప్పుల అప్పు కారణంగా భర్త తరచూ బాధపడుతుండటంతో తాను ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచనకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే చోరీ చేసేందుకు పథకం వేసింది. ఈ క్రమంలో... మియాపూర్‌ కు చెందిన నల్ల కమల్‌ అనే వృద్ధురాలు అవంతినగర్‌ తోట కాలనీలోని తన ఇంటికి వచ్చి, పైఅంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కింది. ఈ సమయంలో.. లిఫ్ట్‌ తలుపులు మూసుకోక ముందే అక్కడ కాపు కాసిన అనిత లోపలికి చెయ్యిపెట్టింది.

వేగంగా.. కమల్‌ మెడలోని మంగళసూత్రం, నల్లపూసల గొలుసు తెంపేందుకు యత్నించింది. ఈ సమయంలో... బాధితురాలు ఒక్కసారిగా కేకలు వేయడంతో చేతికందిన అర తులం నల్లపూసల గొలుసు తెంచుకుని పారిపోయింది. దీంతో రంగంలోకి దిగిన సనత్‌ నగర్‌ పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలు అనితను అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగతనాలకు గల కారణాలు తెలిసిన వారు అవాక్కవుతున్నారు!