తొమ్మిది మంది పిల్లల 'బిగ్ బాస్' హౌస్.. ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత కల్యాణం
ఇక లేట్ చేస్తే మేటర్ లీక్ అయిపోతుందనుకున్నారో ఏమో... బంధువులు, ఇంట్లో వాళ్లకు ఒక్క మాట కూడా చెప్పకుండా సీక్రెట్‌గా కలియార్ షరీఫ్‌కు వెళ్లి పెళ్లి పీటలు ఎక్కేశారు.
By: A.N.Kumar | 20 Aug 2026 10:29 PM ISTజీవితంలో ఒక పెళ్లి చేసుకుని.. ఒకరిద్దరు పిల్లల్ని పెంచడానికే జనాలు జుత్తు పీక్కుంటున్న ఈ రోజుల్లో... ఏకంగా తొమ్మిది మంది పిల్లలతో కొత్త "ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజెస్" స్టార్ట్ చేశారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మహానుభావుడు.. మహానాయకి.. అవును యూపీలోని మెరాదాబాద్ జిల్లా రాణినగల్ గ్రామంలో జరిగిన ఈ ఊహించని కళ్యాణ మహోత్సవం చూసి చుట్టుపక్కల జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు వీళ్ల ప్లాన్ ఏంటి? అంత పెద్ద సైన్యాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? అని ఊరంతా ఒకటే చర్చ..
కష్టాల కడలిలో లవ్ ట్రాక్..
కథలోకి వెళ్తే... ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో భర్త రియాజుల్‌ను కోల్పోయిన తబస్సుమ్, ముగ్గురు పిల్లల బాధ్యతను మోస్తూ అత్తమామల ఇంట్లో ఒంటరి పోరాటం చేస్తోంది. మరోవైపు కోర్బంక్ ప్రాంతంలో మెకానిక్‌గా పని చేసే మహమ్మద్ ఉమర్ కథ ఇంకోలా ఉంది. మొదటి భార్య ఈయనకు 'విడాకుల బై-బై' చెప్పేసి వేరే పెళ్లి చేసుకోవడంతో తన ఆరుగురు పిల్లలకు తండ్రిగా, తల్లిగా తనే అవతారమెత్తాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. "నీకు కష్టాలు ఉన్నాయి, నాకు ఆరుగురు పిల్లలు ఉన్నారు... నాకా ముగ్గురు, నీకీ ఆరుగురు, కలిపితే మనకో క్రికెట్ టీమ్!" అనుకున్నారో ఏమో కానీ, ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ మెల్లగా ప్రేమలో పడిపోయారు. ఇద్దరి గతం చేదుగానే ఉన్నా, భవిష్యత్తును మాత్రం రంగులమయం చేసుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యారు.
గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి... బంధువుల ఫ్యూజులు అవుట్
ఇక లేట్ చేస్తే మేటర్ లీక్ అయిపోతుందనుకున్నారో ఏమో... బంధువులు, ఇంట్లో వాళ్లకు ఒక్క మాట కూడా చెప్పకుండా సీక్రెట్‌గా కలియార్ షరీఫ్‌కు వెళ్లి పెళ్లి పీటలు ఎక్కేశారు. అంతటితో ఆగకుండా చట్టబద్ధంగా కోర్టు మ్యారేజ్ కూడా లాగించేసారు. మేటర్ బయటపడటంతో ఇరువైపులా బంధువులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. "ఇదేందయ్యా ఇది.. మేం చూడలేదు" అంటూ తబస్సుమ్ అత్తమామలు రచ్చ రచ్చ చేయడంతో.. గొడవ చివరకు గ్రామ సర్పంచ్ జాహిద్ హుస్సేన్ పంచాయతీ వరకు వెళ్లింది.
అఫిడవిట్ ఇచ్చిన మెకానిక్.. ప్యాకప్ చెప్పిన అత్తమామలు
పంచాయతీ పెద్దల ముందు మాస్ ఎంట్రీ ఇచ్చిన ఉమర్, రియల్ హీరోలా క్లారిటీ ఇచ్చాడు. "నా ఆరుగురితో పాటు ఆమె ముగ్గురి బాధ్యత కూడా నాదే. అద్దె ఇల్లు, కొనుగోలు చేసిన స్థలం, తొమ్మిది మంది తిండి, చదువు... అంతా నా అకౌంట్" అంటూ స్టాంప్ పేపర్ మీద ఆస్తి, బాధ్యతల అఫిడవిట్లు రాసిచ్చి అందరి నోళ్లు మూయించాడు. దెబ్బకు తబస్సుమ్ అత్తమామలు "అయితే ఓకే, ఇకపై ఈమెకు మాకూ ఎలాంటి సంబంధం లేదు" అని చేతులు దులుపుకున్నారు. పంచాయతీ క్లియర్ అవ్వడంతో తబస్సుమ్ తన ముగ్గురు పిల్లలను, లగేజీని సర్దుకుని మొగుడితో కలిసి కొత్త కాపురానికి షిఫ్ట్ అయిపోయింది.
నెక్స్ట్ ఏంటి? ఇల్లు సర్వైవల్ గేమా?
ప్రస్తుతం ఈ నూతన దంపతుల కంటే ఆ ఇంట చేరిన తొమ్మిది మంది పిల్లలే హాట్ టాపిక్‌గా మారారు. ప్రతిరోజు వంట వండటం అంటే ఒక చిన్నపాటి పెళ్లి భోజనాలు సిద్ధం చేసినట్లే.. మెకానిక్ గారేమో పగలు బైక్‌లు బాగుచేయాలి, రాత్రికి ఇంట్లో ఈ తొమ్మిది మంది అల్లరిని కంట్రోల్ చేసే 'రింగ్ మాస్టర్' అవతారం ఎత్తాలి. అసలు ఈ తొమ్మిది మంది ఒకే కప్పు కింద కలిసి ఉంటారా? లేక ప్రతిరోజూ బెడ్ షీట్లు, రిమోట్ల కోసం ఇంట్లోనే డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ బెల్ట్ మ్యాచ్‌లు ఆడతారా? అనేదే ఊరందరికీ ఉన్న పెద్ద సస్పెన్స్..
ఏది ఏమైనా సమాజం ఏమనుకున్నా పర్లేదు అని తమ గత జీవితాల చేదు జ్ఞాపకాలను పక్కనపెట్టి ఒక పెద్ద 'కిడ్స్ ఆర్మీ'తో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..
