Begin typing your search above and press return to search.

జీఎస్టీ మీద నోరు విప్పని వైసీపీ... వ్యూహమా ?

ఇంకో వైపు చూస్తే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా జీఎస్టీ పన్నుల తగ్గింపుని ఏపీ వ్యాప్తంగా ప్రచారం చేసి దానిని పీక్స్ కి తీసుకుని వెళ్ళాలని చూస్తోంది.

By:  Satya P   |   21 Sept 2025 9:10 AM IST
జీఎస్టీ మీద నోరు విప్పని వైసీపీ... వ్యూహమా ?
X

జీఎస్టీ రెండవ తరం సంస్కరణలు అంటూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది ఈ నెల 22 నుంచి నెల రోజుల పాటు దేశమంతా పన్నుల తగ్గింపు మీద ప్రచారం నిర్వహించి సామాన్య ప్రజలలో విస్తృతమైన అవగాహన కలిగించాలని చూస్తోంది. అపుడే బీజేపీ తరఫున ప్రచారం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకో వైపు చూస్తే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా జీఎస్టీ పన్నుల తగ్గింపుని ఏపీ వ్యాప్తంగా ప్రచారం చేసి దానిని పీక్స్ కి తీసుకుని వెళ్ళాలని చూస్తోంది.

వైసీపీ మీద విసుర్లు :

ఇక జీఎస్టీ పన్నుల తగ్గింపు మీద చంద్రబాబు అసెంబ్లీలో సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఆయన ఇచ్చారు. అంతే కాదు దీని వల్ల ఏపీకి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గినా ప్రజలకు మేలు జరుగుతుందని తాము ఎంతో సంతోషిస్తున్నాము అన్నారు. అదే సమయంలో ఒక మంచి పని కేంద్రం చేస్తే దాని మీద కూడా స్పందించకుండా విపక్షం వైసీపీ ఉందని విమర్శించారు. అసలు వారికి జీఎస్టీ పన్నుల మీద అవగాహన ఉందో లేదో అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు కానీ ఇలాంటి విషయాల్లో మాట్లాడరా అని కూడా దెప్పిపొడిచారు.

అన్నారని కాదు కానీ :

చంద్రబాబు అన్నారని కాదు కానీ అసలు వైసీపీ ఎందుకు ఇంత సీరియస్ ఇష్యూలో తన వైపు నుంచి స్టాండ్ ఏమిటో చెప్పలేదు అన్న చర్చ అయితే ఉంది. నిజానికి జీఎస్టీ రెండవ తరం సంస్కరణల వల్ల పేదలు సామాన్యులకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. గతానికి కంటే ధరలు చాలా వరకూ తగ్గుతాయి. దీని వెనక కేంద్రం రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయా బీహార్ ఎన్నికల కోసమా మరో కారణా అన్నది పక్కన పెడితే ఎక్కువ మంది ప్రజలకు మేలు చేసే ఈ నిర్ణయం మీద వైసీపీ ఎందుకు స్పందించలేదు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

ఇండియా కూటమి కూడా :

మరో వైపు చూస్తే ఇండియా కూటమి కూడా ఈ పన్నుల తగ్గింపుని స్వాగతించింది. అయితే గతంలో చేయాల్సింది అని చెప్పింది ఇంకా సలహా సూచనలు ఇచ్చింది. కాంగ్రెస్ అయితే ఎనిమిదేళ్ళ పాటు జీఎస్టీ శ్లాబులను అధికంగా పెట్టి ప్రజల నుంచి ఎక్కువగా పిండారని ఇప్పటికైనా తగ్గించి కొంత వరకూ సరిదిద్దుకున్నారని వెటకరించింది. మరి ఆ విధంగా అయినా వైసీపీ తన ఆలోచనలు ఏమిటో చెప్పాల్సి ఉంది కదా అంటున్నారు.

అక్కడ ఓటేసి :

ఎన్డీఎ అభ్యర్ధికి జై కొట్టి ఓటేసి తీరా ఇపుడు ఎన్డీఎ ఒక కీలక నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో మాత్రం వైసీపీ మౌనంగా ఉండడం ఏమిటి అని ఆలోచిస్తున్నారు ఎన్డీయే తీసుకున్న ఏ నిర్ణయం అయినా వ్యతిరేకించాలని వైసీపీ అనుకుందా లేక ఈ నిర్ణయంలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని కూడా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా వైసీపీ ఎన్ డీయేతో ఒక వైపు దగ్గర అవుతూ మరో వైపు టచ్ మీ నాట్ అన్నట్లుగా వ్యవహరించిన తీరు వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా అన్నది కూడా చర్చగానే ఉంది.