ఇప్పడు ఎన్నికలు పెడితే ఏపీలో గెలిచేది ఆ పార్టీనా ?
ఇక ఈ మధ్య కొత్తగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నది ఏంటి అంటే 2029లో అధికారంలోకి వచ్చేది తామే అని.
By: Satya P | 20 Jan 2026 1:00 PM ISTరాజకీయ పార్టీలకు ఆత్మ విశ్వాసం ఉండాలి, క్యాడర్ కి నైతిక స్థైర్యం కలిగించాలి. కానీ అదే సమయంలో ఆ ధీమా కాస్తా అతి ధీమాగా మారకూడదు, వైసీపీ విషయం తీసుకుంటే అదే ఎక్కువగా కనిపిస్తుంది. వైసీపీ 2024 లో వై నాట్ 175 అని ఎన్నికలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని అధినేత జగన్ నుంచి అంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారు. దాంతో అదే నిజం అవుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఓట్ల లెక్కింపు మొదలు కాగానే సీన్ రివర్స్ అయింది. వైసీపీకి ఏకంగా 11 సీట్లు దక్కి దారుణమైన పరాజయం లభించింది. ఇదంతా ఆ పార్టీ అతి విశ్వాసంతో చేసుకున్నదే అని అంటారు. సరైన విధంగా చెక్ చేసుకోకుండా అంతా తామే అని ఫీల్ గుడ్ అనుకుంటూ ముందుకు సాగిందని విమర్శలు వచ్చాయి.
కట్ చేస్తే సేమ్ సీన్ :
ఇక వైసీపీ ఓటమి తరువాత విపక్షంలోకి వచ్చింది. ఆ పార్టీ అసెంబ్లీకి వెళ్లడం లేదు, అధినాయకత్వం కూడా పెద్దగా జనంలోకి రావడం లేదు, పార్టీ నేతలు చాలా మంది తమ నియోజకవర్గాలలో లేరని పర్సనల్ గా వర్క్ చేసుకుంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. మరి ఇరవై నెలలు ఇంతలోనే గడచాయి. అధికార పక్షం మీద ఏ మేరకు వ్యతిరేకత వచ్చిందో తెలియదు కానీ ప్రతిపక్షం మీద కూడా యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుందని వైసీపీ నేతలు మరచిపోతున్నారా అన్నదే చర్చకు వస్తోంది.
ఇండికేషన్స్ కూడా :
ఇక ఈ మధ్య కొత్తగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నది ఏంటి అంటే 2029లో అధికారంలోకి వచ్చేది తామే అని. ఇది సంక్రాంతి సంబరాల సాక్షిగా పాట రూపంలో తన డ్యాన్స్ రూపంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చెబితే మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా అదే అంటున్నారు. 2029లో వైసీపీ గెలుస్తుందని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. కడపకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఇదే అంటున్నారు. ఏపీలో కూటమి పాలన బాగులేదని జగన్ ని దూరం చేసుకుని తాము ఎంతగానో ఇబ్బంది పడుతున్నామని జనాలు అనుకుంటున్నారని ఈ మేరకు ఇండికేషన్స్ కూడా తమకు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది తామే అని కూడా వారు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
తామే ఆల్టర్నేషన్ కాబట్టి :
రాజకీయ పార్టీలు నిరంతరం ప్రజలలో ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి. అదే సమయంలో జనాల నాడి కూడా పట్టుకోవాలి. వైసీపీ విషయం తీసుకుంటే టీడీపీ కూటమికి తామే ఆల్టర్నేషన్ కాబట్టి అధికారంలోకి వచ్చేసినట్లే అని భావిస్తోంది అని అంటున్నారు. దానికి మరో లెక్క కూడా వేసుకుంటోంది అని చెబుతున్నారు 2014లో టీడీపీ గెలిచిందని, 2019లో వైసీపీ వచ్చిందని, 2024లో టీడీపీకి చాన్స్ ఇచ్చారని తిరిగి 2029లో వైసీపీకే పక్కా చాన్స్ అన్నది వైసీపీ లెక్కగా ఉంది. అంటే ఏపీ జనాలు తడవకోసారి అధికార మార్పిడి చేస్తున్నారు కాబట్టి ఈసారి తాంబూలం తమకే దక్కుతుందని అంటున్నారు. అయితే అన్ని వేళలూ ఒక్కలా ఉండవు, అన్ని తీర్పులూ ఒకే మాదిరిగా ఉండవని కూడా అంటున్నారు.
గతంలో ఉదాహరణలు :
దీనికి కాస్తా వెనక్కి వెళ్తే ఉమ్మడి ఏపీలో 1985లో టీడీపీ గెలిచింది, 1989లో కాంగ్రెస్ గెలిచింది, 1994లో టీడీపీ మరోసారి గెలిచింది, దాంతో 1999లో కచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరుతుందని అప్పటి కాంగ్రెస్ పెద్దలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. తమ ఇళ్ళకు సున్నాలు కొట్టించేసుకున్నారు. ఇక తమదే పవర్ అని కూడా ధీమాగా ఉన్నారు. కానీ రిజల్ట్స్ చూస్తే టీడీపీకే రెండోసారి చాన్స్ ఏపీ ప్రజలు ఇచ్చారు. అలా గతంలో ఉదాహరణలు ఉన్నాయి. పైగా 2019 లెక్కలు 2029 నాటికి సూట్ కావని అంటున్నారు. వైసీపీ పాలన టీడీపీ పాలన బేరీజు వేసుకుని మరీ జనాలు తీర్పు ఇస్తారని అంటున్నారు. అలాగే అభివృద్ధి కూడా మరోసారి ముఖ్య పాత్ర పోషిస్తుందని అదే విధంగా పొత్తులు ఎత్తులు రాజకీయ వ్యూహాలూ కూడా కీలకమని అంటున్నారు. వీటిని పక్కన పెట్టి గెలిచేది మేమే అని ముందే కాడె వదిలేస్తే వైసీపీకి ఇబ్బందులు వస్తాయని హితైషుల నుంచి సూచనలూ వస్తున్నాయని అంటున్నారు.
