'ఎన్టీఆర్' ఇమేజ్ పోగొట్టుకున్న వైసీపీ.. !
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టీఆర్ పేరును వినియోగించుకునే విషయంలో వైసీపీ గత పాలనలో ముందున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 21 Aug 2026 8:00 PM ISTటీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టీఆర్ పేరును వినియోగించుకునే విషయంలో వైసీపీ గత పాలనలో ముందున్న విషయం తెలిసిందే. ఏకంగా కృష్ణా జిల్లాను విడదీసి.. ఎన్టీఆర్ పేరు పెట్టారు. దీంతో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనత తమ దేనని ప్రకటించుకున్నారు. తర్వాత.. ఆయన పేరుతో పాలిటిక్స్ చేయాలని అనుకున్నారు. ఎన్టీఆర్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ, ఇదేసమయంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయడం.. వచ్చిన ఇమేజ్‌ను పోగొట్టిందన్న వాదన ఉంది.
కట్ చేస్తే.. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ పాలిటిక్స్ ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్నచందం గా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ప్రతి జిల్లాలోనూ వైసీపీ నాయకులు ఉన్నారు. వారిలో ఒకరి ద్దరు జిల్లాలో బలమైన నాయకులుగా ఎదిగారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో పేర్ని నాని, కొడాలి నాని ఫైర్ బ్రాండ్స్‌గా ఉన్నారు. ఇలా చూసుకుంటే.. ఎన్టీఆర్ జిల్లాలో జోగి రమేష్ కొంత మేరకు ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు కోసం ప్రయత్నించినా.. ఆయన కేసుల్లో చిక్కుకుని బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఇక, మిగిలిన నాయకుల్లో సామినేని ఉదయబాను జనసేనలోకి వెళ్లిపోయారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు ఈ గ్యాప్ ఫిల్ చేయాలని అనుకున్నప్పటికీ.. సాధ్యం కాలేదు. ఇక, విజయవాడలోనూ బలమైన నాయకులు లేకుండా పోయారు. గతంలో మల్లాది విష్ణు ఉన్నా.. ఆయన పరిస్థితి ఇరకాటంలో పడింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన నాయకులు కరువయ్యారు.
ఇక, కీలకమైన ఎంపీ పోస్టు ఖాళీగానే ఉంది. ఎంపీ అభ్యర్థిని ఇప్పటి వరకు ఎంపిక చేయకపోవడంతో వైసీపీ తరఫున వాయిస్ వినిపించే బలమైన వారు కనిపించడం లేదన్నది వాస్తవం. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలో అంతర్గత పోరు జరుగుతోందని.. అది తమకు లాభిస్తుందని వైసీపీ వేసుకున్న అంచనాలు కూడా తలకిందులు అయ్యాయి. పార్టీ పరంగా తీసుకున్న చర్యలతో తమ్ముళ్లు సర్దుకుపోతున్నారు. దీంతో ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నా.. జిల్లాలో వైసీపీ పెద్దగా పుంజుకోలేక పోవడం.. ఏడు నియోజకవర్గాల్లో నూ కూటమి బలంగా ఉండడం గమనార్హం.
