బ్రిక్స్ సదస్సును పాశ్చాత్యదేశాల మీడియా ఎలా చూసింది?
అంచనాలకు మించి సక్సెస్ అయిన బ్రిక్స్ సదస్సుతో మోడీ అండ్ కో ఫుల్ హ్యాపీగా ఉన్న పరిస్థితి. మోడీ చతురత భారత్ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడేలా చేసిందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది.
By: Garuda Media | 14 Sept 2026 10:26 PM ISTఅంచనాలకు మించి సక్సెస్ అయిన బ్రిక్స్ సదస్సుతో మోడీ అండ్ కో ఫుల్ హ్యాపీగా ఉన్న పరిస్థితి. మోడీ చతురత భారత్ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడేలా చేసిందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. బ్రిక్స్ సదస్సుతో మోడీ మేజిక్ మరోసారి అందరికి అర్థమైన పరిస్థితి. ఒక ప్రధానమంత్రి స్థిరంగా.. సుదీర్ఘకాలం పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని బ్రిక్స్ సదస్సు చెప్పకనే చెప్పేసింది. అంతర్జాతీయంగా ఇప్పుడు మోడీ వార్తల్లోకి రావటమే కాదు.. ఆయన ప్రభుత్వ పని తీరు గురించి ప్రత్యేకంగా మాట్లాడటం మొదలైంది. చైనాతో సంబంధాల్ని పునరుద్దరించుకుంటూనే.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాకు అక్కసు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. రష్యా లాంటి చిరకాల మిత్రుడి మనసు దోచుకునేలా కసరత్తు చేయటం సర్కస్ విన్యాసం లాంటిది. ఆ విషయాన్ని మోడీ అలవోకగా పూర్తి చేశారని చెప్పాలి.
బ్రిక్స్ సదస్సును అంతర్జాతీయ మీడియా ఎలా చూసింది? ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ తో పాటు యూరోప్ మీడియా కళ్లకు ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు.. ఢిల్లీ డిక్లరేషన్ కు ఎలా స్పందించాయి? అన్నదిప్పుడు ఆసక్తికర అంశం. లక్ష్యం ఎంత పెద్దదైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది. సముద్రం ఎంత పెద్దదైనా అది కూడా ఒక నీటి బొట్టుతోనే మొదలవుతుంది. అలానే బ్రిక్స్ కూడా. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు పద్దెనిమిదోది. దీనికి ముందు ప్రాశ్చాత్య దేశాలు ఈ వేదికకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చేవి కావు. 2009-22 మధ్య వరకు అదో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వేదిక అన్న గుర్తింపు మాత్రమే ఉండేది. కానీ.. అసలు మార్పు 2023తో మొదలైంది.
అగ్రరాజ్యం అమెరికా అధిపత్యానికి ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ఎదిగే అవకాశం ఉందన్న సందేహం 2023-2025 మధ్య కాలంలో పాశ్చత్య మీడియాకు మొదలైంది. తాజాగా జరిగిన బ్రిక్స్ సదస్సు మొత్తం చిత్రాన్ని మార్చేసింది. ఇప్పుడు ఈ వేదిక ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే ముఖ్యశక్తిగా మారింది. ఈ కూటమి తీసుకునే నిర్ణయాలు అమెరికా.. చైనా.. రష్యా.. మధ్యప్రాచ్యం మాత్రమే కాదు ప్రపంచ వాణిజ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉందన్న భావన మొదలైంది. ఇదే విషయాన్ని ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు చెప్పేసింది.
గతానికి భిన్నంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు సంబంధించి పాశ్చత్య మీడియా కవరేజ్ ప్లానింగ్ చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. సదస్సు ప్రారంభానికి కాస్త ముందు నుంచే కథనాలు మొదలయ్యాయి. ప్రపంచంలో ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన రాయిటర్స్ నే తీసుకుందాం. సెప్టెంబరు 12-13 తేదీల్లో జరిగే బ్రిక్స్ సదస్సు గురించి సెప్టెంబరు 7 నుంచి కథనాలు చేయటం దీనికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. బ్రిక్స్ నేతలు ప్రపంచ అనిశ్చితి మధ్య ఐక్యతను ప్రదర్శిస్తారా? ఇరాన్ యుద్ధం బ్రిక్స్ ఐక్యతకు పరీక్ష.. లాంటి కథనాల్ని సదస్సుకు ఎంతో ముందుగా ప్రసారం చేయటం చూస్తే.. ఈ సదస్సుకు దక్కిన ప్రాధాన్యత అర్థమవుతుంది.
2024లో బ్రిక్స్ పై కొన్ని సందేహాలు ఉండేవి. ఈ వేదిక పాశ్చాత్య వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మారుతుందా? అన్న ప్రశ్న ఉండేది. అందుకు భిన్నంగా తాజాగా ఢిల్లీలో జరిగిన సదస్సు వేళ.. మారిన గొంతు ఎలా ఉందంటే.. ‘‘పెరుగుతున్న బ్రిక్స్ ప్రభావాన్ని ప్రపంచ వ్యవస్థలో ఎలా ఉపయోగించబోతోంది?’ అన్న ప్రశ్న మీద విశ్లేషణలు జరగటం చూస్తే.. ఈ వేదికకు పాశ్చాత్య మీడియా ఇస్తున్న ప్రయారిటీ అర్థమవుతుంది. బ్రిటన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ.. గత ఏడాది బ్రిక్స్ సదస్సు వేళ.. ఇచ్చిన కవరేజ్ లో బ్రిక్స్ శక్తి ఎంత? బ్రిక్స్ విస్తరణ.. ప్రపంచ వ్యవస్థలో బ్రిక్స్ పాత్ర మీద కథనాలు ఇస్తే.. ఈ ఏడాది మొత్తం గొంతే మారిపోయింది. ‘బ్రిక్స్ ను ట్రంప్ ఎలా ఎదుర్కొంటారు’ అన్న దిశలో కథనాలు వెలువడటం గమనార్హం.
అమెరికాకు చెందిన న్యూయార్స్ టైమ్స్ ఢిల్లీ సదస్సుకు రోజు ముందు ఒక భారీ విశ్లేషణ చేసింది. దాని సారాంశం ‘అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి నాయకత్వానికి వహించేది షీ జిన్ పింగ్ నా? నరేంద్ర మోడీనా?’ అని. అంటే.. బ్రిక్స్ ను చైనా అధిపత్యంలోని వేదికగా చూసే కన్నా.. చైనా - భారత్ మధ్య నాయకత్వ పోటీగా చూడటం దేనికి నిదర్శనం? ఇదే అంశాన్ని పుష్కరం క్రితం ఎవరైనా ప్రస్తావిస్తే నవ్విపోయే పరిస్థితి. కానీ.. ఇప్పుడు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఇలాంటి కథనం ఇవ్వటం దేనికి నిదర్శనం?
బ్రిటన్ కు చెందిన మరో ప్రముఖ మీడియా సంస్థ గార్డియన్ అయితే.. సదస్సు సందర్భంగా ఒకట్రెండు కథనాలతో సరిపెట్టలేదు. భారీ ఎత్తున.. వివిధ కోణాల్లో కథనాలు.. విశ్లేషణలు చేయటం గమనార్హం. 2009లో అత్యంత తక్కువ ప్రాధాన్యత కథనాలు ఇవ్వటం మొదలుపెట్టిన ప్రాశ్చాత్య మీడియా 2017 నాటికి మధ్యస్త స్థాయిలో కథనాలు ఇచ్చేవారు. 2023లో ప్రాధాన్యత ఎక్కువైంది. 2024 నుంచి ప్రాధాన్యత చాలా ఎక్కువ కాగా.. ఈ ఏడాది అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. రోజువారీ అంశాలను అత్యధిక ప్రాధాన్యతతో రిపోర్టు చేయటమే కాదు.. సదస్సుకు ముందు.. సదస్సు జరుగుతున్న వేళలో రాజకీయ ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ.. లోతైన విశ్లేషణ చేయటం కనిపించింది. మొత్తంగా ప్రాశ్చాత్య మీడియా బ్రిక్స్ ను విస్మరించలేని స్థాయిలో సీరియస్ గా తీసుకుంటోంది.
గతంలో పాశ్చాత్య మీడియా బ్రిక్స్ ను చైనా.. రష్యాలు అమెరికా వ్యతిరేకతకు వేదికగా అన్నట్లు చూపించేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా పలు అంశాలు తెర మీదకు వచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో భారత్ పాత్రను చక్కటి సమన్వయకర్తగా.. మోతాదు మించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న పెద్ద మనిషి తరహాలో భారత్ ను.. ప్రధాని మోడీని చూపించటం గమనార్హం. అంతేకాదు.. బ్రిక్స్ చైనా.. రష్యా సొత్తు కాదని.. భారత్ కీలక భూమిక పోషించటమే కాదు..బ్రిక్స్ ను భారత్ విస్తృతమైన వేదికగా ఉంచాలని చూస్తోందని చెప్పటం చూస్తే.. ప్రాశ్చాత్య మీడియా చూసే కోణంలో వచ్చిన మార్పునకు ఇదో సంకేతంగా చెప్పొచ్చు. జెన్ జీ ఆందోళనల నేపథ్యంలో మోడీ ప్రాభవం తగ్గిందన్న విశ్లేషణలకు చెక్ పెట్టేలా ఈ అంతర్జాతీయ సదస్సు మోడీని సైడ్ కారెక్టర్ కాదు.. ప్రపంచ రాజకీయ పటంలో లీడ్ రోల్ పోషించే ప్రధాన నాయకుల్లో ఒకరిగా చూస్తున్నాయన్న సంకేతాన్ని ఇస్తున్నాయి.
