Begin typing your search above and press return to search.

సిక్కోలు కార్పోరేషన్ కి మరోసారి షాక్ !

శ్రీకాకుళం కార్పోరేషన్ కి ఎన్నికలు పెట్టడానికి కోర్టు చిక్కులు ఉన్నాయని అంటున్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగకపోవడానికి న పంచాయతీల వివాదాలు కారణం అని అంటున్నారు.

By:  Satya P   |   24 Aug 2026 9:27 AM IST
సిక్కోలు కార్పోరేషన్ కి మరోసారి షాక్ !
X

ఏ ముహూర్తాల కార్పోరేషన్ గా శ్రీకాకుళం అవతరించిందో కానీ ఆనాటి నుంచి నేటి దాకా ఎన్నికలు అంటే లేవు. ఇక శ్రీకాకుళం మునిసిపాలిటీకి చివరి సారిగా ఎన్నికలు ఎపుడు జరిగాయంటే 2005 సంవత్సరంలో. అంటే ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా అన్న మాట. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలే గెలిచి అధికార పీఠం అందుకున్నారు. ఆ తర్వాత కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ వివిధ కారణాల వల్ల గత రెండు దశాబ్దాలుగా అక్కడ ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరగకపోవడానికి కారణాలు సమీప గ్రామ పంచాయతీల విలీనం. రిజర్వేషన్ల వివాదాలు న్యాయపరమైన చిక్కులు ఇతర రాజకీయ కారణాల వల్ల వాయిదా పడుతూ రావడం అని చెబుతున్నారు.

రెండు దశాబ్దాల కాలం :

శ్రీకాకుళం కార్పోరేషన్ కి రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరగకపోవడంతో అధికారుల పాలనలోనే ఉంటోంది. ఎన్నికలు లేకపోవడం వల్ల స్థానికంగా ప్రజా ప్రతినిధులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎపుడైనా ఎన్నికలు జరగకపోతాయా తాము కార్పోరేటర్లు కాకపోతామా అని వారు భావిస్తున్నారు. ఇక మేయర్ పోస్టు కోసం రాజకీయ నేతల వారసులు టార్గెట్ చేసినా ఫలితం లేకపోతోంది. మారో వైపు అభివృద్ధి విషయంలో అధికారుల మీద ఆధారపడడం మీద కూడా రాజకీయ పార్టీలలో అసహనం పెరుగుతోంది.

మేయర్ కిరీటం కోసం :

ఎన్నికలు అంటూ పెడితే మేయర్ పదవిని అందుకోవాలని చాలా మంది చూస్తున్నారు. గతంలో 2021లో వైసీపీ హయాంలో ఎన్నికలు జరుగుతాయని ఎంతో ఆశించారు. కానీ కోర్టు చిక్కులు అంటూ వాయిదా వేశారు. అప్పట్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు మేయర్ సీటుకు పోటీ పడతారు అని ప్రచారం సాగింది. అలాగే టీడీపీ నుంచి కూడా కీలక నేతల వారసులు ఈ వైపుగా చూస్తూ వచ్చారు. ఇపుడు చూస్తే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగరా మోగింది. కానీ శ్రీకాకుళానికి మాత్రం ఎలాంటి సమాచారం లేదు, దాంతో ఎన్నికలు లేనట్లే అని అంటున్నారు. మిగిలిన చోట్ల ఓటర్ల జాబితాను సిద్ధం చేయమనడం వార్డుల పునర్విభజన వంటి వాటి మీద పై నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ పరిణామంతో శ్రీకాకుళం కార్పోరేషన్ మరో మారు పక్కకు పోతోంది అన్న ఆవేదన అయితే రాజకీయ జీవులది అయితే ఎన్నికలు పెడితే ఓటేసి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుందామని చూస్తున్న జనాలకు కూడా నిరాశ కలుగుతోంది.

కోర్టు చిక్కులు ఎందుకంటే :

శ్రీకాకుళం కార్పోరేషన్ కి ఎన్నికలు పెట్టడానికి కోర్టు చిక్కులు ఉన్నాయని అంటున్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగకపోవడానికి న పంచాయతీల వివాదాలు కారణం అని అంటున్నారు. గతంలో రిజర్వేషన్లపై కోర్టులో దాఖలైన పిటిషన్లు పెండింగులో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ఇతర గతంలో రిజర్వేషన్ల నిబంధనలు పాటించలేదంటూ కూడా పిటిషన్లు దాఖలు అయ్యాయి. విలీన పంచాయతీల అంశాలపై పిల్స్ దాఖలు కావడం కూడా చిక్కులుగా మారింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే .పరిపాలనా మార్పులలో భాగంగా శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ సరిహద్దులు వార్డుల పునర్విభజనపై స్పష్టత రాకపోవడం సైతం పెద్ద సమస్యగా ఉంది. అయితే ఈ తరహా లీగల్ అడ్డంకులను దాటుకుని ఎన్నికలు నిర్వహించాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ ఈసారికి కూడా షాక్ అయితే తప్పడం లేదని అంటున్నారు. మరి శ్రీకాకుళం కార్పోరేషన్ కి ఈ శాపం వీడి ఎపుడు ఎన్నికలు జరుగుతాయని అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది.