Begin typing your search above and press return to search.

వెండి ధర పెరిగితే అందరికి నష్టమే.. ఎందుకు?

ముందు పెరిగిన వెండి ధర విషయానికి వస్తే.. ఇదెంతగా పెరిగిందన్నది ఇట్టే అర్థమవుతుంది. 2025 ప్రారంభంలో కేజీ వెండి రూ.90,500.

By:  Garuda Media   |   29 Dec 2025 8:00 PM IST
వెండి ధర పెరిగితే అందరికి నష్టమే.. ఎందుకు?
X

ఏడాది వ్యవధిలో వెండి ధర రాకెట్ వేగంతో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. గడిచిన పదేళ్లలో పెరిగిన దాని కంటే ఏడాది వ్యవధిలో అనేక రెట్లు పెరిగిన తీరు ఆందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. ఇంతకూ వెండి ధర ఎందుకు పెరుగుతోంది? అంతకంతకూ ఎక్కువ అవుతున్న వెండి ధర.. ఎంతవరకు వెళ్లే వీలుంది? వెండి ధర పెరిగితే అందరికి మంచిది కాదన్న మాట వెనుక అసలు లెక్కేంటి? లాంటి విషయాల్లోకి వెళితే.. ఆశ్చర్యకర అంశాలు కనిపిస్తాయి.

ముందు పెరిగిన వెండి ధర విషయానికి వస్తే.. ఇదెంతగా పెరిగిందన్నది ఇట్టే అర్థమవుతుంది. 2025 ప్రారంభంలో కేజీ వెండి రూ.90,500. అంటే.. రూ.లక్ష లోపే. ప్రస్తుతం దాని ధర అక్షరాల కేజీ రూ.2.36 లక్షలు. అంటే.. ఏడాదిలో ఏకంగా రూ.1.5లక్షలు పెరిగింది. అంటే.. కేజీకి రూ.1.46 లక్షలు పెరిగింది. అది మొదలు అంతకంతకూ దూసుకెళ్లటమే తప్పించి వెనక్కి తగ్గింది లేదు.

మొదటి ఆర్నెల్లలో కేజీకి రూ.38వేల పెరిగితే.. తర్వాతి ఆర్నెల్లలో రూ.1.18లక్షలు పెరగటం చూస్తే ఆకాశమే హద్దుగా మారినట్లుగా చెప్పాలి. అన్నింటికి మించి నెల వ్యవధిలో భారీగా పెరిగింది. నవంబరులో రూ.1.64 లక్షలు ఉన్న కేజీ వెండి డిసెంబరు 26 నాటికి రూ.2.36 లక్షలకు చేరుకోవటం చూస్తే.. రానున్న రోజుల్లో మరింత పెరగటమే తప్పించి తగ్గే అవకాశం లేదంటున్నారు.

మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2026లో రూ.3 లక్షలు దాటుతుందని.. త్వరలో కేజీ వెండి రూ.5 లక్షల వరకు వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. వెండిని కేవలం ఆభరణం కంటే కూడా వివిధ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున వినియోగిస్తుంటారు. ఎలక్ట్రిక్ వాహనాలు.. పునరుత్పాదక శక్తి.. టెలికాం.. మెడికల్ టెక్నాలజీ ఉపకరణాలు.. బయో ఫార్మా లాంటి పరిశ్రమలో పెద్ద ఎత్తున వినియోగిస్తుంటారు.

సోలార్ ప్యానెళ్లు.. బ్యాటరీ.. ఎలక్ట్రానిక్ భాగాల్లో వెండి కీలకంగా మారింది. ఇవన్నీ కూడా వెండి ధర మరింత పెరిగేందుకు దోహదపడుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఒక పరిణామం కూడా వెండి ఈస్థాయిలో పెరుగుదలకు కారణంగా మారింది. చైనా ప్రభుత్వం 2025 జనవరి 1 నుంచి వెండి ఎగుమతులపై కొత్త నిబంధనల్ని తీసుకురానుంది. కఠినంగా ఉండే ఈ నియమాలు అంతర్జాతీయ మార్కెట్ లో వెండి ఈ స్థాయిలో పెరగటానికి కారణంగా మారిందని చెప్పాలి.

దేశీయ వనరుల్ని కాపాడటం అనే పేరుతో వెండి ఎగుమతులపై నియంత్రణలు మొదలు పెట్టిన చైనా.. వెండిని ఎగుమతి చేయాలంటే కొత్త నిబంధనల్ని పక్కాగా పాటించాలని చెబుతోంది. ఇందులో ముఖ్యమైన నిబంధన.. 2026 జనవరి ఒకటి నుంచి వెండి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు చైనా ప్రభుత్వం వద్ద తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న కోటా వ్యవస్థకు భిన్నమైనది. వెండి ఎగుమతి చేసేందుకు అన్ని సంస్థలు లైసెన్సులు వచ్చే వీల్లేదు. ప్రభుత్వం చేత ఆమోదించిన సంస్థలు.. పెద్ద సంస్థలకు మాత్రమే లైసెన్సులు అర్హత పొందుతాయని చెబుతున్నారు.

వెండి లైసెన్సుకు సంస్థలు కనీసం 80 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ నిబంధన కారణంగా చిన్న.. మధ్యతరహా ఎగుమతిదారులను నిరోధించేందుకు అవకాశం ఉంటుంది. దీని కారణంగా ప్రపంచ మార్కెట్ కు చైనా సరఫరా చేసే వెండి పరిణామం 60-70 శాతం తగ్గించే వీలుంది. ఈ కొత్త నిబంధనలు ప్రపంచ సప్లై చైన్ ను ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. చైనా తీరుపై ప్రపంచ కుబేరుడు తాజాగా స్పందించారు. ఎక్స్ లో ఆయన చేసిన పోస్టు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ‘ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియల్లో వెండి అవసరం’ అంటూ ఆయన చేసిన పోస్టు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉందని చెప్పాలి. పలు అంశాలు ప్రపంచాన్ని ప్రభావితం చేయటంలో చైనా కీలకంగా మారుతోందనటానికి వెండి ఉదంతం ఒక పెద్ద నిదర్శనంగా చెప్పాలి.