హోంశాఖ ఆశపడ్డ అజార్.. రేవంత్ ఇచ్చింది ‘మైనార్టీ’!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజుల తర్వాత చివరికి ఆయనకు శాఖలు కేటాయించబడ్డాయి.
By: A.N.Kumar | 4 Nov 2025 3:46 PM ISTతెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజుల తర్వాత చివరికి ఆయనకు శాఖలు కేటాయించబడ్డాయి. మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ బాధ్యతలు ఆయనకు ఇవ్వడం ద్వారా ఈ సస్పెన్స్‌కు ముగింపు పలికారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఈ నిర్ణయానికి వెనుక ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయని తెలుస్తోంది.
* హోంశాఖకే పట్టుబట్టిన అజార్
సీఎం రేవంత్ సర్కార్‌లో కీలకమైన హోంశాఖ తనకే ఇవ్వాలని అజారుద్దీన్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా మైనార్టీ నేత మహమూద్ అలీకి హోంశాఖను కేటాయించడంతో, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మైనార్టీకి ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతంగా హోంశాఖ తనకు ఇవ్వాలని అజార్ అభిలషించారని సమాచారం.
అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు క్రీడా శాఖ ఇవ్వాలని ప్రతిపాదించగా, అజార్ మాత్రం హోంశాఖకే మొగ్గు చూపారని తెలుస్తోంది. రేవంత్ స్పష్టంగా “ప్రస్తుతం సామాజిక సమీకరణాలు దృష్ట్యా హోంశాఖ ఇవ్వడం సాధ్యం కాదు” అని అజార్‌కు చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
* సీనియర్ నేతల్లో అసంతృప్తి.. సమీకరణాలే అడ్డంకి
జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజార్‌కు మంత్రి పదవి ఇవ్వడమే ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అసంతృప్తి రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు హోంశాఖ లాంటి కీలక బాధ్యత ఇస్తే అసంతృప్తి మరింత పెరుగుతుందనే భయంతోనే సీఎం రేవంత్ వెనుకడుగు వేశారని తెలుస్తోంది.
అంతేకాకుండా, ప్రస్తుత మంత్రుల శాఖల పునఃకేటాయింపుతో కూడిన సమస్యలు కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా క్రీడా శాఖను వాకిటి శ్రీహరి వద్ద నుంచి, మైనార్టీ శాఖను అడ్లూరి లక్ష్మణ్ వద్ద నుంచి తీసివేయాల్సి రావడంతో అంతర్గత సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళన ప్రభుత్వానికి ఉన్నట్లు సమాచారం.
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహంలో భాగం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మైనార్టీ ఓటర్లను ఆకర్షించడమే కాంగ్రెస్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా, మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించడం ద్వారా మైనార్టీ వర్గంలో తమ అనుబంధాన్ని బలపరచాలనే ప్రయత్నం చేసింది హస్తం పార్టీ.
కానీ హోంశాఖ ఇవ్వకపోవడం అజార్‌కు నిరాశ కలిగించినా, మైనార్టీ ఓటర్లకు సంకేతాత్మకంగా ఉన్న ఈ శాఖ కేటాయింపుతో పార్టీ తన రాజకీయ లెక్కల్ని సర్దుబాటు చేసుకుంది.
* సీఎం అభీష్టం ప్రకారమే నిర్ణయం
సామాజిక సమీకరణాలు, సీనియర్ నేతల అభిప్రాయాలు, మంత్రుల మధ్య శాఖల మార్పులు వంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి చివరికి తన అభీష్టం ప్రకారమే అజార్‌కు శాఖలు కేటాయించారు. హోంశాఖ ఇవ్వకపోయినా, మైనార్టీ సంక్షేమం మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల ద్వారా అజార్‌కు గౌరవప్రద స్థానం కల్పించినట్లు కనిపిస్తోంది. అంతిమంగా చెప్పాలంటే అజార్ కోరుకున్నది హోంశాఖ, కానీ రేవంత్ ఇచ్చింది సమీకరణాలకు సరిపోయే సమాధానం!
