Begin typing your search above and press return to search.

కొత్త ఇంటి కంటే.. పాతవి కొనడమే మేలు.. బోలెడు ప్రయోజనాలు అంటున్న కొనుగోలు దారులు..

ఒకప్పుడు కొత్త ఇల్లు అంటేనే అదొక హోదాగా భావించేవారం. కానీ, 2026 నాటి రియల్ ఎస్టేట్ సమీకరణాలు చూస్తుంటే, తెలివైన మధ్య తరగతి కొనుగోలుదారుడు ఇప్పుడు ‘పాతదే మేలు’ అనే ఉద్దేశ్యానికి వస్తున్నాడు.

By:  Tupaki Political Desk   |   31 March 2026 11:00 PM IST
కొత్త ఇంటి కంటే.. పాతవి కొనడమే మేలు.. బోలెడు ప్రయోజనాలు అంటున్న కొనుగోలు దారులు..
X

ఒకప్పుడు కొత్త ఇల్లు అంటేనే అదొక హోదాగా భావించేవారం. కానీ, 2026 నాటి రియల్ ఎస్టేట్ సమీకరణాలు చూస్తుంటే, తెలివైన మధ్య తరగతి కొనుగోలుదారుడు ఇప్పుడు ‘పాతదే మేలు’ అనే ఉద్దేశ్యానికి వస్తున్నాడు. అకాశాన్ని తాకుతున్న నిర్మాణ వ్యయం, పెరిగిన జీఎస్‌టీ భారం, తగ్గుతున్న కార్పెట్ ఏరియా వంటి అంశాలు రీసేల్ ఫ్లాట్ల వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల ఆకర్షణ కంటే, పాత ఇళ్లలోని స్పేస్ మరియు ఆర్థిక వెసులుబాటుకే సామాన్యుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు.

నిర్మాణ వ్యయం సెగ

గతేడాదితో పోలిస్తే సిమెంట్, స్టీల్ ధరలు, లేబర్ ఛార్జీలు 3-5 శాతం పెరగడం బిల్డర్లపై భారాన్ని పెంచింది. ఈ అదనపు భారాన్ని బిల్డర్లు కస్టమర్ల పైనే వేస్తుండడంతో, కొత్తగా లాంచ్ అయ్యే ఫ్లాట్ల ధరలు పెరిగిపోయాయి. నిర్మాణంలో ఉన్న ఇల్లు కొంటే, ఒకవైపు హోమ్ లోన్ ఈఎంఐ కడుతూనే, మరోవైపు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించడం మధ్య తరగతి కుటుంబాలకు తలకు మించిన భారంగా మారుతోంది. అదే రీసేల్ ఫ్లాట్ అయితే వెంటనే గృహప్రవేశం చేసి అద్దె భారాన్ని తగ్గించుకోవచ్చు.

స్పేస్, లోడింగ్ ఫ్యాక్టర్

వినియోగదారులు రీసేల్ ఫ్లాట్ల వైపు వెళ్లడానికి ప్రధాన కారణం స్థలం. 2026లో వస్తున్న కొత్త ప్రాజెక్టులలో లోడింగ్ ఫ్యాక్టర్ 35 నుంచి 40 శాతం వరకు ఉంటోంది. అంటే మీరు 1600 చదరపు అడుగుల ఫ్లాట్ కొన్నా, మీకు నివసించడానికి దక్కే అసలైన స్థలం చాలా తక్కువ. 8-10 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లలో లోడింగ్ కేవలం 20-25 శాతం మాత్రమే ఉండేది. దీనివల్ల పాత ఫ్లాట్లలో గదులు పెద్దగా, విశాలంగా ఉంటున్నాయి. పైగా పాత భవనాలలో యూడీఎస్ (UDS) కూడా ఎక్కువగా లభిస్తుండటం భవిష్యత్తులో రీ-డెవలప్‌మెంట్ సమయంలో పెద్ద ఆస్తిగా మారుతుంది.

జీఎస్‌టీ వెసులుబాటు

కొత్త ఫ్లాట్ల కొనుగోలుపై అదనంగా ఉండే ఖర్చులు రీసేల్ మార్కెట్‌లో ఉండవు. కొత్త ఫ్లాట్లపై 5 శాతం జీఎస్‌టీ అదనంగా చెల్లించాలి. కానీ పూర్తి స్థాయిలో సిద్ధమైన లేదా రీసేల్ ఫ్లాట్లకు జీఎస్‌టీ ఉండదు. ఒక పాత ఫ్లాట్‌ను కొని, సుమారు రూ. 15 లక్షలు వెచ్చించి కొత్తగా రినోవేట్ చేసుకున్నా.. అది కొత్త ఫ్లాట్ ధర కంటే తక్కువకే వస్తోందని కొనుగోలుదారులు లెక్కలు వేస్తున్నారు. అంటే పాత ధరలో కొత్త ఇంటి అనుభూతిని పొందవచ్చన్నమాట.

నమ్మకమే పెట్టుబడి!

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో కొనుగోలుదారుల్లో ఒక రకమైన సందిగ్ధత ఉంటోంది. ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా? లేదా అనే భయం కొత్త ప్రాజెక్టులలో ఉంటుంది. రీసేల్ ఫ్లాట్లలో ఆ రిస్క్ ఉండదు, ఎందుకంటే ఇల్లు కళ్ల ముందే ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం, రెడీ-టు-మూవ్ ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనివల్ల పాత అపార్ట్‌మెంట్‌ల ధరలు స్థిరంగా ఉంటూ ఇన్వెస్టర్లకు భరోసా ఇస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఫ్లాట్ కంటే రీసేల్ ఫ్లాట్ కొనుగోలు చేయడమే తెలివైన పనిగా కనిపిస్తోంది. ఎక్కువ స్థలం, తక్కువ పన్నులు, తక్షణ నివాసం వంటి సౌకర్యాలు రీసేల్ మార్కెట్‌ను కళకళలాడేలా చేస్తున్నాయి. మీరు కూడా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే, కేవలం బ్రోచర్‌లోని కలర్ ఫొటోలను చూసి మోసపోకుండా.. క్షేత్ర స్థాయిలో ఉన్న పాత ఫ్లాట్లను ఒకసారి పరిశీలించడం మంచిది. మీ బడ్జెట్‌లో పెద్ద ఇల్లు కావాలంటే రీసేల్ మార్కెటే సరైన మార్గం.