రాహుల్ ఇది బాగా గుర్తు పెట్టుకో !
అయితే ఇవి ఏ మాత్రం సరిపోవు. రాజకీయాల్లో అందరి మన్ననలు అందుకోవాలంటే చాలా మారాలి. రాహుల్ గాంధీ ఆ దిశగా ఇంకా చాలా శ్రమించాల్సి ఉందని వరస పరాజయాలు తెలియచేస్తున్నాయి.
By: Satya P | 15 Nov 2025 7:00 AM ISTగాంధీల ఐదో తరం వారసుడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ లో అగ్ర నేత. గట్టిగా చెప్పాలీ అంటే వారసత్వం నుంచి వచ్చిన నాయకుడు అయినా సొంత భావాలు తనకంటూ కచ్చితమైన సిద్ధాంతాలు భావజాలం కలిగిన వారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ఏనాటి నుంచో ఉన్న పార్టీ. భజనలు వ్యక్తి పూజలు నిండుగా ఉన్న పార్టీ. వాటికి దూరంగా ఉండడం ద్వారా రాహుల్ తాను డిఫరెంట్ అనిపించుకున్నారు. అంతే కాదు గాంధీలు అంటే రాజ ప్రాసాదాలలో ఉంటారు అన్న భ్రమలను తొలగించి జనం మధ్యకు వచ్చి వారితో చాలా సన్నిహితంగా గడుపుతున్న నాయకుడు కూడా రాహుల్ గాంధీ. అధికారం పదవులు లేకపోతే గాంధీలు ఉండరు అన్న దానికి భిన్నంగా ఆయన రాజకీయ జీవితం సాగుతూ వస్తోంది.
ప్రధాని పదవికి :
రాహుల్ గాంధీ తలచుకుంటే 2009లో ప్రధాని పదవి అంది వచ్చేది. కానీ ఆయన వద్దు అని చెప్పేసారు. ఎంతో అనుభవం కలిగిన మన్మోహన్ సింగ్ నాయకత్వాన్నే సమర్ధించారు. కనీసం కేంద్ర స్థాయిలో మంత్రిగా కూడా చేయాలని అధికారం అందుకోవాలని ఆయన భావించలేదు. ఒక విధంగా గాంధీల జమానాలో ఆయనలోని కొత్త కోణాన్ని ఇది తెలియచేస్తుంది. ఇక పార్టీ పదవులు అన్నీ గతంలో గాంధీ వంశీకులే నిర్వహించేవారు. కానీ వాటి జోలికి సైతం ఆయన పోలేదు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినా ఆ ఎన్నికల్లో ఓటమితో తప్పుకున్నారు. ఈ రోజు దాకా మళ్ళీ ఆ వైపు చూడలేదు. అది కూడా గొప్పగానే చెప్పుకోవాల్సిందే.
తీరు మార్చుకోవాల్సిందే :
అయితే ఇవి ఏ మాత్రం సరిపోవు. రాజకీయాల్లో అందరి మన్ననలు అందుకోవాలంటే చాలా మారాలి. రాహుల్ గాంధీ ఆ దిశగా ఇంకా చాలా శ్రమించాల్సి ఉందని వరస పరాజయాలు తెలియచేస్తున్నాయి. ఆయన చేసే కొన్ని విమర్శలు అయితే లాజిక్ కి అందకుండా ఉంటాయి. వాటిని జనం కోణంలో నుంచి కాకుండా రాజకీయం కోసమే ఆయన విమర్శలు చేస్తున్నట్లుగా ఉంటాయి. ఓట్ల చోరీ అంటూ ఆయన చేసిన ఆరోపణలు ఒక విధంగా అలాంటివే. ఓటు హక్కు అన్నది అందరికీ కావాలి. నిజానికి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు దానికి ఒక గౌరవంగా భావిస్తారు. వారికి ఓట్లు లేకపోతే అసలు ఊరుకోరు. పట్నాలలో ఉన్న వారే లైట్ తీసుకుంటారు. అలాంటిది పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగింది అని రాహుల్ చేసిన ఆరోపణలు అమాయకుల ఓట్లు పోతున్నాయని చెప్పిన తీరు రాజకీయ మైదానంలో తేలిపోయాయని చెప్పాల్సి ఉంది. వాటి మీద చర్చ అయితే అనుకున్న స్థాయిలో సాగలేదు అని అంటున్నారు.
మోడీ టార్గెట్ గా :
రాహుల్ గాంధీ ప్రజా సమస్యల మీద మాట్లాడడం ఇంకా పెరగాలి. ప్రతీ దానికీ మోడీకి ముడి పెట్టి చేసే విమర్శలు రాణింపు తేవు సరికదా ఆయన నాయకత్వం మీదనే చర్చకు తావిస్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి మోడీ భయపడుతున్నారు అని చేసిన రాహుల్ ఆరోపణలు బూమరాంగ్ అయ్యాయి. ఎందుకు అంటే భారతీయులు మొత్తం ట్రంప్ మీద ఆగ్రహంగా ఉన్నారు. ఆ సమయంలో రాహుల్ దేశ ప్రజల సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించాల్సింది అని అంటున్నారు. దౌత్య పరమైన వ్యూహాలలో కొన్ని సార్లు మౌనం కూడా ఉంటుంది. అలా అంతర్జాతీయ అంశాల మీద విమర్శలు కానీ వ్యాఖ్యానాలు చేసే ముందు రాజకీయాల కంటే దేశం ఫస్ట్ అన్నది కూడా గుర్తెరగాలి అని అంటున్నారు.
వారిలో ఒకరుగా కాదు :
జనంతో రాహుల్ చాలా బాగా కలసిపోతారు. ఆయన కుర్రాళ్ళతో క్రికెట్ రోడ్డు మీద ఆడుతారు. మిఠాయి దుకాణం వద్దకు వెళ్ళి తానే స్వయంగా స్వీట్ తయారు చేస్తారు. అంతే కాదు హఠాత్తుగా చెరువులోకి దిగి స్థానిక మత్య్సకారులతో కలసి చేపలు పడతారు. ఇవన్నీ బాగానే ఉన్నా నాయకుడు అంటే జనంలో ఒకడు మాత్రమే కాదు వారి కంటే తాను ప్రత్యేకం అని కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది. జనంతో కనెక్షన్ ఎంత ముఖ్యమో ఆ ప్రత్యేకతను చూపడం అంతే ముఖ్యం. లేకపోతే జనాలు ఇవన్నీ లైట్ గానే తీసుకుంటారు. మొత్తం మీద చూస్తే 55 ఏళ్ళ వయసు ఉన్న రాహుల్ గాంధీ రాజకీయం దేశ ప్రజలు అనుకున్నంత సీరియస్ గా తీసుకోవడం లేదా అంటే వస్తున్న ఫలితాలు తెలియచేస్తున్నాయి. ఆయన నేపథ్యం చూస్తే ఘనం. ముందే చెప్పుకున్నట్లుగా గాంధీల వారసుడు ప్రధానుల వంశీకుడు. కాబోయే ప్రధానిగా ట్యాగ్ కూడా ఉంది. అందువల్ల ఆ విధంగా జనం తనను చూస్తున్నపుడు తన నుంచి ఇంకా ఎక్కువగా ఆశిస్తారు అన్నది ఆయన గ్రహించాలని అంటున్నారు. ఆ విధంగానే ఆయన తన రాజకీయాన్ని మరింతగా రాటు తేలేలా చేసుకోవాలని అవసరం అయిన తీరులో మలచుకోవాలని బీహార్ తాజా ఫలితాలు చాటి చెబుతున్నాయి.
