Begin typing your search above and press return to search.

యుద్ధం ముగిసింది.. క్రూడ్ ధర తగ్గింది.. మరి మన బంకుల్లో ‘ఆయిల్’ ఎప్పుడు దిగుతుంది సామీ?!

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య నలిగిన నాలుగు నెలల యుద్ధ నాటకానికి ఎట్టకేలకు తెరపడింది. హార్ముజ్ జలసంధి గుండా చమురు నౌకలు మళ్లీ హుందాగా ప్రయాణిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   18 Jun 2026 8:00 PM IST
యుద్ధం ముగిసింది.. క్రూడ్ ధర తగ్గింది.. మరి మన బంకుల్లో ‘ఆయిల్’ ఎప్పుడు దిగుతుంది సామీ?!
X

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య నలిగిన నాలుగు నెలల యుద్ధ నాటకానికి ఎట్టకేలకు తెరపడింది. హార్ముజ్ జలసంధి గుండా చమురు నౌకలు మళ్లీ హుందాగా ప్రయాణిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ‘అమ్మయ్య’ అంటూ కిందకి దిగొస్తున్నాయి. ప్రపంచమంతా ఈ శాంతి ఒప్పందాన్ని చూసి సంతోషిస్తుంటే మన దేశంలో సామాన్యుడు మాత్రం జేబులో పర్సు తీసి బైక్ ట్యాంక్ వైపు చూస్తూ.. "యుద్ధం ముగిసింది సరే.. మరి మన బంకుల్లో రేట్లు ఎప్పుడు తగ్గుతాయి సామీ?" అని ఆకాశం వైపు చూస్తున్నాడు.

కానీ అంతర్జాతీయంగా ధరలు తగ్గగానే ఇక్కడ రేట్లు తగ్గించేయడానికి మన దేశంలో పెట్రోల్ ధరలు ఏమైనా షేర్ మార్కెట్ అనుకున్నారా? దానికి కొన్ని ‘సెంటిమెంట్లు’, లెక్కలు ఉంటాయి కదా.. సామాన్యుడి ఆశలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు చమురు కంపెనీలు గట్టిగానే క్లారిటీ ఇచ్చాయి. "అంతర్జాతీయంగా తగ్గితే వెంటనే ఇక్కడ తగ్గించాలా? అంత తొందరైతే ఎలా?" అంటూ పెట్రోలియం శాఖ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తోంది.

కేంద్రం చెబుతున్న వింత తర్కం.. ‘మేము అప్పుడు పెంచలేదుగా!’

ధరలు ఎందుకు తగ్గడం లేదనే దానికి కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపీతో పాటు అధికారులు చెబుతున్న కారణాలు వింటే సామాన్యుడికి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. యుద్ధం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ రేట్లు భారీగా పెంచేస్తే తాము మాత్రం ప్రజలపై ‘కరుణ’ చూపిస్తూ దశలవారీగా అంటే నెమ్మదిగా, నొప్పి తెలియకుండా కేవలం రూ. 7 నుంచి రూ. 8 మాత్రమే పెంచామట! "మేము పెంచినప్పుడు నెమ్మదిగా పెంచాం కదా.. మరి తగ్గించేటప్పుడు కూడా అంతర్జాతీయ పరిస్థితులు పూర్తిగా స్థిరపడి.. మాకు నమ్మకం కుదిరే వరకు నెమ్మదిగానే ఆలోచిస్తాం. అంతవరకు ఓపిక పట్టండి!" అంటూ సెలవిచ్చారు.

హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం మంచిదే కానీ.. ఆ సానుకూల ప్రభావం ఢిల్లీ, హైదరాబాద్ బంకులకు చేరడానికి చాలా సమయం పడుతుందట. అంటే అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఓవర్ నైట్ లో ఇక్కడ రేట్లు పెంచేసే చమురు కంపెనీలకు, ధరలు తగ్గినప్పుడు మాత్రం ‘సమయం’ అనే పెద్ద లారీ అడ్డంగా కనిపిస్తోందన్నమాట..

కంపెనీల పాత బాకీలు.. పాపం ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు

ఇక చమురు కంపెనీల బాధలు వర్ణనాతీతం. యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు తాము తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు రేట్లు తగ్గాయి కాబట్టి ఆ నష్టాలన్నింటినీ ‘పూడ్చుకోవడానికి’ ఇదే సరైన సమయమని కంపెనీలు భావిస్తున్నాయి. అంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల వచ్చిన లాభాలను కంపెనీలు తమ పాత గాయాలకు మందుగా రాసుకుంటున్నాయి తప్ప వినియోగదారుడికి పంచే ఉద్దేశంలో లేవు.

మరోవైపు మన దేశంలో పెట్రోల్ ధరను కేవలం ముడి చమురు ధర మాత్రమే డిసైడ్ చేయదు. దాని వెనుక కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ , డీలర్ కమీషన్లు, రవాణా ఖర్చులు.. ఇలా ఎవరి వాటా వారు తీసుకున్నాకే అది సామాన్యుడి వాహనంలోకి చేరుతుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధర తగ్గినా ఈ పన్నుల గోడలు తగ్గనంత వరకు ధరలు దిగిరావు.

పెట్రోల్ ధరలు తగ్గేది ఎప్పుడు?

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చమురు ధరలు తగ్గే అవకాశం పూర్తిగా లేకపోలేదు. కానీ అది "ఇప్పుడే.. ఈ క్షణమే" మాత్రం జరగదు. అంతర్జాతీయ మార్కెట్ కనీసం కొన్ని వారాల పాటు స్థిరంగా ఇలాగే తక్కువ ధరల్లో కొనసాగాలి.. ఆ తర్వాత చమురు కంపెనీల నష్టాలు పూర్తిగా పూడాలి.. ఆపై కేంద్ర ప్రభుత్వం దయా హృదయంతో సమీక్ష జరపాలి.. అప్పుడు మాత్రమే లీటర్ పై ఒక రూపాయో, రెండు రూపాయలో తగ్గే భాగ్యం కలుగుతుంది.

అప్పటివరకు సామాన్యుడు చేయాల్సిందల్లా ఒక్కటే.. ‘అంతర్జాతీయ స్థిరత్వం’ కోసం ప్రార్థిస్తూ బంకుల్లో పాత ధరలకే లీటర్లు కొట్టిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు తన వంతు సహకారం అందించడమే..