Begin typing your search above and press return to search.

తెలంగాణలో పెట్రో ధరలు ఎందుకు ఎక్కువో చెప్పిన కేంద్రమంత్రి

తెలంగాణలో పెట్రోల్.. డీజిల్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? ఇదే ప్రశ్నను రాజ్యసభలో సంధించారు బీఆర్ఎస్ ఎంపీ బి.పార్థసారధి.

By:  Garuda Media   |   16 Dec 2025 11:00 AM IST
తెలంగాణలో పెట్రో ధరలు ఎందుకు ఎక్కువో చెప్పిన కేంద్రమంత్రి
X

తెలంగాణలో పెట్రోల్.. డీజిల్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? ఇదే ప్రశ్నను రాజ్యసభలో సంధించారు బీఆర్ఎస్ ఎంపీ బి.పార్థసారధి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అడిగిన ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి సురేష్ గోపి బదులిచ్చారు. ఆసక్తికర అంశం ఏమంటే.. పెట్రో ధరలు ఎక్కువగా ఉండే టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అయితే.. తెలంగాణ ఆవిర్భావం మొదలు పదేళ్లు నాన్ స్టాప్ గా పవర్ లో ఉన్న బీఆర్ఎస్.. ఆ ధరల తగ్గింపు అంశాన్ని పట్టించుకోలేదు. కానీ.. తాజాగా మాత్రం ప్రశ్నించిన వైనం చూస్తే వావ్.. వాటే రాజకీయం అనుకోకుండా ఉండలేం.

ఇంతకూ గులాబీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన ఆన్సర్ చూస్తే.. ‘‘దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై అధికంగా రూ.26.92, లీటరు డీజిల్ పై రూ.19.80 చొప్పున వ్యాట్ (వాల్యూ యాడెడ్ ట్యాక్స్) రూపంలో పన్ను వసూలు చేస్తుంది. తెలంగాణలో అత్యధికంగా పెట్రో ధరలకు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాటే కారణం’’ అని స్పష్టం చేసింది. తాజా పరిణామంతో మరోసారి పెట్రో ధరల మంటలపై మరోసారి చర్చకు తెర లేచిందని చెప్పాలి.

2025 డిసెంబరు డేటా ప్రకారం చూస్తే దేశంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉండే టాప్ 5 రాష్ట్రాల్ని చూస్తే.. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర దగ్గర దగ్గర రూ.109.83. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంటుంది. లీటరు రూ.107.27. మూడో స్థానంలో కేరళ రాష్ట్రం నిలుస్తుంది. ఇక్కడ లీటరు రూ.107.08. ఆ తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ (రూ.106.97), ఐదో స్థానంలో బిహార్ నిలుస్తుంది. ఇక్కడ లీటరు రూ.106.94.

పెట్రోల్ సంగతి ఇలా ఉంటే.. దేశంలో డీజిల్ ధరలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల జాబితాలోనూ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవటం గమనార్హం. లీటరు డీజిల్ రూ.97.57 కాగా.. రెండో స్థానంలో కేరళ (రూ.96.48), మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రం (రూ.95.70) నిలుస్తుంది. ఇదంతా చూసినప్పుడు దేశంలో అత్యంత ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉండే రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటి స్థానంలో ఉంటే.. టాప్ 3లో రెండు తెలుగు రాష్ట్రాలు చోటు దక్కించుకోవటం గమనార్హం. ఇలాంటి వేళలో వచ్చే సందేహం ఏమంటే.. దేశంలో అతి తక్కువ ధరలకు పెట్రోల్, డీజిల్ ఎక్కడ లభ్యమవుతాయి? ధరలు ఎంతన్నది చూస్తే.. కేంద్రపాలిత ప్రాంతమైన ఒక చోట అతి తక్కువ ధరలకు లీటరు పెట్రోల్, డీజిల్ లభిస్తుండటం విశేషం.

భారతదేశంలో అత్యంత చౌకగా పెట్రోల్, డీజిల్ లభించే కేంద్రపాలిత ప్రాంతంగా అండమాన్ నికోబార్ దీవులుగా చెప్పాలి. ఇక్కడ లీటరు పెట్రోలు ధర అక్షరాల రూ.82.46 అయితే లీటరు డీజిల్ ధర రూ.78.05 మాత్రమే. ఆ తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నిలుస్తుంది. ఇక్కడ లీటరు పెట్రోల్ (రూ.92.53), డీజిల్ (రూ.80.16)గా లభిస్తుంది. ఆ తర్వాతి ప్రాంతాల్లో కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ డియు, దాద్రా నగర్ హవేలి ప్రాంతాల్లో తక్కువ ధరలకే లభిస్తున్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో అతి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ లభించే ప్రాంతంగా చండీగఢ్ పేరును చెప్పాలి.