Begin typing your search above and press return to search.

దృష్టి పాత వెండిపై.. ఒకే రోజులో 100 టన్నులు.. కారణం?

పండుగల సమయంలో పెరుగుతున్న గృహ అవసరాలతో పాటు లాభాల స్వీకరణ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అన్నారు.

By:  Madhu Reddy   |   7 Dec 2025 1:45 PM IST
దృష్టి పాత వెండిపై.. ఒకే రోజులో 100 టన్నులు.. కారణం?
X

రోజురోజుకీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కోసారి ధరల్లో తగ్గుదల కనిపించినప్పటికీ అవి కేవలం రూ.100, రూ.1000 మించి తక్కువగా ఉండడం లేదు. ధరలు పెరిగితే మాత్రం రూ.2000, రూ.3 వేలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు పాత వెండిపై అందరి దృష్టి పడింది అనే విషయం స్పష్టమవుతోంది. తాజాగా ఇండియన్ బులియన్ , జ్యువెల్లర్స్ అసోసియేషన్(IBJA) అంచనా ప్రకారం.. కేవలం ఒక వారంలోనే దాదాపు 100 టన్నుల పాత వెండి అమ్ముడు అయినట్టు తెలుస్తోంది.

అయితే దేశీయ మార్కెట్లో ఒక నెలలో దాదాపు 10 నుండి 15 టన్నుల వెండి మాత్రమే అమ్ముతారు. కానీ ఒక వారంలో దాదాపు 100 టన్నుల వెండి అమ్మకానికి రావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. IBJA రిటైల్ డేటా ప్రకారం.. బుధవారం కిలో గ్రాముకు రూ.1,78,684 రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ధరల కారణంగా వెండి సరఫరాలో అకస్మాత్తుగా పెరుగుదల ఏర్పడింది. గురువారం ధరలు రూ.1,75,730కి కొద్దిగా తగ్గినప్పటికీ ఈ ధర ఇటీవల కనిష్ట స్థాయిల కంటే దాదాపు 20% ఎక్కువగా ఉంది.

పండుగల సమయంలో పెరుగుతున్న గృహ అవసరాలతో పాటు లాభాల స్వీకరణ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అన్నారు. పెళ్లిళ్ల సీజన్, వింటర్ సీజన్లో వెకేషన్ లకి వెళ్లడం కోసం డబ్బు కావాలి. అందుకే తమ దగ్గర ఉన్న పాత వెండిని ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు. మార్కెట్లో అమ్మే ఈ పాత వెండిలో ఎక్కువ శాతం ఆభరణాలు, ఇంట్లోని పాత వస్తువులే అని తెలుస్తుంది. దీపావళి, ధంతెరాస్ సమయంలో కిలో వెండి రూ.1.75 లక్షలకు చేరగా.. ఆ తర్వాత

రూ.1.45 లక్షలకు పడిపోయింది. ఈ మధ్య కాలంలో ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి.

అయితే ఎక్కువ ధర ఉన్నప్పుడు అమ్మేసి లాభాలు పొందుదాం అని వెండి నిల్వ ఉన్నవారు ఆలోచన చేస్తున్నారు. అందుకే పాత వెండిని అమ్మేస్తున్నారు. అలాగే ఈ ఏడాది వెండి ఒక స్టార్ పెర్ఫార్మర్ గా మారింది. 2024లో వెండి కిలోకి రూ.86,005 నుండి ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. అదే సమయంలో బంగారం కూడా దాదాపు 60 శాతం పెరిగింది.

ధరలు ఈ రేంజ్ లో పెరగడం వల్ల చాలామంది ఎక్కువ ధరకు అమ్మాలని కోరుకుంటున్నారు. అంతేకాదు వెండి కిలో కు 2 లక్షల మైలురాయిని చేరుకుంటుందని భావిస్తున్నారు. ఇక 2026 మొదటి త్రైమాసికంలో వెండి కిలోకి 2 లక్షలకు , వచ్చే ఏడాది చివరి నాటికి రూ.2.4 లక్షలకు చేరుకుంటుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ నవీన్ తో అంచనా వేశారు. అయితే బంగారం తవ్వకాల్లో భాగంగా వెండిని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. వెండి ఉత్పత్తి నేరుగా జరగడం చాలా తక్కువ. అంతేకాకుండా జింక్ , మైనింగ్,సీసం వంటి తవ్వకాల్లో కూడా ఉప ఉత్పత్తిగా వెండి ఉత్పత్తి చేయబడుతుంది.

2025 నాటికి వెలికి తీసిన వెండి మొత్తం 813 మిలియన్ ఔన్స్ లు మాత్రమే. అలాగే పెరూ, ఇండోనేషియాలో వెండి ఉత్పత్తి తక్కువగా ఉండగా.. రష్యా, మెక్సికోలో వెండి ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అంతర్జాతీయంగా చూసుకుంటే పాత వెండితో కలిసి 1.022 బిలియన్ ఔన్స్ ల వెండి అందుబాటులో ఉండగా.. గిరాకీ 1.117 బిలియన్ ఔన్స్ లు ఉండవచ్చునని మార్కెట్ వర్గాలు అంచనా వేశారు.