Begin typing your search above and press return to search.

టీని దాటేస్తున్న కాఫీ కల్చర్.. యువతలో ఈ మార్పుకు కారణమేంటి?

ఇది కేవలం పానీయంలో వచ్చిన మార్పు మాత్రమే కాదు.. భారతీయ యువత ఆలోచనల్లో జీవనశైలిలో చోటు చేసుకుంటున్న ఒక వినూత్న సంస్కృతి.

By:  A.N.Kumar   |   30 Aug 2026 12:00 AM IST
టీని దాటేస్తున్న కాఫీ కల్చర్.. యువతలో ఈ మార్పుకు కారణమేంటి?
X

ఒకప్పుడు మనదేశంలో పొద్దున్నే లేవగానే గుర్తొచ్చే మొదటి ఆలోచన.. వేడివేడి టీ.. ఆఫీసు బ్రేక్ అయినా.. బాబాయ్ హోటల్ ముందు దోస్తులతో ముచ్చటైనా టీ చుట్టూనే తిరిగేది. కానీ ఇప్పుడు కాలం మారింది. పట్టణాల్లో టీ స్థానాన్ని కాఫీ వేగంగా ఆక్రమిస్తోంది. ఇది కేవలం పానీయంలో వచ్చిన మార్పు మాత్రమే కాదు.. భారతీయ యువత ఆలోచనల్లో జీవనశైలిలో చోటుచేసుకుంటున్న ఒక వినూత్న సంస్కృతి.

కేఫ్ అంటే కేవలం కాఫీ మాత్రమే కాదు.. ఒక అనుభూతి

ఈ రోజుల్లో యువత కేఫ్‌కి వెళ్లేది కేవలం దాహం తీర్చుకోవడానికి కాదు. అదొక సోషల్ ఎక్స్‌పీరియన్స్. ప్రశాంతమైన మ్యూజిక్, ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్, హైస్పీడ్ వైఫై, ల్యాప్‌టాప్‌తో వర్క్ చేసుకునే సదుపాయం.. ఇవన్నీ కేఫ్‌లను ఒక కొత్త అధ్యాయానికి వేదికగా మార్చాయి. స్నేహితులతో సరదాగా గడపడానికైనా, వ్యాపార చర్చలకైనా, ఆఖరికి ల్యాప్‌టాప్‌తో వర్క్ ఫ్రమ్ కేఫ్ చేయడానికైనా కాఫీ షాప్‌లే ఫస్ట్ ఛాయిస్‌గా మారుతున్నాయి.

సోషల్ మీడియా .. స్టేటస్ సింబల్

ఇన్స్టాగ్రామ్, రీల్స్ యుగంలో కేఫ్ కల్చర్ ఒక డిజిటల్ ట్రెండ్‌గా మారింది. చేతిలో ఆకర్షణీయమైన కాఫీ కప్పు, పక్కనే ల్యాప్‌టాప్, ఆహ్లాదకరమైన లైటింగ్.. ఇవన్నీ ఒక లైఫ్‌స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారాయి. రూ. 200 వెచ్చించి కాఫీ కొంటున్నారంటే అక్కడ వారు చెల్లిస్తోంది కేవలం పానీయానికి కాదు.. ఆ ప్రదేశం ఇచ్చే ఆహ్లాదకరమైన అనుభవానికి అక్కడ పొందే గుర్తింపుకి..

మారుతున్న భారత్.. పెరుగుతున్న అవకాశాలు!

టీ మన సాంప్రదాయంలో భాగమైతే కాఫీ యువత ఆశయాలకు, ఆధునిక ఆలోచనలకు ప్రతిరూపంగా మారుతోంది. స్పెషల్టీ కాఫీలు, రకరకాల ఫ్లేవర్లను ఆస్వాదించడం ఒక ఆర్ట్‌గా మారుతోంది. ప్రపంచస్థాయి కేఫ్ బ్రాండ్లు భారత్‌లోకి అడుగుపెట్టడం, స్థానిక స్టార్టప్ కేఫ్‌లు పుట్టుకురావడం ఈ మార్పుకు నిదర్శనం.

టీ ప్రాధాన్యత మన మూలాల్లో ఎప్పటికీ తగ్గదు.. కానీ ఆధునిక యువత వేగానికి, వారి గ్లోబల్ ఆలోచనా విధానానికి కాఫీ కల్చర్ ఒక కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. నేటి యువతకు కేఫ్ అనేది కేవలం ఒక ప్రదేశం కాదు.. వారి కలలు, ఆలోచనలు, సరికొత్త మైలురాళ్లకు వేదిక.