Begin typing your search above and press return to search.

భారతీయులకు పింక్ లిప్స్ ఎందుకు ఉండవు.. కారణమేంటి?

నేటి గ్లామర్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలలా మెరిసిపోవాలని ఆరాటపడుతుంటారు.

By:  A.N.Kumar   |   11 April 2026 4:00 AM IST
భారతీయులకు పింక్ లిప్స్ ఎందుకు ఉండవు.. కారణమేంటి?
X

నేటి గ్లామర్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలలా మెరిసిపోవాలని ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే విదేశీయుల లేదా ఫిల్టర్లతో కూడిన ఫోటోలను చూసి భారతీయులు కూడా తమకు సహజంగానే గులాబీ రంగు పెదవులు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే భారతీయుల్లో పెదవుల రంగు సహజంగానే కాస్త ముదురు రంగులో ఎందుకు ఉంటుందో చాలామందికి తెలియదు. దీనికి కారణం మనం వాడే కాస్మెటిక్స్ లోపం కాదు.. మన శరీరంలోని జీవక్రియలు, భౌగోళిక పరిస్థితులు అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మెలనిన్: మన శరీర రక్షణ కవచం

ప్రముఖ డెర్మటాలజిస్ట్ , మాజీ ఎయిమ్స్ వైద్యురాలు డాక్టర్ ఆంచల్ పంత్ వివరణ ప్రకారం.. భారతీయుల పెదవుల రంగుపై అత్యంత ప్రభావం చూపేది ‘మెలనిన్’ అనే పిగ్మెంట్. భారతదేశం వంటి ఉష్ణమండల దేశాల్లో సూర్యరశ్మి, అతినీలలోహిత (యూవీ) కిరణాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హానికరమైన కిరణాల నుండి మన కణాలను రక్షించడానికి శరీరం సహజంగానే ఎక్కువ మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. చర్మంలో మెలనిన్ శాతం పెరిగే కొద్దీ చర్మం రంగు ముదురుగా మారుతుంది. పెదవులపై ఉండే చర్మం అత్యంత సున్నితంగా పలుచగా ఉండటం వల్ల అక్కడ మెలనిన్ పిగ్మెంటేషన్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే భారతీయులకు పెదవులు సహజంగానే గోధుమ లేదా కాస్త నలుపు రంగులో కనిపిస్తాయి.

పాశ్చాత్యులతో పోలిక.. ఎందుకు తేడా ఉంటుంది?

యూరప్ లేదా అమెరికా వంటి శీతల దేశాల్లో నివసించే వారిలో మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. వారి చర్మం చాలా పలుచగా ఉండటంతో చర్మం కింద ఉండే రక్తనాళాలు బయటకు ప్రతిబింబిస్తాయి. దీనివల్ల వారి పెదవులు ఎర్రగా లేదా పింక్ రంగులో కనిపిస్తాయి. ఇది కేవలం వాతావరణం వల్ల మాత్రమే కాకుండా వేల ఏళ్లుగా వస్తున్న జన్యుపరమైన మార్పుల వల్ల కూడా స్థిరపడిపోయింది.

పెదవుల రంగు మారడానికి ఇతర కారణాలు

సహజ సిద్ధమైన రంగు పక్కన పెడితే కొన్ని బాహ్య కారణాల వల్ల పెదవులు మరింత నల్లగా మారే అవకాశం ఉంది. సిగరెట్‌లోని నికోటిన్ , తార్ పెదవుల మీద పేరుకుపోయి రక్త ప్రసరణను తగ్గించి, పెదవులను నల్లగా మారుస్తాయి. టీ , కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా పెదవులపై రంగు మారుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే పెదవులు పొడిబారి పాలిపోయినట్లుగా కనిపిస్తాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల సన్ ట్యాన్ ఏర్పడి పిగ్మెంటేషన్ పెరుగుతుంది.

పెదవుల ఆరోగ్యం కోసం నిపుణుల సూచనలు..

భారతీయులకు సహజంగా పింక్ లిప్స్ రావడం కష్టమైనా ఉన్న రంగును ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ ప్రభావం నుండి పెదవులను రక్షించుకోవడానికి కనీసం ఎస్.పీ.ఎఫ్ 30 ఉన్న లిప్ బామ్స్ వాడాలి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల పెదవులు మృదువుగా ఉంటాయి. నాణ్యత లేని లిప్‌స్టిక్స్ లేదా ఎక్స్‌పైరీ అయిపోయిన ఉత్పత్తులను వాడకూడదు. పెదవులపై ఉన్న మృతకణాలను తొలగించడానికి వారానికి ఒకసారి తేనె, చక్కెర వంటి సహజ మిశ్రమంతో స్క్రబ్ చేయడం మంచిది.

మన పెదవుల రంగు అనేది మన జాతి , వాతావరణానికి అనుగుణంగా ప్రకృతి ప్రసాదించిన ఒక రక్షణ వ్యవస్థ. పింక్ రంగు మాత్రమే అందానికి కొలమానం కాదు. నలుపు లేదా గోధుమ రంగు పెదవులు మనల్ని సూర్యరశ్మి వల్ల వచ్చే క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తాయి. కాబట్టి, కృత్రిమ పద్ధతుల ద్వారా రంగు మార్చుకోవడానికి ప్రయత్నించడం కంటే సహజత్వాన్ని గౌరవిస్తూ పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమ మార్గం.