Begin typing your search above and press return to search.

రక్షణ రంగాన్ని పటిష్టం చేసే పనిలో కేంద్రం

అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఆ మొత్తం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ విశ్లేషించారు.

By:  A.N.Kumar   |   14 Jan 2026 12:00 AM IST
రక్షణ రంగాన్ని పటిష్టం చేసే పనిలో కేంద్రం
X

ప్రస్తుతం ప్రపంచం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం, మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ఇంకోవైపు ఆసియా పసిఫిక్ రీజియన్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం.. ఇవన్నీ గ్లోబల్ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సైనిక సామర్థ్యాన్ని ఆధునీకరించుకోవడానికి డిఫెన్స్ బడ్జెట్ పెంపుపై దృష్టి సారించింది.

అంతర్జాతీయ అనిశ్చితి - దేశాల పోటీ

ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ తమ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక డిఫెన్స్ బడ్జెట్ కలిగిన అమెరికా, తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి నిధులను మరింత పెంచుతోంది. మన పొరుగు దేశమైన చైనా తన సైనిక శక్తిని నిరంతరం ఆధునీకరిస్తోంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఏరోస్పేస్, నావికా దళాల్లో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తోంది. ఈ పరిణామాలు భారత్‌ను అప్రమత్తం చేశాయి. శత్రువుల ఎత్తుగడలకు పైఎత్తు వేయాలంటే బడ్జెట్ కేటాయింపులు పెరగడం అనివార్యమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

గత బడ్జెట్ గణాంకాలు.. ప్రస్తుత అంచనాలు

గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి ₹6.8 లక్షల కోట్లను కేటాయించింది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఆ మొత్తం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ విశ్లేషించారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా రక్షణ రంగంలో పెట్టుబడులు పెరగడం సహజం. భారతదేశం కూడా తన భద్రతా అవసరాల కోసం ఈసారి బడ్జెట్‌లో మరిన్ని నిధులను కేటాయించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

'మేక్ ఇన్ ఇండియా'కు ఊతం

కేవలం విదేశాల నుండి ఆయుధాలను దిగుమతి చేసుకోవడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దేశీయంగా ఆయుధాల తయారీకి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. తేజస్ యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి ప్రాజెక్టుల విజయంతో భారత్ ఇప్పుడు ఎగుమతిదారుగా కూడా ఎదుగుతోంది. రక్షణ రంగంలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతోంది.

రక్షణ పటిష్ఠత వల్ల చేకూరే ప్రయోజనాలు

రాబోయే బడ్జెట్‌లో నిధుల పెంచనున్నారు. సరిహద్దుల్లో పహారా కాసే సైనికులకు అత్యాధునిక రైఫిళ్లు, కమ్యూనికేషన్ పరికరాలు, ధరించే దుస్తుల్లో నాణ్యత పెరుగుతుంది. డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో భారత్ మరింత బలోపేతం అవుతుంది. నా, పాకిస్తాన్ సరిహద్దుల్లో రోడ్లు, సొరంగాలు, ఎయిర్ స్ట్రిప్స్ నిర్మాణాలు వేగం అందుకున్నాయి. .

మొత్తానికి మారుతున్న కాలానికి అనుగుణంగా భారత రక్షణ వ్యవస్థను తీర్చిదిద్దడం ఇప్పుడు అత్యవసరంగా మారింది. రాబోయే బడ్జెట్‌లో కేంద్రం తీసుకునే నిర్ణయాలు దేశ భద్రతనే కాకుండా రక్షణ రంగ స్టాక్స్, ఆర్థిక వ్యవస్థపై కూడా బలమైన ప్రభావాన్ని చూపనున్నాయి.