Begin typing your search above and press return to search.

కోడిలాంటి కోడి.. కోసుకు తింటే మాత్రం జైలు ఖాయం

చూసేందుకు అచ్చం కోడిలానే ఉండటమే కాదు.. నాటు కోళ్ల కంటే బలంగా.. అందంగా..చూసినంతనే చికెన్ చేసేస్తే సరి అన్నట్లుగా అనిపించే వీటిని గ్రే జంగిల్ ఫౌల్.

By:  Garuda Media   |   28 May 2026 2:00 PM IST
కోడిలాంటి కోడి.. కోసుకు తింటే మాత్రం జైలు ఖాయం
X

చూసేందుకు అచ్చం కోడిలానే ఉండటమే కాదు.. నాటు కోళ్ల కంటే బలంగా.. అందంగా..చూసినంతనే చికెన్ చేసేస్తే సరి అన్నట్లుగా అనిపించే వీటిని గ్రే జంగిల్ ఫౌల్. వాడుక భాషలో అడవి కోళ్లు అనేయొచ్చు. కానీ.. వీటిని చూసి మురిసిపోవాలే కానీ.. కోసుకు తినేద్దాం.. చికెన్ వండేద్దామన్న ఆలోచన వస్తే మాత్రం మొదటికే మోసం రావటమే కాదు.. జైలుకు పక్కాగా అడుగులు పడినట్లే. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇప్పుడు మన నాటు కోళ్లకు ఈ జాతే మూల పురుషులుగా శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ జాతిలో మగ కోడి సుమారు 75 సెం.మీ. పొడవుతో పాటు.. మెడపై నలుపు.. బూడిద రంగు ఈకలతో ఇట్టే ఆకర్షించేలా ఉంటాయి. ఈ రంగులే కాదు.. బంగారం.. పసుపు రంగు మచ్చలతో మెరుస్తూ చూసినంతనే ఆకర్షించేలా ఉంటాయి. తలపై చిన్న ఎర్రటి దువ్వెన ఉంటుంది. ఇక.. ఆడ కోడి విషయానికి వస్తే 38సెం.మీ. పొడవుతో బూడిద - గోధుమ రంగులో ఉంటాయి.

ఈ జాతి కోళ్ల కాళ్లు హైలెట్ గా చెప్పాలి. ఇవి పసుపు లేదంటే ఎరుపు రంగులో ఉంటాయి. అంతేకాదు.. మనం ఇళ్లల్లో పెంచుకునే పెంపుడు కోళ్లకు ఉండే పసుపు కాళ్లకు ఈ గ్రే జంగిల్ ఫౌల్ జన్యువులే కారణంగా చెబుతారు. ఈ రకం కోళ్లు సౌత్ లోనూ.. నార్త్ లోని అడవుల్లో కనిపిస్తుంటాయి. గింజలు..చెదపురుగులు.. చిన్న కీటకాలను ఆహారంగా తినే ఈ జాతి కోళ్లు.. మనుషుల్ని చూసినంతనే చెట్ల పొదల్లోకి పారిపోతుంటాయి. శత్రువుల కారణంగా ప్రాణభయం ఉందని భావిస్తే మాత్రం.. చెట్లపైకి ఎగిరే సామర్థ్యం వీటి సొంతం. ఈ జాతి కోళ్లు గుడ్లు పెట్టటటానికి ముందు.. చిన్న గూడు లాంటిది సిద్ధం చేసుకొని పెడతాయి. ఒకసారి నాలుగు నుంచి ఏడు గుడ్లు పెడతాయి. వీటిని పొదిగేందుకు 21 రోజులు పడుతుందని చెబుతారు. భారతదేశ వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం వీటికి చట్టపరమైన రక్షణ ఉంది.

ఈ కారణంగానే.. వీటిని వేటాడినా.. చంపినా.. వీటి మాంసాన్ని తిన్న జైలుశిక్ష ఖాయం. వీటిని వేటాడినా.. వాటి గుడ్లను సేకరించినా.. వాటి మాంసాన్ని వండలం.. తినటం.. రవాణా చేయటం పూర్తిగా చట్టవిరుద్ధం. వీటిని వేటాడినట్లుగా కానీ.. తిన్నట్లుగా కానీ గుర్తిస్తే అటవీ చట్టాల ప్రకారం కనీసం మూడేళ్ల నుంచి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు కఠిన కారాగారశిక్ష ఖాయం. కొన్ని సందర్భాల్లో జైలుశిక్షతో పాటు కనీసం రూ.25వేల జరిమానాను సైతం విధిస్తారు. అంతేకాదు.. ఈ కేసు నమోదు అయినపక్షంలో బెయిల్ కూడా త్వరగా రాదు. ఎందుకంటే.. ఈ చట్టం కింద కేసులు నమోదైతే.. నాన్ బెయిలబుల్ కిందకు వస్తాయి. అందుకే.. అడవి కోడి అని చెప్పి.. ఊరించి తినిపించే ప్రయత్నం చేస్తే.. కేర్ ఫుల్ గా ఉండండి. వీటి జోలికి వెళితే.. కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.

చాలామంది వీటిని చూసినంతనే.. ఊళ్లల్లో దొరికే నాటుకోళ్లుగా భావిస్తారు. వీటిని వేటాడి.. సమస్యల్లో చిక్కుకుంటారు. మరికొందరు వీటి మాంసం గురించి గొప్పగా చెప్పటం.. చట్టం గురించి.. అందులోని కేసు తీవ్రత గురించి తెలియక దొరికిపోతుంటారు. అందుకే.. కోడిలాంటి వీటి విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండటం చాలా అవసరం. ఈ గ్రే జంగిల్ ఫౌల్ కు సంబంధించి మరికొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీటి జాతిని రక్షించేందుకు..వీటి సంఖ్యను పెంచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తుండటం విశేషం.

తిరుపతి జూ పార్కులో వీటి సంతానం కోసం ప్రత్యేకంగా కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో వీటి సంతానాన్ని పెద్ద ఎత్తున పెంచి అనంతరం అడవుల్లో వదిలేస్తుంటారు. హైదరాబాద్ లోని సీసీఎంబీ ల్యాబ్ ద్వారా వీటి జన్యుపరీక్షలు జరిపి.. వీటిల్లో స్వచ్ఛమైన గ్రే జంగిల్ ఫౌల్స్ ను ఎంపిక చేసి.. వీటిని శాస్త్రీయంగా పెంచే ప్రయత్నం చేస్తుంటారు. ఈ అడవి కోళ్ల మాంసానికి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాదు.. మగ కోళ్ల మెడపై ఆకర్షణీయంగా.. మెరుస్తూ ఉండే ఈకలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వీటిని చేపల వేటలో ఎరగా వాడేందుకు వినియోగిస్తారు. అందుకే.. వీటిని రహస్యంగా వేటాడటం.. లేదంటే పెంచే ప్రయత్నం చేస్తుంటారు. కోడిలానే ఉంది.. మహా అయితే నాటుకోడి అనుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో బహుపరాక్.. బహుపరాక్ అనుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. మొదటికే మోసం రావటం ఖాయం. ఈ గ్రే జంగిల్ ఫౌల్స్ విషయంలో బీకేర్ ఫుల్ అని మాత్రం చెప్పక తప్పదు.