బంగారం ధరలు.. ఇక ఇప్పట్లో కిందికి రావు
బంగారం పెరుగుదలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు కీలకమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫస్ట్ పేరుతో ట్రంప్.. విదేశాలపై టారిఫ్ వార్ మొదలుపెట్టారు.
By: A.N.Kumar | 26 Jan 2026 5:00 PM ISTబంగారం ధరలు ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా ఆకాశాన్నంటుతోంది. ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ తగ్గినా అది మైనర్ కరెక్షన్ గానే భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదలకు అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితి ప్రధాన కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండితో పాటు కాపర్, ఇతర లోహాల ధరలు భారీగా పెరుగుతుండటం అనిశ్చితిని సూచిస్తోంది.
బంగారం ఎందుకు పెరుగుతోంది ..
బంగారం పెరుగుదలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు కీలకమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫస్ట్ పేరుతో ట్రంప్.. విదేశాలపై టారిఫ్ వార్ మొదలుపెట్టారు. అన్ని దేశాలపై సుంకాలు విధించారు. దీంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం మొదలైంది. ట్రంప్ నిర్ణయాలు ఎటు వైపు దారితీస్తాయో అర్థం కానటువంటి అనిశ్చితి.
అదే సమయంలో ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం, వెనుజులా అధ్యక్షుడి నిర్బంధం, గ్రీన్ ల్యాండ్ ఆక్రమణ ప్రయత్నం, ఇరాన్ పై ఆంక్షలు, చైనా ఎదుగుదలను అడ్డకునే క్రమంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అనిశ్చితికి కారణమైంది. దీంతో అన్ని దేశాల రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని కొనడం మొదలుపెట్టాయి. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా డాలర్ కు ప్రపంచ వాణిజ్యంపై ఉన్న ఆధిపత్యమే ట్రంప్ విర్రవీగే వైఖరికి కారణం. ఈ డాలర్ ఉపయోగించి వ్యాపారం చేసే వ్యవస్థ నుంచి బయటికి రావాలని ఇప్పటికే బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ అంత సులువు కాదు. ప్రపంచ స్థాయిలో ఉన్న అనిశ్చితి నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే దిశగా ఆయా దేశాలు బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. సామాన్యులు కొనడం వల్ల బంగారం ధరలు పెరగడంలేదు. కేవలం ప్రపంచ దేశాలు బంగారం నిల్వలు పెంచుకుంటున్న కారణంగా ధరలు పెరుగుతున్నాయి.
వెండి మెరుపులకు కారణం ..
బంగారంతో పాటు వెండి పరుగులు తీయడానికి ప్రధాన కారణం.. వెండి వినియోగం పెరుగుతుండటం. ఇన్నాళ్లు వెండిని చిన్నచిన్న వస్తువల తయారీకి వినియోగించారు. కానీ ఇప్పుడు వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. పరిశ్రమల నుంచి వెండికి గిరాకీ పెరుగుతోంది. సోలార్ ప్యానెల్స్, ఈవీ వెహికల్స్, రక్షణ వ్యవస్థలో ఆయుధాల తయారీ, మెడికల్ రంగంలో ఉన్న అవసరాలు.. వెండికి డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. బంగారంలా వెండిని దాచలేం. వెండి వినియోగ లోహంగా మారుతోంది. కాబట్టి వెండి నిల్వలు తగ్గుతాయి. వాడిన వెండిని రీసైక్లింగ్ చేసినా పారిశ్రామిక అవసరాలను తీర్చలేదు. అదే సమయంలో వెండి స్థానంలో మరో లోహం వాడలేరు. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో వెండి ధరలు ఎప్పుడూ లేనంతగా పెరుగుతున్నాయి.
అనిశ్చితిని సూచిస్తున్న లోహాల ధరలు..
పెట్టుబడులు బంగారంలోకి వెళ్తున్నాయంటే.. ఆర్థిక సంక్షోభమో, లేదా జియో పొలిటికల్ సమస్యలో రాబోతున్నట్టు అంచనా వేస్తారు. అందుకే పెట్టుబడులు ముందుగా సేఫెస్ట్ ప్లేస్ అయిన బంగారంలోకి వెళ్తాయి. కానీ ఇప్పుడు ఒకవైపు బంగారం పెరుగుతోంది. మరోవైపు కాపర్ కూడా పెరుగుతోంది. కాపర్ పెరగడం పారిశ్రామిక డిమాండ్ ను సూచిస్తుంది. పారిశ్రామిక అభివృద్ధిని సూచిస్తుంది. పారిశ్రామిక అభివృద్ధి జరిగే సమయంలో బంగారం పెరగకూడదు. బంగారం పెరిగినప్పుడు కాపర్ పెరగకూడదు. కానీ రెండు విరుద్ధ పరిస్థితులను సూచించే బంగారం, కాపర్ పెరగడం మరింత అనిశ్చితికి కారణం అవుతోంది.
