బంగారం.. బంగారం ఎందుకు తగ్గుతున్నావమ్మా?
తెర పైన కనిపించే అంశాలకు మించి.. తెర వెనుక జరిగే అంశాలే బంగారం ధరను డిసైడ్ చేసే పరిస్థితి.
By: Garuda Media | 9 March 2026 8:08 PM ISTపసిడికి ఏమైంది? మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధర.. ఇప్పుడు బలహీనపడుతోంది ఎందుకు? సహజ సూత్రాల్ని అనుసరించి చూస్తే..ఓవైపు యుద్దం.. మరోవైపు స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్ ను తలపిస్తున్న వేళ.. బంగారం ధర దూసుకెళ్లాలి కదా? అందుకు భిన్నంగా బంగారం ధర తగ్గటం ఎందుకు? అదెలా జరుగుతోంది? అన్నది ఆసక్తికరం. దీని లోతుల్లోకి వెళితే కొత్త విషయాలు కనిపిస్తాయి. తెర పైన కనిపించే అంశాలకు మించి.. తెర వెనుక జరిగే అంశాలే బంగారం ధరను డిసైడ్ చేసే పరిస్థితి.
ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రూ.1.62 లక్షల ధర పలుకుతుంది. మీరు చదివే సమయానికి కాస్త అటూ ఇటూగా దీని ధర ఉండొచ్చు. 2026 ఆరంభంలో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.93 లక్షలకు చేరుకొని.. ఆ తర్వాత తగ్గుతూ వస్తూ ఒక దశలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.43 లక్షలకు పడిపోయింది. మళ్లీ కోలుకొని.. పెరుగుతూ వచ్చింది. మొత్తంగా బంగారం ధరలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఫిబ్రవరి 28న ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్దంతో బంగారం ధర భారీగా పెరుగుతుందన్న అంచనా పలువురి నోట వినిపించింది. సాధారణంగా.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉండేదే. అందుకు భిన్నంగా.. ఆశ్చర్యకరంగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. ఎందుకిలా? అన్నది ప్రశ్న. దీనికి సహేతుకమైన కారణం ఏమిటి? శాస్త్రీయ అంశాలు ఏమిటి? వాస్తవంగా బంగారం ధర విషయంలోఅంతర్జాతీయంగా ఏం జరుగుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
ఈ అంశాలకు సమాధానం చెప్పే క్రమంలో కొన్ని అదృశ్య ఆర్థిక శక్తుల ఆటగా కొందరు చెబుతుంటారు. తమ వాదనకు బలాన్ని చేకూర్చేలా కొన్ని అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. అర్థశాస్త్ర సూత్రాల ప్రకారం యుద్ధం జరుగుతున్న వేళ బంగారం పెరగాలి. అందుకు భిన్నంగా తగ్గటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. అయితే.. దీనికి కొందరు నిపుణులు చెప్పే సమాధానం ఏమంటే.. యుద్దం వేళ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ లో తమకు ఎదురైన నష్టాల్ని భర్తీ చేసుకోవటం కోసం బంగారు నిల్వల్ని అమ్మి నగదు చేసుకుంటారు. దీని కారణంగా మార్కెట్ లోకి బంగారు సప్లై పెరిగి ధరలు తగ్గుతాయని చెప్పాలి.
బంగారం సురక్షితమైన పెట్టుబడే అయినప్పటికీ.. అన్ని సందర్భాల్లో దాని మీద వడ్డీ లాంటి అదనపు ఆదాయం రాదు. యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీన్ని అరికట్టేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా అలానే ఉంచుతుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం కంటే ప్రభుత్వ బాండ్ల కొనుగోలువైపు మొగ్గు చూపుతారు. ఈ బాండ్లతో గ్యారెంటీగా వడ్డీ వస్తుంది. అంతేకాదు, యుద్ధ వాతావరణం.. అంతర్జాతీయ అనిశ్చితిలో ఉన్నప్పుడు పలువురు బంగారం కంటే అమెరికన్ డాలర్లను అత్యంత సురక్షితమైనదిగా పరిగణిస్తారు. ప్రస్తుతం డాలర్ విలువ భారీగా పెరిగింది. బంగారం అంతర్జాతీయంగా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. డాలర్ పెరిగితే బంగారం కొనటం ఇతర దేశాలకు భారం అవుతుంది. మొత్తంగా బంగారం డిమాండ్ తగ్గుతుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే అన్నది మార్కెట్ వర్గాల మాట.
ఇక్కడే మరో కీలక అంశాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు బంగారం విలువ తగ్గటం లేదు. మార్కెట్ లో నగదు కొరతను (మరింత స్పష్టంగా చెప్పాలంటే డాలర్లకు పెరిగిన డిమాండ్) అధిగమించే క్రమంలో బంగారం ధరలు తగ్గుతున్న పరిస్థితి. ఇదే సందర్భంగా మార్కెట్ వర్గాలు చెప్పే మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కొత్త గరిష్ఠాల్ని టచ్ చేయటానికి ముందు బంగారం ధరలు తగ్గుతుంటాయని. మరిప్పుడు బంగారం కొనాలా? వాయిదా వేయాలా? అన్నది కీలక ప్రశ్న. ఇక్కడ పెట్టుబడి సలహాలు ఇవ్వటం లేదు. బంగారంలో మదుపు పెట్టమని కూడా చెప్పటం లేదు. కేవలం బంగారం ధరల హెచ్చుతగ్గుదల వెనుక ఉన్న కారణాల్నివిశ్లేషించటమే ఇక్కడ లక్ష్యమన్నది మర్చిపోకూడదు.
మార్కెట్ వర్గాల విశ్లేషణను చూస్తే.. బంగారం ధరలు ఒకేసారి భారీగా పెరిగిన తర్వాత 5 శాతం నుంచి 10 శాతం తగ్గటం.. ఆ తర్వాత మళ్లీ అంతకు ముందు కంటే ఎక్కువ స్థాయికి చేరుకోవటం లాంటివి జరుగుతుంటాయి.తాజాగా తగ్గుతున్న బంగారం ధరలు ఎంతవరకు తగ్గే వీలుందన్న ప్రశ్నకు.. సమాధానంగా రూ.1.59 లక్షల వరకుతగ్గే వీలుందంటున్నారు.ఒకవేళ అంతకంటే తక్కువకు వెళితే మాత్రం రూ.1.50 లక్షలకు తగ్గే వీలుందని అంచనా వేస్తున్నారు.అయితే.. బంగారం ధరలు హెచ్చుతగ్గుదల మొత్తం అంతర్జాతీయ పరిస్థితులు.. అమెరికా ఫెడరల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఉంటాయన్నది మాత్రం మర్చిపోకూడదు. సో.. బంగారం ధరలు ఏదో ఒక అంశానికే పరిమితమై పెరటం.. తగ్గటం లాంటివి ఉండవన్నది ఎంత నిజమో.. అంతుచిక్కని కొన్ని అంశాలు సైతం బంగారం ధరల్ని డిసైడ్ చేస్తాయనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
