Begin typing your search above and press return to search.

పెళ్లికి 30 ఏళ్లు సరిపోతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఒకప్పుడు అబ్బాయిలకు 25 ఏళ్లు రాగానే పెళ్లి సంబంధాలు చూసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.

By:  Madhu Reddy   |   5 March 2026 12:09 PM IST
పెళ్లికి 30 ఏళ్లు సరిపోతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
X

ఒకప్పుడు అబ్బాయిలకు 25 ఏళ్లు రాగానే పెళ్లి సంబంధాలు చూసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం అనేది నేటి సమాజంలో ఒక సాధారణ విషయంగా మారిపోయింది. పెరిగిన జీవన ప్రమాణాలు, కెరీర్ పై ఆశలు, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే తపన యువతను ఈ నిర్ణయం వైపు నడిపిస్తున్నాయి. పల్లె అయినా, పట్టణం అయినా ముప్పై ఏళ్లలో పెళ్లి అనేది ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్‌గా,ఇక ప్రాక్టికల్ ఆలోచనగా స్థిరపడిపోయింది. మరి ఈ నిర్ణయం సరైనదేనా ? యువత ఆలోచనలు ఏంటి అనేది మనము చూద్దాం..

కెరీర్ ముందా? కళ్యాణం ముందా?:

ఈ రోజుల్లో యువత పెళ్లి కంటే ముందే తమ కెరీర్‌లో ఒక స్థాయికి చేరుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. పెరిగిన ఖర్చులు, ఉద్యోగాల్లో ఉన్న ఒత్తిడి కారణంగా ఆర్థికంగా స్థిరపడటం అనేది ప్రాధాన్యతగా మారింది. "ముందు కాళ్ల మీద మనం నిలబడితేనే, రేపు వచ్చే భాగస్వామిని, కుటుంబాన్ని బాగా చూసుకోగలం" అనే ఆలోచన అబ్బాయిల్లో పెరిగింది. ఇది కేవలం భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం కాదు, చాలా ప్రాక్టికల్ ఆలోచన. సొంత ఇల్లు, సేవింగ్స్, ఒక మంచి పొజిషన్ వచ్చాకే బాధ్యతలు తీసుకోవాలని నేటి తరం భావిస్తోంది.

మారుతున్న తల్లిదండ్రుల ఆలోచనా తీరు:

ఇది కేవలం అబ్బాయిలకే పరిమితం కాలేదు. అమ్మాయిలు కూడా బాగా చదువుకుని, సొంతంగా సంపాదించుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా అబ్బాయికి మెచ్యూరిటీ ఉందా, సెటిల్ అయ్యాడా అని నిశితంగా గమనిస్తున్నారు. ఇక ఒకప్పుడు త్వరగా పెళ్లి చేసి బాధ్యత వదిలించుకోవాలనుకునే వారు, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని భావిస్తున్నారు. అందుకే 30 ఏళ్లలో పెళ్లి చేసుకోవడం అనేది అటు అబ్బాయిలకు, ఇటు అమ్మాయిలకు ఒక పరిణతి చెందిన వయసుగా సమాజం అంగీకరిస్తోంది.

సోషల్ మీడియా ప్రభావం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ:

సోషల్ మీడియా యుగంలో సెల్ఫ్ లవ్, సోలో ట్రావెలింగ్, పర్సనల్ ఫ్రీడమ్ వంటి అంశాలకు ప్రాముఖ్యత పెరిగింది. పెళ్లికి ముందే ప్రపంచాన్ని చూడాలని, తమకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉండాలని యువత ఆశపడుతోంది. ఇక మరోవైపు, చుట్టుపక్కల జరుగుతున్న విడాకులు, మనస్పర్థలను చూసి తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని చాలా మంది జాగ్రత్త పడుతున్నారు. మానసికంగా సిద్ధపడి, ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండగలమనే నమ్మకం వచ్చాకే అడుగు ముందుకు వేస్తున్నారు. అందుకే 30 ఏళ్ల వయసు అనేది ఒక సరైన 'బ్యాలెన్సింగ్ పాయింట్' లా కనిపిస్తోంది. ఇక పెళ్లికి సరైన వయసు ఏది అంటే.. అది వ్యక్తుల ఆర్థిక, మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా, ఒక బాధ్యతను స్వీకరించే ముందు పూర్తి అవగాహనతో ఉండటం మంచి పరిణామమే అంటున్నారు నిపుణులు.