వివాదాల భయంతో ప్రమోషన్లకు స్కిప్ కొట్టిన టాప్ -5 స్టార్లు
ఇటీవల ఒక హిందూ మహిళను పెళ్లి చేసుకున్నారనే వార్తల నుంచి... విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షపై స్పందిస్తూ `3 ఈడియట్స్` మూవీలోని రాంచో పాత్రపై ఇచ్చిన వివరణ వరకు వరుస వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి
By: Sivaji Kontham | 31 July 2026 12:00 AM ISTబాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరుగాంచిన అమీర్ ఖాన్ చుట్టూ వివాదాలు నడవడం కొత్తేమీ కాదు. ఇటీవల ఒక హిందూ మహిళను పెళ్లి చేసుకున్నారనే వార్తల నుంచి... విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షపై స్పందిస్తూ `3 ఈడియట్స్` మూవీలోని రాంచో పాత్రపై ఇచ్చిన వివరణ వరకు వరుస వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే ఆయన ప్రొడక్షన్ నుంచి వస్తున్న భారీ చిత్రం `బట్వారా 1947` ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అమీర్ ఖాన్ గైర్హాజరు కావడం చిత్రసీమలో తీవ్ర చర్చనీయాంశమైంది. లండన్ విమానం రద్దవడం వల్లే రాలేకపోయారని నిర్మాణ సంస్థ ప్రకటించినా.. విలేకరుల ఇబ్బందికర ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికే అమీర్ కావాలని ఈవెంట్‌కు స్కిప్ కొట్టారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది ఒక్కటే కాదు.. భారతీయ సినీపరిశ్రమల్లో ఇలాంటి మరిన్ని ఘటనల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
సినిమా రంగంలో ప్రమోషన్లకు హీరోలు లేదా నిర్మాతలు దూరంగా ఉండటం కొత్తేమీ కాదు. గతంలో బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అమీర్ ఖాన్ గతంలో `లాల్ సింగ్ చడ్డా` `ఇంటాలరెన్స్` వ్యాఖ్యల వివాదం ముదిరినప్పుడు ఆ సినిమా మీడియా ఇంటర్వ్యూలను తగ్గించుకున్నారు. కర్ణిసేన బెదిరింపులు, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో `పద్మావత్` చిత్ర ప్రమోషన్ ఈవెంట్లలో చిత్రబృందం కొన్ని మీడియా సమావేశాలను రద్దు చేసుకుంది. పాత బీఫ్ కామెంట్స్ వైరల్ కావడంతో `బ్రహ్మాస్త్ర` బహిరంగ ప్రచారాల్లో నేరుగా ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు రణబీర్ దూరంగా ఉన్నారు. కంగనా రనౌత్ `మణికర్ణిక` వివాదాల నడుమ ప్రెస్ మీట్లను వద్దనుకుని ఎంపిక చేసిన మీడియాకు మాత్రమే పరిమితమయ్యారు. కుమారుడు ఆర్యన్ ఖాన్ కేస్ వివాదం తర్వాత `పఠాన్` ప్రమోషన్ల సమయంలో ప్రెస్ మీట్లకు దూరంగా ఉండి...నేరుగా థియేటర్లలోకి వచ్చి అభిమానులను కలిసే వ్యూహాన్ని షారూఖ్ అమలు చేశారు.
హిందీలోనే కాదు, దక్షిణాది (టాలీవుడ్, కోలీవుడ్) చిత్ర పరిశ్రమల్లో కూడా పాత గాయాలను లేదా గతంలో జరిగిన వివాదాలను అనవసరంగా కెలికి ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతారనే ఉద్దేశంతో కొందరు స్టార్లు ప్రమోషన్ల నుంచి తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కోలీవుడ్‌లో అజిత్ కుమార్ వివాదాలకు, పాత ప్రశ్నలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా తన ఏ సినిమా ప్రమోషన్లకు, ఆడియో లాంచ్‌లకు హాజరుకావడాన్ని పూర్తిగా నిలిపివేశారు. అలాగే సమంత విడాకుల సమయం తర్వాత ప్రమోషనల్ ఈవెంట్లకు దూరంగా ఉండి.. పరిమిత ఇంటర్వ్యూలకు మాత్రమే ఓకే చెప్పడం టాలీవుడ్‌లో గతంలో చర్చనీయాంశంగా మారింది.
అలాగే నటి సంయుక్త మీనన్ కొన్ని సినిమాల ప్రమోషన్లకు రాలేకపోవడంపై మలయాళంలో వివాదం చెలరేగగా, తమిళ నటుడు సిద్ధార్థ్ కూడా కొన్ని సందర్భాల్లో వివాదాస్పద రాజకీయ, వ్యక్తిగత ప్రశ్నలను ఎదుర్కోలేక కొన్ని మీడియా ఈవెంట్లలో పాల్గొనలేదు. వ్యక్తిగత విషయాలపై లేదా పాత వివాదాలపై వచ్చే అనవసరపు ప్రశ్నలు తమ ప్రస్తుత సినిమా కంటెంట్ - మార్కెట్‌ను దెబ్బతీస్తాయని భావించి నటీనటులు లేదా నిర్మాతలు ప్రెస్ మీట్లను స్కిప్ చేయడం సౌత్‌లో కూడా సర్వసాధారణమైన ఒక వ్యూహంగా మారింది.
మొత్తానికి `బట్వారా 1947` ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చినా.. దానికంటే అమీర్ ఖాన్ గైర్హాజరీనే వార్తల్లో ఎక్కువగా ప్రచారమైంది. ప్రయాణ సమస్య వల్ల రాలేకపోయారా లేక వివాదాలను తప్పించుకోవడానికే దూరంగా ఉన్నారా అనేది పక్కన పెడితే... ఒక పెద్ద ఈవెంట్‌కు స్టార్ ప్రొడ్యూసర్ హాజరు కాకపోవడమే సినిమాకంటే పెద్ద హాట్ టాపిక్‌గా మారడం బాలీవుడ్‌లోని ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.
