చిన్న శ్రీను ప్లేస్ భర్తీ ఎలా...వైసీపీలో పెద్ద చర్చ !
ఆయన పేరుకు చిన్న శ్రీను కానీ వైసీపీలో పెద్ద బాధ్యతలు నిర్వహించిన నాయకుడు. ఆయన వైసీపీలో వదిలేసిన ఖాళీ కూడా చాలా పెద్దది.
By: Satya P | 12 Sept 2026 7:50 AM ISTఆయన పేరుకు చిన్న శ్రీను కానీ వైసీపీలో పెద్ద బాధ్యతలు నిర్వహించిన నాయకుడు. ఆయన వైసీపీలో వదిలేసిన ఖాళీ కూడా చాలా పెద్దది. మొత్తం విజయనగరం జిల్లాలో అణువణువూ ఆయనకు తెలుసు. ప్రతీ చోటా క్యాడర్ తో నేరుగా మమేకం అవుతూ నాయకులను కలుస్తూ పార్టీని బలోపేతం చేసిన తీరుకే ముచ్చట పడి టీడీపీ ఆయనకు కండువా కప్పింది. అలాంటి చిన్న శ్రీను వైసీపీని వదిలేశాక ఇపుడు ఆ పార్టీ తేరుకోలేకపోతోంది. విజయనగరం జిల్లాలో చూస్తే గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకూ అదే చర్చ. చిన్న శ్రీను పార్టీని వీడిపోవడాన్ని ఈ రోజుకీ వైసీపీ నేతలు కార్యకర్తలు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అందరికీ సహాయంగా ఉంటూ వచ్చారు. రాష్ట్రంలో అనేక మంది నాయకులు వెళ్ళిపోతారు, కానీ చిన్న శ్రీను అలా కాదు, ఆయన కార్యకర్తల మనిషి. అందుకే ఆయన లేని వైసీపీని ఎలా ఊహించుకోవడం అని తల్లడిల్లుతున్నారు అంటున్నారు
విస్తృత స్థాయి సమావేశం :
ఇదిలా ఉంటే చిన్న శ్రీను పార్టీని వీడిపోయాక సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ జిల్లాలో ఫుల్ అలెర్ట్ అయ్యారు. ఆయన వరసబెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందుగా తన సొంత నియోజకవరం చీపురుపల్లిలో కీలక సమావేశం పెట్టారు. తాను అందరికీ అందుబాటులో ఉంటాను అని ప్రకటించారు. ఇక అక్కడి బాధ్యతలను కుమార్తె బొత్స అనూషకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో విజయనగరంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ నెల 12న నిర్వహిస్తున్నారు. మొత్తం పార్టీ నాయకులు అంతా హాజరు కావాలని కోరుతున్నారు. ఈ సమావేశాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవహరించడం గురించి చర్చిస్తారు అని అంటున్నారు. అదే సమయంలో జిల్లాలో వైసీపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలి అన్న దాని మీద కూడా చర్చిస్తారు అని అంటున్నారు.
అనేక పేర్లు ఉన్నా :
ఇక తెర పైకి అనేకమైన పేర్లు వస్తున్నాయి, కొందరు అయితె అనాసక్తిని కనబరుస్తున్నారు, మరి కొందరు ముందుకు వచ్చినా చిన్న శ్రీను తరహాలో డైనమిక్ గా పనిచేయగలరా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం నుంచి కూడా జిల్లా అధ్యక్ష పదవిని వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఎవరిని తీసుకోవాలన్న దాని మీద సూచనలు కూడా వచ్చినట్లుగా చెబుతున్నారు. వైసీపీలోకి బొత్స సత్యనారాయణ రాక ముందు అంటే 2011 నుంచి 2015 దాకా జిల్లా బాధ్యతలను మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నిర్వహించారు అని చెబుతున్నారు. ఆయనకు 2014లో వైసీపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించింది. ఎమ్మెల్యేగా ఆయన విజయనగరం నుంచి పోటీకి దిగి ఓటమి పాలు అయ్యాక వెంటనే ఎమ్మెల్సీగా కూడా చాన్స్ ఇచ్చారు. ఆయనే ఆర్ధికంగా అన్ని విద్ధాలుగా తట్టుకుంటూ పార్టీని నడిపారు. ఇపుడు కూడా ఆయన పేరు ముందుకు వస్తోంది. అయితే ఆయన వయోభారం కారణంగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారా అన్న చర్చ వస్తోంది.
బీసీ నేతకు అంటూ :
ఇక విజయనగరం జిల్లా బీసీల జిల్లా. పైగా చిన్న శ్రీను అదే సామాజిక వర్గానికి చెందిన వారు. కాబట్టి ఆ సామాజిక వర్గానికి పదవి ఇవ్వాలని కూడా ప్రతిపాదన ఉంది అని అంటున్నారు. అయితే ఎవరికి పదవికి ఇచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి గట్టిగా తిరిగి పనిచేయాల్సి ఉంటుంది. అంతే కాదు పార్టీ కోసం పూర్తి కాలం వెచ్చించాలి. ఓటమి ఎదురైనా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. దాంతో కొందరు వెనక్కి వెళ్తున్నారు అని అంటున్నారు. అయితే ఎవరికి బాధ్యతలు ఇచ్చినా బొత్స సత్యనారాయణ నిర్ణయమే ఫైనల్ అవుతుంది అని అంటున్నారు. మరి ఎవరు కొత్త ప్రెసిడెంట్ అవుతారో చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా చిన్న శ్రీను ప్లేస్ భర్తీ అన్నది పెద్ద ప్రశ్నగానే వైసీపీలో ఉంది అని అంటున్నారు.
