Begin typing your search above and press return to search.

ప్రతి ముగ్గురు భార్యల్లో ఒకరికి భర్త వేధింపులు

2023లో పదిహేను నుంచి నలభై తొమ్మిదేళ్ల మధ్యలో ఉన్న మహిళల్లో కనీసం యాభై శాతం మంది మగాడి హింసను ఎదుర్కొంటారని పేర్కొన్న ఈ రిపోర్టు.. ప్రపంచంలోని మహిళలు ఎదుర్కొనే వేధింపుల గురించి వెల్లడించింది.

By:  Garuda Media   |   22 Nov 2025 10:00 AM IST
ప్రతి ముగ్గురు భార్యల్లో ఒకరికి భర్త వేధింపులు
X

భారత భర్తల ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసే రిపోర్టు ఒకటి విడుదలైంది. మన దేశంలోని మహిళల్లో 30 శాతం మంది తమ జీవితకాలంలో ఒక్కసారైనా భర్తల వేధింపులకు గురవుతారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక రిపోర్టులో వెల్లడించింది. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఖాయంగా భర్త వేధింపుల బారిన పడుతుందన్న మాటను రిపోర్టు చెబుతోంది.

2023లో పదిహేను నుంచి నలభై తొమ్మిదేళ్ల మధ్యలో ఉన్న మహిళల్లో కనీసం యాభై శాతం మంది మగాడి హింసను ఎదుర్కొంటారని పేర్కొన్న ఈ రిపోర్టు.. ప్రపంచంలోని మహిళలు ఎదుర్కొనే వేధింపుల గురించి వెల్లడించింది. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు.. అంటే కనీసం 84 కోట్ల మంది భర్తల వేధింపులు లేదంటే లైంగిక హింసను జీవితకాలంలో ఒక్కసారైనా ఎదుర్కొంటారని పేర్కొంది.

అదే సమయంలో 15-49 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 8.4 శాతం మంది భర్తతో సంబంధం లేకుండా ఇతరుల నుంచి వేధింపులకు గురి అవుతారని వెల్లడించింది. 2000 నుంచి 2023 వరకు అంటే.. 23 ఏళ్ల పాటు జరిపిన అధ్యయనాన్ని రిపోర్టు రూపంలో విడుదల చేసింది. ఈ రిపోర్టులో భారతదేశానికి సంబంధించిన అంశాల్ని చూస్తే.. మన దేశంలో 15 ఏళ్లు.. ఆ పై వయసున్న మహిళల్లో నాలుగు శాతం మందికి ఇతరుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నట్లుగా అంచనా వేసింది.

2030 నాటికి మహిళలపై అన్ని రకాల హింసను నిర్మూలించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికి అందులో పెద్దగా పురోగతి లేదని రిపోర్టు పెదవి విరిచింది. మహిళల విషయంలో ప్రపంచం మొత్తాన్ని చూస్తే.. 2000 ముందు వారికి ఉన్న పరిస్థితులకు ఇప్పటికి పెద్దగా మార్పు కనిపించలేదన్న విషయాన్ని పేర్కొనటం గమనార్హం. ప్రతి ఏడాది నవంబరు 25న బాలికలు.. మహిళలపై వేధింపులకు.. లైంగిక హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.