ప్రశ్నించే మీడియాపై ట్రంప్ అసహనమా? వైట్‌హౌస్ ప్రెస్ రూమ్‌పై కొత్త వివాదం!
వైట్‌హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌ను తొలగించి.. అక్కడ గతంలో ఉన్న ఇండోర్ స్విమ్మింగ్ పూల్‌ను పునరుద్ధరించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
By: A.N.Kumar | 21 Oct 2026 9:23 PM ISTవైట్‌హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌ను తొలగించి.. అక్కడ గతంలో ఉన్న ఇండోర్ స్విమ్మింగ్ పూల్‌ను పునరుద్ధరించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జర్నలిస్టులను వైట్‌హౌస్ ప్రధాన ప్రాంగణం నుంచి ఎదురుగా ఉన్న ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనానికి తరలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెలువడిన కథనాలు.. ట్రంప్ పరిపాలనకు, ప్రసార మాధ్యమాలకు మధ్య ఉన్న విభేదాలను మరొకసారి బహిర్గతం చేశాయి.
చారిత్రక నేపథ్యం.. ప్రస్తుత వివాదం
వైట్‌హౌస్ ప్రెస్ రూమ్ వెనుక ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. 1933లో పోలియోతో బాధపడుతున్న అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ వ్యాయామం కోసం ఈ ఇండోర్ స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు. ఆ తర్వాత 1970లో రిచర్డ్ నిక్సన్ హయాంలో ఈ పూల్‌ను కప్పివేసి, "జేమ్స్ ఎస్. బ్రాడీ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్"గా మార్చారు. దశాబ్దాలుగా ఇది అమెరికా అధ్యక్షుల అధికారిక ప్రకటనలకు, జర్నలిస్టుల ప్రశ్నలకు ప్రధాన వేదికగా నిలిచింది.
ప్రస్తుతం ఆ గదిని మళ్ళీ పూల్‌గా మార్చాలనే ప్రతిపాదన కేవలం ఒక భవన నిర్మాణ మార్పు మాత్రమే కాదని.. ప్రశ్నించే మీడియాను దూరంగా పెట్టే ప్రయత్నమని విమర్శకులు భావిస్తున్నారు. అయితే వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ స్పందిస్తూ మీడియాలో వస్తున్న కథనాల్లో అవాస్తవాలు ఉన్నాయని, తుది నిర్ణయంపై తగిన సమయంలో అధికారిక ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.
ముదురుతున్న విభేదాలు.. న్యాయస్థానం జోక్యం
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన ప్రభుత్వ విధానాలను విమర్శించే కథనాలను ట్రంప్ 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేస్తూ వస్తున్నారు. ఈ ఘర్షణ వాతావరణం 2026 సెప్టెంబర్‌లో మరింత తీవ్రమైంది. సీఎన్ఎన్ , ఎమ్ఎస్ నౌ , పొలిటికో వంటి ప్రముఖ వార్తా సంస్థల ప్రతినిధుల వైట్‌హౌస్ ప్రవేశ అనుమతులను రద్దు చేయడంతో ఆయా సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
ఈ వ్యవహారంలో ఫెడరల్ కోర్టు జోక్యం చేసుకుని జర్నలిస్టులకు ఊరటనిచ్చింది. సరైన చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా అనుమతులు రద్దు చేయడం రాజ్యాంగంలోని ఐదో సవరణతో పాటు, మొదటి సవరణ ద్వారా లభించే పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. బాధితులైన జర్నలిస్టుల క్రెడెన్షియల్స్‌ను పునరుద్ధరించాలని కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజాస్వామ్యం... పత్రికా స్వేచ్ఛ
ప్రభుత్వ నిర్వహణలో భద్రత, కార్యాలయాల కేటాయింపులపై నిర్ణయాధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ విమర్శనాత్మక వార్తలు రాసే మీడియా ప్రాప్యతను పరిమితం చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు ఆటంకమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశ్నించే గొంతులకు తగిన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.
వైట్‌హౌస్ ప్రెస్ రూమ్ భవిష్యత్తుపై ఇంకా తుది నిర్ణయం రానప్పటికీ.. ఈ పరిణామాలు అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే హక్కు, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా కొత్త సమీక్షకు దారితీశాయి.
