Begin typing your search above and press return to search.

ట్రంప్ విందు వేదిక దగ్గర్లో కాల్పుల కలకలం!

ఈ ఉదంతంపై ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్టు పెట్టారు. ‘‘సీక్రెట్ సర్వీస్ మరియు పోలీసు బలగాలు అద్భుతమైన పనిచేశాయి.

By:  Garuda Media   |   26 April 2026 9:06 AM IST
ట్రంప్ విందు వేదిక దగ్గర్లో కాల్పుల కలకలం!
X

అగ్రరాజ్యం అమెరికాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు వేళ.. వైట్ హౌస్ కు సమీపంలో జరిగిన విందులో కాల్పుల కలకలం షాకింగ్ గా మారింది. ఇందుకు పాల్పడిన దుండగుడ్ని భద్రతా సిబ్బంది నిలువరించటమే కాదు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా కొన్ని రిపోర్టులు వెల్లడిస్తుంటే.. అతడ్ని సీక్రెట్ సర్వీసెస్ మట్టుబెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ షాకింగ్ ఉదంతంలో ఒక భద్రతా సిబ్బందికి గాయమైంది. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ ధరించటంతో పెను ప్రమాదం తప్పింది.మిగిలిన వారంతా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆయన సతీమణి, ఉపాధ్యక్షుడు ఇతర ఉన్నత స్థాయి అధికారులను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా పేర్కొన్నారు.

కాల్పుల కలకలం అనంతరం విందును మొదలు పెట్టాల్సిందిగా ట్రంప్ చెప్పినా.. వాయిదా వేసిన అధికారులు ప్రముఖులందరిని వేదిక నుంచి సురక్షితంగా తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ విందుకు అతిధి వలే వచ్చిన దుండగుడు దాదాపు ఐదు నుంచి ఎనిమిది రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై విందులో పాల్గొన్న వందలాది మంది అతిథులను ఖాళీ చేయించినట్లుగా తెలుస్తోంది. వైట్ హౌస్ అధికారులు.. ప్రత్యక్ష సాక్ష్యులు.. ట్రంప్ పోస్టు చేసిన ట్రూత్ పోస్టులోని వివరాల్ని చూస్తే..

భారతకాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటలు వేళ.. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఎనిమిది గంటల వేళలో వాషింగ్టన్ హిస్టారిక్ హిల్ టాన్ హోటల్ లో వైట్ హౌస్ కరస్పాండెంట్ అసోసియేషన్ విందును ఏర్పాటు చేశారు. విందు ప్రారంభమైన సుమారు ఐదు నిమిషాల తర్వాత.. హోటల్ బయట (వేదిక వెలుపల) ప్రధాన మాగ్నెటోమీటర్ స్క్రీనింగ్ ఏరియాలో కాల్పుల శబ్దం వినిపించింది. నాలుగు నుంచి ఎనిమిది రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కాల్పులు జరిగాయంటూ భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున అరుస్తూ అందరిని అలెర్టు చేశారు. సీక్రెట్ ఏజెంట్లు తమ ఆయుధాల్ని తీసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆయన సతీమణి, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తలను కిందకు వంచి.. వేదిక నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఈ విందులో పలువురు మంత్రులు.. వందలాది విలేకరులు.. రాజకీయ నేతలు ప్రాణ భయంతో హోటల్ టేబుళ్ల కింద దాక్కున్నారు. కొంతమంది భయంతో బయటకు పరుగులు తీశారు. కాల్పులు జరిపిన వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిపై తిరిగి కాల్పులు జరిపారని.. మట్టుబెట్టినట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా అతడ్ని సజీవంగా అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ ఉదంతంలో అతిధులు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పుల ఉదంతం నేపథ్యంలో హోటల్ ను పూర్తిగా లాక్ డౌన్ చేసి లోపలకు ఎవరిని అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ ఉదంతం నేపథ్యంలో విందును రద్దు చేశారు. అయితే.. తిరిగి ప్రారంభించాలని ట్రంప్ చెప్పినప్పటికీ.. నెల వ్యవధిలో మరోసారి నిర్వహిస్తామని పేర్కొంటూ అందరిని అక్కడి నుంచి బయటకు తరలించారు. విందు జరిగే ప్రాంతానికి నిందితుడు సాధారణ అతిధి మాదిరి వచ్చినట్లు చెబుతున్నారు. నిందితుడ్ని భద్రతా తనిఖీలు చేసే వద్ద అనూహ్య రీతిలో పెద్ద వెపన్ తీసి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే.. అతడ్ని వెంటనే నిలువరించినట్లు చెబుతున్నారు. విందు జరుగుతున్న ప్రాంతానికి వచ్చినప్పటికీ.. వేదిక ఉన్న గదిలోకి మాత్రం వెళ్లలేదని భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విందు జరుగుతున్న గది బయటనే అతడ్ని నిలువరించటంతో.. లోపల ఉన్న వందలాది మంది ప్రముఖులకు పెను ముప్పు తప్పిందని చెప్పాలి.

ఈ ఉదంతంపై ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్టు పెట్టారు. ‘‘సీక్రెట్ సర్వీస్ మరియు పోలీసు బలగాలు అద్భుతమైన పనిచేశాయి. వారు అత్యంత వేగంగా మరియు ధైర్యంగా స్పందించారు. నేను.. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. ఉపాధ్యక్షుడు వాన్స్ ఇతర క్యాబినెట్ సభ్యులంతా సురక్షితంగా ఉన్నారు’’ అని పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి వివరాల్ని వెల్లడించలేదు. ఈ ఘటన జరిగిన వెంటనే హోటల్ పరిసర ప్రాంతాల్లో మరిన్ని దాడులు జరగకుండా నిఘా విమానాలు.. డ్రోన్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఉదంతంపై విచారణ జరిపేందుకు తక్షణమే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) దర్యాప్తు చేపట్టింది. తాజా ఘటన నేపథ్యంలో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ లాంటి పెద్ద కార్యక్రమాలకు భద్రతా ప్రోటోకాల్స్ ను మార్చాలన్న యోచనలో సీక్రెట్ సర్వీస్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజా ఉదంతం నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలో హై అలెర్టు ప్రకటించారు.