తెలుగు రాష్ట్రాల్లో తెగ తాగేస్తున్నారు.. దేశంలో మన మందుబాబుల రికార్డు
దేశవ్యాప్త అమ్మకాల్లో ఇది 9 శాతంగా చెబుతున్నారు. అదేసమయంలో ఉత్తరభారత దేశంలో కేవలం 20 శాతమే విస్కీ అమ్మకాలు నమోదు అయ్యాయి.
By: Tupaki Political Desk | 30 Sept 2025 2:00 AM ISTదేశంలో విస్కీ ఎక్కువగా తాగుతున్న ప్రాంతీయులు ఎవరో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లోని మద్యం ప్రియుల్లో ఎక్కువ మంది విస్కీని లాంగిచేస్తున్నారట.. దేశంలో విస్కీ తాగుతున్న వారిలో ఎక్కువ మంది దక్షిణ భారతదేశంలో ఉన్నట్లు సీఐఏబీసీ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్) వెల్లడించింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఐఎంఎఫ్ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) అమ్మకాల్లో 58 శాతం దక్షిణ భారత్ లోనే ఉన్నట్లు తేలింది.
దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం 23.18 కేసుల విస్కీ అమ్ముడైనట్లు సీఐఏబీసీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 39.62 కోట్ల ఐఎంఎఫ్ఎల్ కేసులు అమ్ముడుపోగా, 2024-25లో 40.17 కోట్ల కేసుల విస్కీ అమ్ముడైంది. దేశంలో మొత్తం అమ్మకాల్లో ఒక్క కర్ణాటకలోనే 17 శాతం జరిగాయి. దీంతో ఆ రాష్ట్రం విస్కీ అమ్మకాల్లో తొలిస్థానం సంపాదించింది. ఇక తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3.71 కోట్ల కేసులు అమ్ముడవగా, ఏపీలో 3.55 కోట్ల కేసులు విక్రయాలు జరిగాయి.
దేశవ్యాప్త అమ్మకాల్లో ఇది 9 శాతంగా చెబుతున్నారు. అదేసమయంలో ఉత్తరభారత దేశంలో కేవలం 20 శాతమే విస్కీ అమ్మకాలు నమోదు అయ్యాయి. యూపీలో తెలుగు రాష్ట్రాల కంటే తక్కువగా 2.50 కోట్ల కేసుల విస్కీ అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉత్తర భారత్లో యూపీ తర్వాత రాజస్థాన్, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాలు నిలిచాయి. రాజస్థాన్ లో 1.37 కోట్ల కేసులు, ఢిల్లీలో 1.18 కోట్ల కేసులు, హరియాణాలో 1.17 కోట్ల కేసుల విస్కీ విక్రయించినట్లు సీఐఏబీసీ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా చూస్తే ఉత్తర భారతదేశంలో విస్కీ వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ, అంతకుముందు ఏడాదితో పోల్చితే ఒకశాతం పెరిగినట్లు సీఐఏబీసీ ప్రకటించింది. కాగా, దేశంలో విస్కీని ఎక్కువగా కర్ణాటకతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడుతుండటం చర్చనీయాంశం అవుతోంది. బ్రాందీ, బీరు, వైన్ రకాలకు మించిన రీతిలో విస్కీ విక్రయాలు జరగడం విశేషంగా చెబుతున్నారు. బీర్ లేదా వైన్‌తో పోలిస్తే, విస్కీలో ఆల్కహాల్ గాఢత ఎక్కువగా ఉండటం వలన ఇది తాగేందుకు మద్యం బాబులు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతున్నారు.
