Begin typing your search above and press return to search.

సెల్ ఫోన్ చూడని తరం అంతరిస్తోంది....

ఆ తర్వాత పోస్టు కార్డులు, ఇన్ లాండ్ కవర్లు సమాచార వారధుల్లా నడిచాయి. ఉత్తరం రాయడం ఓ కళగా భావించిన రోజులవి.

By:  Tupaki Political Desk   |   7 Jan 2026 10:00 PM IST
సెల్ ఫోన్ చూడని తరం అంతరిస్తోంది....
X

సమాజం వేగంగా విస్తరిస్తోంది. ఆధునికత మన జీవితంలో భాగంగా మారుతోంది. ఇపుడు మనదంతా నానో ప్రపంచం. కుటుంబాలు చిన్నవి...వాడే వస్తువులు చిన్నవి...ఆఖరికి మనసులు కూడా చిన్నవే. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కళకళలాడుతుండేవి. ఏ కుంటుంబంలో అయినా కనీసి నలుగురైదుగురు పిల్లలతో సంబరంగా ఉండేది. కష్టాలు , కన్నీళ్ళను దాచేసుకుని తలిదండ్రులు పిల్లలతో ఆప్యాయంగా గడిపిన రోజులవి. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లో సమాచార సాధనాలంటే...రేడియోలు, గ్రామఫోను రికార్డులు...టూరింగ్ టాకీసులే. అర్జంటు సమాచారం అందివ్వాలంటే టెలిగ్రామ్ వచ్చేది. ఎవరి ఇంటికైనా టెలిగ్రామ్ వచ్చిందంటే...భయంతో వణికిపోయేవారు ఏ అశుభ వార్తను మోసుకొచ్చిందో అని.

ఆ తర్వాత పోస్టు కార్డులు, ఇన్ లాండ్ కవర్లు సమాచార వారధుల్లా నడిచాయి. ఉత్తరం రాయడం ఓ కళగా భావించిన రోజులవి. ఉభయకుశలోపరి అన్న పదమే ఇప్పటి తరానికి తెలియదు. పొందికగా అందమైన తెలుగు అక్షరాలతో నాన్నగారో, తాతగారో, అమ్మగారో రాసిన ఉత్తరాలు మనసుకు చాలా దగ్గరగా ఉండేవి. స్నేహితులు పరస్సరం ఉత్తరాలు రాసుకుంటూ మనసులో బాధలు పంచుకున్న అపురూప సందర్భాలవి. ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్లు మన జీవితంలో ఒక భాగమైపోయ్యాయి కానీ, 1990కి ముందు కాలంలో పెరిగిన వారికి అసలు ఫోన్ అంటేనే ఒక అద్భుతం.

అప్పట్లో ఊరంతటికీ కలిపి ఒకరి ఇంట్లోనే ఫోన్ ఉండేది. అది కూడా నలుపు రంగులో, డయల్ తిప్పే ల్యాండ్‌లైన్ ఫోన్. ఎవరికైనా ఫోన్ వస్తే, ఆ ఇంటి యజమాని వీధిలోకి వచ్చి గట్టిగా పేరు పెట్టి పిలిచేవారు. ఆ పిలుపు వినబడగానే పనులన్నీ వదిలేసి ఫోన్ మాట్లాడటానికి పరుగు తీసేవారు. అలాగే దూరంగా ఉండేవారికి అత్యవసరంగా సమాచారం అందించాలంటే టెలిగ్రామ్ ఒక్కటే మార్గం. కానీ నేడు వాట్సాప్‌లో ఒక్క సెకనులో వందల మెసేజ్‌లు పంపుతున్నాం.

ఇప్పటిలాగా అప్పుడు గూగుల్ మ్యాప్స్ లేవు. కొత్త ఊరికి వెళ్తే, దారిలో ఉన్న మనుషులను అడిగి అడ్రస్ తెలుసుకోవడమే ఏకైక మార్గం. ఆ క్రమంలో కొత్త పరిచయాలు, పలకరింపులు ఉండేవి. ఫలానా వారిల్లు ఎక్కడ అని అడిగితే....ఆ రావి చెట్టు పక్కన సందులో మూడో ఇల్లు" అని చెప్పేవారు. అంతటితో ఆగకుండా వారికి ఏమవుతారు అంటూ వరసలు కలిపేవారు. మొబైల్స్ లేని ఆ కాలంలో అందరికీ కనీసం 20-30 మంది బంధువుల ఫోన్ నంబర్లు నోటికి వచ్చేవి. ఇప్పుడు సొంత కుటుంబ సభ్యుల నంబర్లు కూడా మనకు తెలీవు. వారి పేర్లపై సేవ్ చేసుకుంటాం. అసలు ఆ తరంలో పరాధీనత చాలా తక్కువ. ఎంత పెద్ద కూడిక తీసివేతలు అయినా నోటిద్వారా అలా చెప్పేవారు. కొండవీటి చాంతాడంత సంఖ్యలు వరసగా ఉన్నా...కళ్ళద్దాల చివర పైనుంచి చివరి దాకా అలా చూస్తూ...కూడగల గుమాస్తాలకు కొదవ ఉండేది కాదు. మరి ఇప్పుడు...ఏది లెక్కవేయాలన్నా క్యాలిక్యులేటర్ తప్పనిసరి.

కాలం అనంతం...అది కదలిపోతునే ఉంటుంది. తరాలు మారిపోతుంటాయి...అంతరాలు మారిపోతుంటాయి. ఒకనాటి జీవితం తర్వాతి కాలంలో అనుభవంగా మారిపోతుంటుంది. వయసు మీద పడుతున్న కొద్దీ మన కథలు, వ్యథలు భావి తరానికి మరచిపోలేని జ్ఞాపకాలు. అవే వారు నడిచే మార్గంలో దారిదీపాలుగా వెలుగుతుంటాయి. వృక్షో రక్షతి రక్షిత: అన్నట్లే వృద్ధో రక్షతి రక్షిత: అనుకోవాలి. మలిసంధ్యలో కాలం వెళ్ళబుచ్చుతున్న వారి పట్ల చిన్నబుచ్చేలా ప్రవర్తించడం సరికాదు. పండిన ప్రతి పండు తీపిని పంచినట్లే...జీవితంలో పండిపోయిన వారి మాటలు మనకు గొప్ప పాఠాలను అందిస్తాయి. అయితే దురదృష్టం కొద్దీ పెద్దవారి మాటల్ని మనం చాదస్తమని కొట్టిపడేస్తుంటాం. అనునిత్యం ఉరుకులు పరుగులతో కదులుతున్న వారికి మూలలో కూర్చొని ఉన్న వారి మాటలు తలకెక్కవు. అది అనవసరం అనుకుంటుంటారు. కానీ ఆ సమయంలో ముసలి వారికి తమ మాటలు వినే వ్యక్తి కావాలని అనిపిస్తుంటుంది. పిల్లలు పడే బాధలు..చేస్తున్న తప్పులు...పొరపాట్లను సరిదిద్దాలని...వారు జీవితంలో చక్కగా రాణించాలని అనుకుంటుంటారు. అయితే ఈ తరం వారికి అది పరమ చాదస్తంగా అనిపిస్తుంటుంది.

వయసు మీద పడ్డవారు మన ఆచారాలు, సంప్రదాయాలు మరియు కుటుంబ విలువలని నేటి తరానికి అందించే వారధులు. మన మూలాలను మర్చిపోకుండా నిరంతరం మనల్ని హెచ్చరించే దిక్సూచీలు...మన ఇంట్లోని పెద్దలు. అందుకే పెద్దల మాట చద్దన్నపు మూట అన్నారు. పెద్దల అనుభవం ఒక దీపస్తంభం వంటిది. చీకటిలో దారి తెలీక మనం తడబడేటప్పుడు, వారి మాటలు మనకు సరైన దిశను చూపిస్తాయి. వారు చెప్పే "వద్దు" అనే మాట వెనుక మన క్షేమం ఉంటుంది, "చెయ్యి" అనే మాట వెనుక మన విజయం ఉంటుంది. వృద్ధులను గౌరవించడం అంటే కేవలం వారికి నమస్కరించడం కాదు, వారి మాటలకు విలువ ఇవ్వడం, వారి ఒంటరితనాన్ని పారదోలడం. మనం నేడు వారికి ఇచ్చే గౌరవమే, రేపు మన పిల్లలు మనకు ఇచ్చే కానుక.

"ముసలితనం అనేది శాపం కాదు, అది ఒక పరిపూర్ణత." ఇంట్లో పెద్దలు ఉండటం అంటే అది ఒక దేవాలయం ఉన్నట్టే. వారి అనుభవం అనే నీడలో పెరగడం మన అదృష్టం. ఆ ముడతలు పడిన చేతుల్లో ప్రపంచాన్ని గెలిచే ధైర్యం ఉంటుంది, ఆ పండిన కళ్ళలో భవిష్యత్తును చూపే వెలుగు ఉంటుంది. పెద్దల పట్ల మనం చూపించాల్సిన గౌరవం, ఆదరణ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి India Senior Citizens Guide వంటి ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించి వారి సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవచ్చు. మీ ఇంట్లోని పెద్దలతో సమయం గడపడమే వారికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి.