ప్రైవేట్ మెసేజ్ లను మెటా చదువుతుందా?... సమాధానం ఇదిగో!
వాట్సప్ యాప్ లోని మీ అన్ని సందేశాలను మెటా చదవగలదని ఆరోపిస్తూ అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం దావాను ఎదుర్కొంటోంది.
By: Raja Ch | 28 Jan 2026 7:46 PM ISTప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ అప్లికేషన్ అయిన వాట్సాప్.. తరచుగా భద్రత, గోప్యతా సమస్యల గురించి ఫిర్యాదులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల సోషల్ ప్లాట్ ఫామ్ ప్రైవేట్ సంభాషణల నుండి సందేశాలను డీక్రిప్ట్ చేసి చదవగలదని పేర్కొంటూ మెటాపై అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం కోర్టు కేసు దాఖలు చేయబడింది. ఈ నేపథ్యంలో మెటా నుంచి వివరణ వచ్చింది.
అవును.. ప్రస్తుతం వాట్సాప్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. వాట్సప్ యాప్ లోని మీ అన్ని సందేశాలను మెటా చదవగలదని ఆరోపిస్తూ అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం దావాను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో... ఈ ఆరోపణలన్నింటినీ వాట్సాప్ తిరస్కరిస్తూనే.. ప్లాట్ ఫామ్ మెరుగైన భద్రతా లక్షణాలను రూపొందించింది.. ఇది స్పైవేర్ నుండి మిమ్మల్ని రక్షించగలదని తెలిపింది.
ఈ క్రమంలో.. వాట్సాప్ కొత్త 'స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్' మోడ్ ను ప్రకటించింది. ఈ మోడ్ వినియోగదారులను పెరుగుతున్న అధునాతన సైబర్ బెదిరింపుల నుండి రక్షించడమే లక్ష్యంగా పెట్టుకుందని ప్లాట్ ఫామ్ పేర్కొంది. స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ మోడ్ గరిష్ట రక్షణను తెస్తుందని.. జర్నలిస్టులు లేదా పబ్లిక్ ఫిగర్స్ వంటి సైబర్ దాడుల ప్రమాదం ఎక్కువగా ఉన్న వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది.
ఉదాహరణకు.. ఈ మోడ్ మీ పరిచయాలలో లేని వ్యక్తుల నుండి అటాచ్ మెంట్ లు, మీడియాను బ్లాక్ చేస్తుంది. ఇదే క్రమంలో... లింక్ ప్రివ్యూలను నిలిపివేస్తుంది. తెలియని పంపేవారి నుండి కాల్ లను సైలంట్ చేస్తుంది. అయితే... సెట్టింగ్ పేజీలోని ప్రైవసీ విభాగంలో అధునాతన మెనుని తెరవడం ద్వారా దీన్ని ప్రారంభించవచ్చని వెల్లడించింది.
కాగా... మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కంపెనీ 'ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్' ఉన్నప్పటికీ ప్రైవేట్ కమ్యూనికేషన్ లకు 'బ్యాక్ డోర్' యాక్సెస్ ను నిర్వహిస్తుందని.. తద్వారా బిలియన్ల మంది వినియోగదారులను మోసం చేసిందని ఆరోపిస్తూ అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం ఉత్తర కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఆరోపణలను మెటా కంపెనీ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ ప్రతినిధి ఆండీ స్టోన్ స్పందిస్తూ... ప్రజల వాట్సాప్ సందేశాలు ఎన్ క్రిప్ట్ చేయబడలేదని చెప్పే ఏ వాదన అయినా పూర్తిగా తప్పని.. వాట్సాప్ ను సిగ్నల్ ప్రోటోకాల్ ఉపయోగించి దశాబ్దం పాటు ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్ట్ చేశారని.. ఈ వ్యాజ్యం ఒక పనికిమాలిన కల్పిత రచన అని ఆయన తెలిపారు. ఈ సమయంలో అధికారిక వివరణ వచ్చింది!
