Begin typing your search above and press return to search.

ఎమిటీ డెడ్ హెడింగ్? ఫ్లైదుబాయ్ ఫ్లైట్ లో ఇద్దరు పైలట్లు ఎందుకున్నారు?

విమానంలోని ఇద్దరు ట్రైనీ పైలట్ల కారణంగా సదరు విమానం సురక్షితంగా ల్యాండ్ కావటం తెలిసిందే. అయితే.. ఆ ఇద్దరు ట్రైనీ పైలట్లు ఎందుకు విమానంలో ఉన్నారు?

By:  Garuda Media   |   4 Oct 2026 10:36 AM IST
ఎమిటీ డెడ్ హెడింగ్? ఫ్లైదుబాయ్ ఫ్లైట్ లో ఇద్దరు పైలట్లు ఎందుకున్నారు?
X

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ ఫ్లైట్ లో పైలట్ మీద కో పైలట్ దాడి చేయటం.. ఇలాంటి గందరగోళంలో విమానంలో ఉన్న ఇద్దరు ట్రైనీ పైలట్లు చురుగ్గా స్పందించి ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడటం తెలిసిందే. అయితే.. ఇద్దరు ట్రైనీ పైలట్లు విమానంలో ఎందుకు ఉన్నారు? అన్నది ప్రశ్నగా మారింది. ఈ సందర్భంగా ‘డెడ్ హెడింగ్’ మాట రావటం.. ఇదేంటి? విమానయాన రంగంలో ఈ విధానాన్ని ఎందుకు ఫాలో అవుతారు? లాంటి అంశాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

విమానంలోని ఇద్దరు ట్రైనీ పైలట్ల కారణంగా సదరు విమానం సురక్షితంగా ల్యాండ్ కావటం తెలిసిందే. అయితే.. ఆ ఇద్దరు ట్రైనీ పైలట్లు ఎందుకు విమానంలో ఉన్నారు? అన్న వివరాలు బయటకు రాలేదు. తాజాగా ఈ విషయాలుబయటకు వచ్చాయి. టెల్ అవీవ్ నుంచి దుబాయ్ కు వెళ్లిన తర్వాత ఆ విమానాన్ని ఖాళీగా వెనక్కి తీసుకురావాల్సి ఉంది. ఈ కారణంతోనే ఇద్దరు ట్రైనీ పైలట్లకు ఆ బాధ్యత అప్పజెప్పారు. ఇందులో భాగంగా వారు విమానంలో ఉండటం.. అనూహ్య పరిణామాల్లోవారు విమానాన్ని తమ అధీనంలోకి తీసుకొని ప్రయాణికుల్ని కాపాడారు.

ఇలా పైలట్లను పంపే విధానాన్ని డెడ్ హెడింగ్ గా వ్యవహరిస్తారు. విమానయానరంగంలో పైలట్లు.. క్యాబిన్ క్రూ తాము పని చేయాల్సిన తదుపరి విధి నిర్వహణ కోసం ఒక నగరం నుంచి మరో నగరానికి విమానంలో ప్రయాణీకులుగా ప్రయాణించే విధానాన్ని డెడ్ హెడింగ్ గా వ్యవహరిస్తారు. అంటే.. వారు ప్రయాణిస్తున్న విమానంలో డ్యూటీ చేయరు. సదరు విమానం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత వారి బాధ్యతలు ఉంటాయి. అప్పటివరకు ఇతర ప్రయాణికులతో కలిసి సాధారణ ప్రయాణికులుగా సీట్లోకూర్చొని జర్నీ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని విమానయాన సంస్థలు ఈ విధానాన్ని తరచూ అమలు చేస్తుంటాయి. విమాన సర్వీసులు సజావుగా సాగటానికి ఈ విధానాన్ని ఫాలో అవుతారు.

ఫ్లైదుబాయ్ విమానం విషయానికి వస్తే.. టెల్ అవివ్ కు చేరుకున్న తర్వాత ఆ విమానాన్ని ఖాళీగా తిరిగి తీసుకురావాల్సి ఉంది. అందుకే.. ఇద్దరు ట్రైనీ పైలట్లు అందులో ప్రయాణిస్తున్నారు. అనూహ్యరీతిలో పైలట్ మీద కో పైలట్ దాడి చేయటం.. అలాంటి విపత్కర పరిస్థితుల్లో వారు క్షణాల్లో స్పందించి విమానాన్ని కంట్రోలో లోకి తీసుకొచ్చి వందలాది మంది ప్రయాణికుల్ని కాపాడారు.

ఆ రోజు విమానంలో రెండో వరుసలో ప్రయాణించిన డేనియల్ అనే ప్రయాణికుడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు అసలేం జరిగిందో వివరంగా చెప్పుకొచ్చారు. ‘‘కాక్ పిట్ లో పైలట్ మీద కో పైలట్ దాడి చేయటంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు ధైర్యంగా కో పైలట్ ను బంధించారు. అదే సమయంలో అక్కడే ఉన్న అదనపు పైలట్లు క్షణాల్లో స్పందించారు. ఒకరు కాక్ పిట్ లోకి వెళ్లి కో పైలట్ ను పట్టుకొని బయటకు లాక్కొచ్చారు.మిగిలిన వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వారిని నెట్టుకుంటూ రెండో వ్యక్తి అతి కష్టమ్మీద కాక్ పిట్ లోకి వెళ్లారు. అక్కడున్న వారి పై నుంచి దూకినంత పని చేసి పైలట్ సీట్లో కూర్చున్నారు. అప్పటికే కిందకు జారుతున్న విమానాన్ని మళ్లీ కంట్రోల్ చేసే పని మొదలుపెట్టారు. కాసేపటికే రెండో పైలట్ మొదటి వ్యక్తికి జత కలిశాడు. తర్వాత మరెవ్వరూ రాకుండా కాక్ పిట్ తలుపులు మూసేశారు. వారెక్కడి నుంచి వచ్చారో తెలీదు.కానీ.. హీరోల్లా స్పందించి విమానాన్ని కంట్రోల్ చేశారు. వారిని నమ్మొచ్చా? ఒకవేళ వారు ఉగ్రవాదులేమో అని అనుమానించాం. తర్వాత పైలట్లు ఒక ప్రకటన చేశారు. విమానం సౌదీలోని తబుక్ లో ల్యాండ్ కాబోతుందని. అంతా బాగుందని ప్రకటించారు. అప్పటికి కానీ మేం వారిని నమ్మలేదు. చెప్పినట్లే విమానం ల్యాండ్ అయ్యింది. అప్పటికి కానీ వారు చెప్పింది నిజమని నమ్మాను. వారికి మేం జీవితాంతం రుణపడి ఉంటాం’’ అంటూ పూసగుచ్చినట్లుగా వివరాలు వెల్లడించారు.