ట్రెండింగ్ లో బేబీ మూన్.. ప్రత్యేకత ఏంటంటే?
పెళ్లయిన కొత్తలో దంపతులు 'హనీమూన్' వెళ్లడం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఇండియాలో ఒక సరికొత్త లైఫ్‌స్టైల్ ట్రెండ్ బాగా ఫేమస్ అవుతోంది..
By: Madhu Reddy | 2 July 2026 8:00 PM ISTపెళ్లయిన కొత్తలో దంపతులు 'హనీమూన్' వెళ్లడం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఇండియాలో ఒక సరికొత్త లైఫ్‌స్టైల్ ట్రెండ్ బాగా ఫేమస్ అవుతోంది.. అదే 'బేబీమూన్' .. అవును మీరు విన్నది నిజమే. విదేశాల్లో ఎప్పటి నుంచో ఉన్న ఈ సంస్కృతిని ఇప్పుడు మన దేశంలోని యంగ్ కపుల్స్ కూడా తెగ ఫాలో అవుతున్నారు. గర్భధారణ సమయంలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకుంటూ, పుట్టబోయే బిడ్డ కంటే ముందే దంపతులిద్దరూ కలిసి క్వాలిటీ టైమ్ గడపడానికి ఈ ప్రత్యేక విహారయాత్రను ప్లాన్ చేసుకుంటున్నారు..
అసలు ఏంటి ఈ బేబీమూన్?:
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక దంపతుల లైఫ్‌లో ఎన్నో మార్పులు వస్తాయి. హాస్పిటల్ చెకప్‌లు, షాపింగ్‌లు, కాబోయే బిడ్డ కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్స్.. ఇలా ఎప్పుడూ ఏదో ఒక పనితో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే బిడ్డ పుట్టి బాధ్యతలు పెరగకముందే.. కాబోయే అమ్మ నాన్న కలిసి ప్రశాంతంగా, హ్యాపీగా కొన్ని రోజులు గడపడానికి వెళ్లే ఒక చిన్న ట్రిప్‌నే 'బేబీమూన్' అంటారు. ఇక ఇది ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది.
ప్లాన్ చేయడానికి పర్ఫెక్ట్ టైమ్ ఇదే:
డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. ప్రెగ్నెన్సీలో 14 వారాల నుంచి 28 వారాల మధ్య కాలం బేబీమూన్‌కు చాలా బెస్ట్ టైమ్. ఎందుకంటే మొదటి మూడు నెలల్లో ఉండే వికారం, వాంతులు, నీరసం ఈ టైమ్‌కి తగ్గుతాయి. అలాగే చివరి నెలల్లో ఉండే కడుపు భారము, నొప్పులు కూడా ఉండవు. కాబట్టి ఈ టైమ్‌లో జర్నీ చేయడం కాస్త ఈజీగా ఉంటుంది. అయితే ట్రిప్ ప్లాన్ చేసే ముందు కచ్చితంగా మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
ప్రదేశాల ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
బేబీమూన్ కోసం లాంగ్ జర్నీలు ఉండే విదేశాలు లేదా రోజంతా తిరిగే అడ్వెంచర్ ప్లేసెస్ అస్సలు ఎంచుకోకూడదు. ఇక ఇంటికి కాస్త దగ్గరగా ఉండే ప్రశాంతమైన రిసార్ట్స్ లేదా హిల్ స్టేషన్లు బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా అత్యవసర వైద్య సదుపాయాలు, మంచి హాస్పిటల్స్ అందుబాటులో ఉండే ఏరియాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ చలి, విపరీతమైన వేడి ఉండే చోట్లకు అలాగే ఇన్ఫెక్షన్లు, దోమల భయం ఉన్న ప్రాంతాలకు అస్సలు వెళ్లకూడదు.
బ్యాగులో ఇవి ఉండాల్సిందే:
ఈ స్పెషల్ ట్రిప్‌కు వెళ్లేటప్పుడు ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్, డాక్టర్ రాసిచ్చిన మందులు, విటమిన్ టాబ్లెట్స్ కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి. గర్భిణీలు వేసుకోవడానికి వీలుగా ఉండే లూజ్ కాటన్ డ్రెస్సులు, ఫ్లాట్ చెప్పులు వాడాలి. ప్రయాణంలో ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్నగా నడవడం, బాడీని స్ట్రెచ్ చేయడం చేయాలి. అలాగే ఎప్పటికప్పుడు హెల్తీ ఫుడ్, మంచి నీళ్లు తీసుకుంటూ ఉండాలి.
బేబీమూన్ అనేది కేవలం ఒక టూర్ మాత్రమే కాదు.. కాబోయే తల్లిదండ్రులు జీవితాంతం దాచుకునే ఒక అందమైన జ్ఞాపకం. రాబోయే సరికొత్త బాధ్యతలకు మానసికంగా సిద్ధమవడానికి, రిలాక్స్ అవ్వడానికి ఈ ట్రెండ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీతో ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకుని, సరైన జాగ్రత్తలతో ఒక సేఫ్ అండ్ బ్యూటిఫుల్ బేబీమూన్ ప్లాన్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు..
