కెనడాలో 1.5 కోట్ల మంది భారతీయులు స్థిరపడితే? ఆర్థిక వ్యవస్థ- మౌలిక సదుపాయాలు- భవిష్యత్తుపై విశ్లేషణ!
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద భూభాగం కలిగిన కెనడా (దాదాపు 99.8 లక్షల చదరపు కిలోమీటర్లు) తన విస్తీర్ణానికి సరిపడే స్థాయిలో జనాభా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
By: Sivaji Kontham | 15 Oct 2026 10:00 PM ISTకెనడా దేశానికి భారతీయుల వలస గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. స్థానికంగా పిల్లల పుట్టుక తక్కువై, వృద్ధుల సంఖ్య అసాధారణంగా పెరగడంతో కెనడా ఇప్పుడు ఊహించని ముప్పును ఎదుర్కొంటోందనే కథనాలొస్తున్నాయి. అయితే కెనడాలో కొత్తగా మరో 1.5 కోట్ల మంది భారతీయులు స్థిరపడితే ఏమవుతుందనే ఆలోచన.. దీని చుట్టూ ఉత్పన్నమయ్యే పరిణామాలు అత్యంత ఆసక్తికరమైనవి. ప్రస్తుతం కెనడా జనాభా సుమారు 4.18 కోట్లుగా ఉండగా, కొత్తగా 1.5 కోట్ల మంది వలసదారులు తోడైతే ఆ దేశ మొత్తం జనాభా ఒక్కసారిగా 5.68 కోట్లకు చేరుకుంటుంది. అంటే దాదాపు 35.9 శాతానికి పైగా అసాధారణ జనాభా పెరుగుదల నమోదవుతుంది. అయితే ఈ ఊహను కేవలం భారతీయుల సంఖ్య లేదా జనాభా గణాంకాల కోణంలోనే కాకుండా, ``ఇంతటి భారీ స్థాయి వలసలను కెనడా ఆర్థిక వ్యవస్థ - మౌలిక వసతులు అసలు తట్టుకోగలవా?`` అనే ప్రాథమిక ప్రశ్న చుట్టూ విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలను అర్థం చేసుకోవాల్సి ఉంది.
ఆర్థికంగా చూస్తే.. కెనడా తీవ్రమైన వృద్ధాప్య జనాభా సమస్యను, తక్కువ జననాల రేటును ఎదుర్కొంటోంది. ఉద్యోగ మార్కెట్లో కార్మికులు.. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను భర్తీ చేయడానికి వలసదారులు ఆ దేశానికి అత్యంత ఆవశ్యకం. ఐటీ, ఆరోగ్య సంరక్షణ, నిర్మాణం, తయారీ వంటి కీలక రంగాల్లో భారతీయ యువత రాక ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచి కెనడా మొత్తం జీడీపీ వేగంగా పెరగడానికి దోహదపడుతుంది. అయితే కార్మిక శక్తి విపరీతంగా పెరగడం వల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగ పోటీ తీవ్రమై.. మొత్తం దేశ ఉత్పత్తి పెరిగినా తలసరి ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగకపోవచ్చనే అంచనా కూడా ఉంది.
ఇంతటి భారీ జనాభా ప్రభావాన్ని తట్టుకోవడంలో కెనడాకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు గృహ వసతి, రవాణా రంగం. ఇప్పటికే టొరంటో, వాంకోవర్ వంటి ప్రధాన నగరాల్లో ఇళ్ల కొరత, విపరీతమైన అద్దెలు.. గృహ కొనుగోలు ధరలు సామాన్యులకు భారాన్ని కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో కొత్తగా కోటిన్నర మంది తోడైతే.. దానికి అనుగుణంగా కెనడా ప్రభుత్వం గృహ నిర్మాణ వేగాన్ని, పట్టణ మౌలిక వసతులను పెంచలేకపోతే వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. అద్దెలు ఆకాశాన్ని అంటి... రవాణా వ్యవస్థలు స్తంభించిపోయే ప్రమాదం ఉన్నందున.. స్థానిక ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.
ఇక సామాజిక సేవలు, ఆరోగ్య భద్రత విషయానికి వస్తే ఒత్తిడి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత భారీ జనాభాకు సరిపడా వైద్యులు, ఆసుపత్రి పడకలు, పాఠశాలలు, డేకేర్ కేంద్రాల అవసరం తక్షణమే ఏర్పడుతుంది. కెనడా ప్రభుత్వం తన బడ్జెట్ పెట్టుబడులను ప్రజా సేవలపై విపరీతంగా పెంచకపోతే విద్య, వైద్య రంగాల నాణ్యత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అందుకే కెనడా కేవలం వలసదారుల అనుమతులపై మాత్రమే కాకుండా.. దానికి సమాంతరంగా గృహ నిర్మాణాలు.. ప్రజా వసతుల కల్పన విధానాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత కీలకం కానుంది.
మరోవైపు ఈ స్థాయి వలసలు కెనడా సామాజిక, సాంస్కృతిక స్వరూపంలో ఎంతో సానుకూలమైన మార్పులను తీసుకువస్తాయి. భారతీయ భాషలు, వైవిధ్యమైన ఆహార సంస్కృతి, వ్యాపారాలు, పండుగల విస్తరణ కెనడియన్ బహుళత్వ సమాజానికి కొత్త రంగులను అద్దుతాయి. స్థానిక సమాజంతో భారతీయులు వేగంగా కలిసిపోయే స్వభావం, భాషా నైపుణ్యాలు, పని రాక్షసత్వం ఆ దేశ సామాజిక సమన్వయానికి తోడ్పడతాయి. అతిశయోక్తి లేకుండా చెప్పాలంటే కెనడియన్ జీవన విధానంలో భారత్ ఒక అంతర్భాగంగా మారిపోతుంది.
ఇదే సమయంలో భారతదేశంపైన కూడా దీని ప్రభావం భారీగా ఉంటుంది. కెనడా నుంచి భారత్కు వచ్చే విదేశీ నదు బదిలీలు భారీగా పెరిగి.. ఇక్కడి అనేక కుటుంబాల ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడతాయి. అయితే నైపుణ్యాలు కలిగిన యువత- మేధావులు పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్లడం వల్ల దేశీయంగా కొంత మేధో వలస సవాలు ఎదురైనా.. అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల ప్రాబల్యం, ఆర్థిక - సామాజిక సంబంధాలు బలపడటానికి ఇది మార్గం సుగమం చేస్తుంది.
కెనడాకు భారతీయుల రాక లాభమా లేక భారామా అనేది కేవలం ఆ తరలివచ్చే వలసదారుల సంఖ్యపై మాత్రమే ఆధారపడి ఉండదు. వచ్చే వారి వద్ద ఉన్న నైపుణ్యాలు.. వారికి దక్కే ఉద్యోగ అవకాశాలు.. కెనడా ప్రభుత్వాల గృహ నిర్మాణ వేగం, మౌలిక వసతులపై చేసే పెట్టుబడులు .. సామాజిక సమన్వయం వంటి సమగ్ర అంశాలే ఆ దేశ భవిష్యత్తును.. తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి. సమర్థవంతమైన ప్రణాళికలు ఉంటే ఇది కెనడాకు మహర్దశగా మారగా.. దానికి విరుద్ధంగా సరైన మౌలిక వసతులు లేకపోతే తీవ్ర ఆర్థిక భారంగా పరిణమించే అవకాశం ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ విశ్లేషణల ఆసరాగా భవిష్యత్ కోసం ఏం చేయాలో కెనడా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది.
ప్రపంచంలోనే రెండో పెద్ద దేశానికి ఏమిటి ఈ దుస్థితి?
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద భూభాగం కలిగిన కెనడా (దాదాపు 99.8 లక్షల చదరపు కిలోమీటర్లు) తన విస్తీర్ణానికి సరిపడే స్థాయిలో జనాభా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ దేశ భౌగోళిక పరిస్థితులే దీనికి ప్రధాన కారణం. కెనడాలోని 60 శాతానికి పైగా భూభాగం సంవత్సరం పొడవునా గడ్డకట్టే తీవ్ర శీతల వాతావరణం, మంచు కొండలతో నిండి ఉండటం వల్ల అక్కడ జీవించడం, వ్యవసాయం చేయడం లేదా మౌలిక సదుపాయాలు నిర్మించడం అత్యంత కష్టం. అందుకే ఆ దేశ జనాభాలో దాదాపు 90 శాతం మంది అమెరికా సరిహద్దుకు సమీపంలో ఉండే వెచ్చని దక్షిణ ప్రాంతంలోనే కేంద్రీకృతమై నివసిస్తున్నారు.
దీనికి తోడు కెనడాలో సంతానోత్పత్తి రేటు (1.33) పడిపోవడం.. వృద్ధుల జనాభా వేగంగా పెరిగిపోతుండటం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. కొత్తగా పుట్టే పిల్లల సంఖ్య తగ్గిపోతూ... పనిచేసే తరం రిటైర్ అవుతుండటంతో ఐటీ, వైద్యం, నిర్మాణం, తయారీ వంటి దాదాపు అన్ని రంగాల్లోనూ మానవ వనరుల కొరత తీవ్రమైంది. ఈ సమస్య నుంచి బయటపడటానికే కెనడా ప్రభుత్వం భారత్ వంటి దేశాల నుంచి నైపుణ్యం కలిగిన యువతను, విద్యార్థులను ఏటా లక్షల సంఖ్యలో ఆహ్వానిస్తూ తమ దేశ పురోగతికి వలసదారులపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. అయితే మౌలిక వసతుల కల్పనలో వెనకబడింది. ఈ పరిస్థితులు మారాలని నిపుణులు సూచిస్తున్నారు.
