Begin typing your search above and press return to search.

కలెక్టరేట్ ఆఫీస్...టీడీపీ జనసేనల మధ్య వార్ స్టార్ట్ ?

పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టరేట్ శాశ్వత భవనాల నిర్మాణం విషయం ఇపుడు కూటమిలో చిచ్చు రాజేసేలా ఉందని అంటున్నారు.

By:  Satya P   |   26 Aug 2025 10:25 PM IST
కలెక్టరేట్ ఆఫీస్...టీడీపీ జనసేనల మధ్య వార్ స్టార్ట్ ?
X

పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టరేట్ శాశ్వత భవనాల నిర్మాణం విషయం ఇపుడు కూటమిలో చిచ్చు రాజేసేలా ఉందని అంటున్నారు. అన్ని ఆఫీసులు కలసి ఒక్క చోట ఉండేలా జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఒక వైపు సిద్ధమవుతున్నాయి. గత మూడేళ్ళుగా కలెక్టర్ భవనం అద్దె ఇంట్లో ఉంటోంది దాంతో సువిశాలంగా సొంత భవనం నిర్మాణం చేసి అక్కడ ఏర్పాటు చేయలాని ప్రభుత్వం భావిస్తోంది అయితే కలెక్టరేట్ ఎక్కడ ఉండాలి అన్న దాని మీద అయితే కూటమి ఎమ్మెల్యేల మధ్య ప్రతిష్టంభన నెలకొంది అని అంటున్నారు.

భారీ ఆఫర్ తో రఘురామ :

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామ క్రిష్ణంరాజు కలెక్టరేట్ ఆఫీసు నిర్మాణం కోసం తన వంతుగా భారీ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కలెక్టరేట్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని తానే సమకూర్చడంతో పాటు నిర్మాణ ఖర్చులో సగం భరిస్తానని భారీ ఆఫర్ ఇచ్చారు కొత్త జిల్లా ఏర్పడిన నాటి నుంచి కలెక్టరేట్ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోందని ఆయన చెబుతూ శాశ్వత భవనం కావాల్సి ఉందని అన్నారు.

కోట్ల రూపాయలు విరాళంగా :

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని భావిస్తున్నట్లుగా రఘురామ క్రిష్ణం రాజు ప్రకటించారు. దీనికి మొత్తం 70 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారని అయితే ఇందులో నుంచి తాను 35 కోట్ల రూపాయలు భరిస్తాను అని మరో 35 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. ఆ విధంగా స్థలం ఇస్తానని, సగం డబ్బు కూడా ఇస్తానని మాట ఇచ్చాను అని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంపై కొందరు సంకుచిత స్వభావంతో మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తాను భీమవరం, ఉండి అని వేరుగా చూడటం లేదని, జిల్లా అంతా ఒకే యూనిట్‌గా భావిస్తున్నానని స్పష్టం చేశారు. అంతే కాదు ఈ బృహత్ కార్యక్రమానికి త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తాను స్వయంగా కోరినట్లు రఘురామకృష్ణరాజు వెల్లడించారు.

భీమవరంలోనే అంటూ :

మరో వైపు చూస్తే కనుక పశ్చిమగోదావరి జిల్లా. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ భీమవరం నుంచి తరలిపోతుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రజలు అపోహలను నమ్మవద్దని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు స్పష్టం చేస్తున్నారు. త్వరలో 25 ఎకరాల్లో సుందరీకరణ చేపడుతూ అద్భుతమైన కలక్టరేట్ ను నిర్మిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టరేట్ అనేది అందరికీ ఉపయోగకరమైనదని, అందరూ అధికారులు ఒకే చోట ఉండాలన్నదే తన ఆలోచన అని ఆయన చెబుతున్నారు.

ఏడు నియోజకవర్గాలకు అందుబాటులో :

కలెక్టరేట్ లోని అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండాలంటే సుమారు 25 ఎకరాలు స్థలం కావాల్సి ఉందన్నారు. దాని కోసం దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, తాడేరులో స్థలాలను చూస్తున్నామని, కలక్టరేట్ చక్కగా

ఉండేలా తీర్చిదిద్దుతామని అన్నారు. గతంలో తాను కలెక్టరేట్ కు అయిదు ఎకరాలు అందిస్తామన్నమని, కానీ 25 ఎకరాలు ఉండాలని, పెరేడ్ గ్రౌండ్, పార్కింగ్, వీఐపీ ల పార్కింగ్ ఇలా ఎన్నో వాటికి స్థలం ఎక్కువ కావాల్సి ఉందన్నారు. జిల్లాలో 7గురు ఎమ్మెల్యేలకు అనువుగానే భీమవరం నియోజకవర్గం లో కలెక్టరేట్ ను ఏర్పాటు చేస్తామని, తరలి వెళ్ళడం అనేది అవాస్తవమని అన్నారు.

మొత్తం మీద చూస్తే రఘురామ ఉండిలో కలెక్టరేట్ ని ఏకంగా రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తామని తాను భూమితో పాటు 35 కోట్లు ఇస్తామని చెబుతున్నారు. చంద్రబాబుతోనే శంకుస్థాపన చేయిస్తామని కూడా చెప్పారు. మరో వైపు భీమవరం ఎమ్మెల్యే జనసేనకు చెందిన రామాంజనేయులు మాత్రం భీమవరంలోనే కలెక్టరేట్ ఉండాలని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాల్సి ఉంది.