Begin typing your search above and press return to search.

34 లక్షల మంది మృతి.. బెంగాల్ లో వెలుగులోకి తెచ్చిన సర్..

సీఎం మమతా ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆధార్ అధికారులు ఎన్నికల సంఘానికి సంచలన నివేదిక ఇచ్చారు.

By:  Tupaki Political Desk   |   14 Nov 2025 1:00 AM IST
34 లక్షల మంది మృతి.. బెంగాల్ లో వెలుగులోకి తెచ్చిన సర్..
X

దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-SIR) రెండో విడత మొదలైంది. బిహార్ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో సర్ నిర్వహించిన ఎన్నికల సంఘం తాజాగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న బెంగాల్, తమిళనాడుతోసహా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 321 జిల్లాలు, 1843 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 51 కోట్ల ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం పరిశీలించనుంది. ఈ ప్రక్రియను నిరసిస్తూ ఇప్పటికే బెంగాల్ లో నిరసనలకు అధికార పార్టీ పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మరోవైపు బెంగాల్ లో మరణించిన 34 లక్షల మందికి ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి నివేదిక అందింది. ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయని అంటున్నారు.

సర్ వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రజలను వేధిస్తోందని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు హడావుడిగా ఈ కార్యక్రమం చేపట్టడంపై మమతా బెనర్జీ మండిపడుతున్నారు. సర్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున బీజేపీ ప్రభుత్వం తనను జైలుకు పంపుతుందని లేదంటే గొంగతు కోస్తుందని మండిపడ్డారు. తనను ఎంతలా వేధించినా ప్రజల ఓటు హక్కును కాలరాయొద్దని వేడుకుంటున్నట్లు తెలిపారు.

సీఎం మమతా ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆధార్ అధికారులు ఎన్నికల సంఘానికి సంచలన నివేదిక ఇచ్చారు. బెంగాల్ లో ఆధార్ వ్యవస్థ ప్రవేశపెట్టిన నుంచి ఇప్పటివరకు దాదాపు 34 లక్షల మంది మరణించారని తమ నివేదికలో ఎన్నికల సంఘానికి తెలియజేశారు. ఎస్ఐఆర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ తో యూఐడీఏఐ అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓటర్ల జాబితాను ధ్రువీకరించుకోడానికి, అందులో వ్యత్యాసాలను గుర్తించడానికి ఆధార్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్ని రాష్ట్రాల సీఈవోలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మరణించిన ఓటర్లు, జాబితాలో నకిలీ పేర్లకు సంబంధించి ఈసీకి భారీగా ఫిర్యాదులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరణించిన వారి ఓట్లను తొలగించేందుకు యూఐడీఏఐ తమకు సహకరిస్తుందని ఈసీ ప్రకటించింది.

ఇక ఈసీ నిర్ణయంతో బెంగాల్ అంతటా మరణించిన ఓటర్లు, నకిలీ పేర్లను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తున్నారని, 2025 ఎన్నికల జాబితా ఆధారంగా ఎన్యూమరేషన్ ఫారమ్స్ పంపిణీ చేస్తూ ధ్రువీకరణ ప్రక్రియ చేపడుతున్నారని ఈసీ తెలిపింది. అలా బీఎల్వోలు సేకరించిన డేటాను 2002 ఎన్నికల జాబితాలతో పోల్చి వచ్చిన సమాచారాన్ని నిర్ధారిస్తున్నామని వెల్లడించారు. డ్రాఫ్ట్ రోల్‌లో చనిపోయిన లేదా నకిలీ ఓటర్లు ఉన్నట్లు తెలితే అందుకు సంబంధిత బీఎల్‌ఓలపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ పరిస్థితుల్లో బెంగాల్ లో సర్ ప్రక్రియ మంటలు పుట్టిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళుతోంది. దీంతో బెంగాల్ లో సర్ ప్రక్రియకు ఎలా ముగింపు పలుకుతారనేది ఉత్కంఠ రేపుతోంది.