గురువారం ఒక్కరోజులోనే పశ్చిమ బెంగాల్ లో అంత హింసా?
దేశంలోని నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి.
By: Garuda Media | 8 May 2026 12:56 PM ISTదేశంలోని నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. మిగిలిన చోట్లకు భిన్నంగా పశ్చిమ బెంగాల్ లో పరిస్థితులు ఉండటం తెలిసిందే. తమిళనాడులో ఎవరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకపోవటంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడగా.. స్పష్టమైన మెజార్టీ పొందిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. అయితే.. అందుకు భిన్నంగా మరెక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రాజకీయ హింసకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
తాజాగా అందుతున్న రిపోర్టుల ప్రకారం చూస్తే రాజకీయ హింస కారణంగా ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లుగా చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ.. పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయన్న దానికి భిన్నంగా హింస పెరుగుతోంది. మరింత ఆశ్చర్యం కలిగించే అంశం ఏమంటే.. గురువారం నాటికి బెంగాల్ లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు.. హింసను తగ్గించేందుకు సుమారు 70వేల కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. అయినప్పటికి పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం గమనార్హం.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి బుధవారం వరకు జరిగిన రాజకీయ హింస కంటే.. గురువారం ఒక్కరోజు చోటు చేసుకున్న హింస మరింత ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురి చేసే అంశంగా చెప్పాలి. రాష్ట్రంలోని వందలాది గ్రామాల్లో ఒకే సమయంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. కేంద్ర బలగాలు ఉన్నప్పటికి వారికి స్థానిక భాష తెలీకపోవటంతో అల్లర్లను అదుపు చేయటం పెద్ద కష్టంగా మారింది.
ప్రస్తుతం న్యాయస్థానాలు.. ఎన్నికల కమిషన్ జోక్యం కారణంగా ఇప్పటివరకు 433 మందిని అరెస్టు చేశారు. హింసాత్మక ఘటనల్ని నిరోధించేందుకు 1100 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో 200లకు పైనే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజులో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్ని చూస్తే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.
బీజేపీ అగ్రనేత.. ముఖ్యమంత్రి రేసులో ముందున్న సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడు.. పీఏ చంద్రనాథ్ రత్ ను బుధవారం అర్థరాత్రి హత్యకు గురి కావటం.. దీనికి సంబంధించిన సమాచారంతో గురువారం ఉదయం బెంగాల్ ప్రజలు ఉలిక్కిపడిన పరిస్థితి. ఈ విషాద ఉదంతంతో ఉత్తర 24 పరగణాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా పాణిహతి ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలపై ముడి బాంబుల దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు మోటారు సైకిళ్లపై వచ్చి దాడికి పాల్పడ్డారు.
బషీర్ హట్ పరిధిలోని నజాత్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘర్షణల్లో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. ఇందులో ఇద్దరు కేంద్ర బలగాల జవాన్లు ఉండటం గమనార్హం. సందేశ్ ఖాలీలో పోలీస్ పెట్రోలింగ్ బృందంపై గురువారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. బెంగాల్ లోని వివిధ జిల్లాల్లో 200లకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే.. కొత్త ప్రభుత్వం ఏర్పడితే తప్పించి.. ఈ రాజకీయ హింస ఒక కొలిక్కి వచ్చే వీల్లేదన్న వాదన వినిపిస్తోంది. ఏమైనా.. బెంగాల్ లో అధికార బదిలీ వేళ ఇంత హింసా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
