Begin typing your search above and press return to search.

'సువేందు అవినీతి పరుడు'.. సోషల్ మీడియా వేధికగా కాంగ్రెస్ దాడి..

సువేందు అధికారి నియామకాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపించింది.

By:  Tupaki Political Desk   |   9 May 2026 2:19 PM IST
సువేందు అవినీతి పరుడు.. సోషల్ మీడియా వేధికగా కాంగ్రెస్ దాడి..
X

రాజకీయాల్లో ‘శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు’ అనే మాట పశ్చిమ బెంగాల్ తాజా పరిణామాలను చూస్తుంటే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఒకప్పుడు ఏ వ్యక్తిని అయితే ప్రధాని తీవ్రంగా విమర్శించారో, ఇప్పుడు అదే వ్యక్తి రాష్ట్ర పగ్గాలు చేపట్టడం అనేది రాజకీయ వ్యూహాల్లో భాగమే అయినప్పటికీ, సోషల్ మీడియా పుణ్యమా అని పాత వీడియోలు బయటకు వచ్చి పాలకులను ఇరకాటంలో పడేస్తున్నాయి. విమర్శలకు పదును పెడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ పాత వీడియోను అస్త్రంగా వాడుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. బీజేపీ నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఇవాళ (09 మే, 2026) ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ సందర్భంగా ప్రధాని మోదీ గతంలో ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాంగ్రెస్ వైరల్ వీడియో..

సువేందు అధికారి నియామకాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపించింది. బెంగాల్‌లో సువేందు అధికారి అత్యంత అవినీతిపరుడు అంటూ ప్రధాని మోదీ 2016లో చేసిన ఆరోపణల వీడియోను కాంగ్రెస్ పోస్ట్ చేసింది. అప్పట్లో అవినీతిపరుడిగా ముద్ర వేసిన వ్యక్తిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ మండిపడింది.‘అందినంత దోచుకో.. నాకు కూడా వాటా ఇవ్వు.. అవినీతిని నలుదిక్కులా విస్తరించు.. ఇదే మోదీ ఫిలాసఫీ’ అంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది.

సువేందు రాజకీయ ప్రయాణం

ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న సువేందు అధికారి రాజకీయ ప్రస్థానం ఎన్నో మలుపులతో సాగింది. తొలుత తృణమూల్ కాంగ్రెస్‌లో (TMC) కీలక నేతగా ఉన్న సువేందు, 2020లో ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో (BJP) చేరారు. చాలా సంవత్సరాలు పార్టీని ప్రభుత్వంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడ్డారు. గతంలో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ సారా స్వయానా ఆయన టీఎంసీ సీఎం మమతా బెనర్జీపై అధిక మెజారిటీతో గెలుపొందారు. ఇవాళ ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

రాజకీయాల్లో నైతికతపై చర్చ

ఈ పరిణామం రాజకీయాల్లో సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యమా? అనే చర్చకు దారితీస్తోంది. గతంలో చేసిన విమర్శలను పక్కన పెట్టి, రాజకీయ అవసరాల కోసం నాయకులను చేర్చుకోవడం, వారికి కీలక పదవులు ఇవ్వడంపై సామాన్యుల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాత వీడియోలు, పాత ప్రకటనలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండడంతో, రాజకీయ నాయకులు తమ మాటలపై నిలబడటం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.

2016లో సువేందు అధికారిని అత్యంత అవినీతిపరుడంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించిన పాత వీడియోను కాంగ్రెస్ ఇప్పుడు తెరపైకి తెచ్చి, బీజేపీ ద్వంద్వ నీతిని ఎండగడుతోంది. అధికార దాహంతోనే పాత విమర్శలను పక్కన పెట్టి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికే ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించారని కాంగ్రెస్ చేస్తున్న ఈ విమర్శలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరిన సువేందు అధికారికి పశ్చిమ బెంగాల్ పగ్గాలు అప్పగించడం వెనుక బీజేపీ తనదైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోంది. 2020లో పార్టీ మారిన తర్వాత సువేందుపై ఉన్న పాత ఆరోపణలన్నీ మరుగున పడిపోయాయా అనే ప్రశ్నలను ఇప్పుడు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌ను తమ వశం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీకి సువేందు అధికారి ఒక బలమైన అస్త్రంగా మారారు. అయితే, ప్రధాని గతంలో చేసిన ఆరోపణలే ఇప్పుడు ఆయనకు, పార్టీకి ఇబ్బందిగా మారడం రాజకీయ చమత్కారం. ఈ విమర్శల మధ్య సువేందు అధికారి బెంగాల్‌లో ఎటువంటి పాలన అందిస్తారో వేచి చూడాలి.