హిస్టరీ రిపీట్.. బెంగాల్ లో అధికార బదిలీ రక్తసిక్తమే
అధికార బదిలీ అనివార్యం. ఒక రోజు కాకపోతే మరో రోజు.. ఎన్ని దశాబ్దాలు తిరుగులేని అధికారాన్ని చెలాయించినా.. దానికి కాలం చెల్లే రోజు ఒకటి ఉంటుంది.
By: Garuda Media | 8 May 2026 4:00 PM ISTఅధికార బదిలీ అనివార్యం. ఒక రోజు కాకపోతే మరో రోజు.. ఎన్ని దశాబ్దాలు తిరుగులేని అధికారాన్ని చెలాయించినా.. దానికి కాలం చెల్లే రోజు ఒకటి ఉంటుంది. అందుకు పశ్చిమ బెంగాల్ మినహాయింపు కాదు. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికి.. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా పశ్చిమ బెంగాల్ లో అధికార బదిలీ ఎప్పుడు రక్తసిక్తమే అవుతుంది. కమ్యునిస్టులు సుదీర్ఘకాలం పాలించిన ఈ రాష్ట్రంలో ఈ దరిద్రపుగొట్టు సంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఏళ్లకు ఏళ్లు అధికారంలో పాతుకుపోవటం.. తమ నుంచి అధికారం మరొకరికి చేతుల్లోకి వెళ్లటానికి అంగీకరించని అధికార పార్టీ.. కొత్తగా అధికారంలోకి వచ్చే పార్టీకి చెందిన వారు అప్పటివరకు తాము ఎదుర్కొన్న వేధింపులకు తగిన పాఠం చెప్పాలన్న అత్యుత్సాహం.. వెరసి పశ్చిమ బెంగాల్ లో రాజకీయ హింస పెద్ద ఎత్తున తెర మీదకు వస్తుంది.
ప్రతి ఎన్నికల తర్వాత ఇలాంటి పరిస్థితి అంతో ఇంతో ఉంటుంది. ఎప్పుడైతే.. అధికార బదిలీ ఒక పార్టీ నుంచి మరోపార్టీకి బదిలీ అయ్యే సమయంలో మాత్రం ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. చరిత్రను చూస్తే.. బెంగాల్ లో విషయంలో ఇదెంత నిజమన్నవి ఇట్టే అర్థమవుతుంది. 2011లో దగ్గర దగ్గర మూడున్నర దశాబ్దాల పాలన (సరిగ్గా చెప్పాలంటే 34 ఏళ్లు) అంతం చేస్తూ మమతా బెనర్జీ (టీఎంసీ) అధికారంలోకి వచ్చారు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న హింస అంతా ఇంతా కాదు.
దశాబ్దాల తరబడి తమ చేతిలో ఉన్న అధికారం చేజారిపోవటాన్ని కమ్యునిస్టు నేతలు.. కార్యకర్తలు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అప్పట్లో టీఎంసీ.. సీపీఎం కార్యకర్తల మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాజకీయ హత్యలు.. ఇళ్లను తగలబెట్టటం.. బాంబు దాడులు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ హింస తీవ్రత ఎంతన్న దానికి నిదర్శనంగా అప్పటి గణాంకాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2011 ఎన్నికల సమయంలోనూ.. ఆ తర్వాత జరిగిన హింసలో సుమారు 50-60 మంది వరకు రాజకీయ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతే.. దాడికి గురైన ఆస్తులు ఎన్నో రెట్లు ఎక్కువగా చెబుతారు.
ఈ రాజకీయ హింసను అదుపులోకి తీసుకురావటానికి దాదాపు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టింది.కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో యంత్రాంగాన్ని చేతుల్లోకి తీసుకున్న తర్వాతే పరిస్థితి కుదుటపడింది. బెంగాల్ లో మాదిరే కేరళ లాంటి రాష్ట్రాల్లో రాజకీయ హింస ఉన్నప్పటికి.. బెంగాల్ లో పోలిస్తే మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. మొదట్నించి బెంగాల్ లో పొలిటికల్ సెటప్ కాస్త భిన్నంగా ఉంటుంది. సామాన్యుడికి నిబంధనల ప్రకారం రావాల్సిన రేషన్ కార్డు సైతం రాజకీయ జోక్యంతోనే వస్తుంది. లేదంటే రాదు.
అందుకే.. ఎవరైనా అధికార పార్టీ క్యాడర్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అంతగా అధికారాన్ని ప్రదర్శించిన వారికి.. ఉన్నట్లుండి ఒక్కసారి ఎన్నికల ఫలితాలతో తమ ఉనికే లేకుండా పోయిందన్న వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేని పరిస్థితి. అదే పెద్ద ఎత్తున హింసకు దారి తీస్తుందని చెబుతారు. దీనికి తోడు.. అధికారంలోకి వచ్చే పార్టీ కూడా.. అప్పటివరకు తమ ప్రత్యర్థి పార్టీలు పెట్టే ఇబ్బందులకు చెక్ చెప్పే సమయం వచ్చిందని చెలరేగిపోవటం కూడా రాజకీయ హింసకు కారణమవుతుంది.
మరో షాకింగ నిజం ఏమంటే.. బెంగాల్ లో కమ్యునిస్టుల కాలం నుంచి ఒక దరిద్రపు కల్చర్ మొదలైంది.అధికారమే బలంగా భావిస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకే గుండాలు.. రౌడీలు షిప్టు అవుతారు. కమ్యునిస్టు కోటను బద్దలు కొట్టిన దీదీ చేతికి అధికారం రావటం అప్పట్లో నచ్చలేదు. కాలక్రమేణ.. తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న దీదీకి తాజాగా వెల్లడైన ఫలితాలు జీర్ణించుకోలేని పరిస్థితి. తమ బద్ధ శత్రువు విజయం సాధించిన వైనంతో ఇప్పుడు టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయి. అదే తాజా హింసకు కారణం. అందుకే అంటారు.. బెంగాల్ లో అధికార మార్పిడి అంటే.. అది రక్తసిక్తమే. ఆ మాటకు తగ్గట్లే ఇప్పటి పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి.
